‘పులిచింతల’ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించిన గుంటూరు జిల్లాకు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రాధాన్యం లభించడం లేదు. కృష్ణా జిల్లా నేతలు ఈ ప్రారంభోత్సవాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో గుంటూరు నేతల్ని పూర్తిగా విస్మరించారు.
సాక్షిప్రతినిధి, గుంటూరు
‘పులిచింతల’ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించిన గుంటూరు జిల్లాకు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రాధాన్యం లభించడం లేదు. కృష్ణా జిల్లా నేతలు ఈ ప్రారంభోత్సవాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో గుంటూరు నేతల్ని పూర్తిగా విస్మరించారు. ఇక్కడి నేతల మధ్య అనైక్యత, మారిన రాజకీయ పరిణామాలను ఆసరా చేసుకుని కృష్ణా నేతలు హల్‌చల్ చేస్తున్నారు. అచ్చంపేట వద్ద నిర్మించిన సాగునీటి ప్రాజెక్టు ‘పులిచింతల’ను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిర ణ్‌కుమార్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం, సభ కార్యక్రమాల నిర్వహణలో గుంటూరు జిల్లా నేతలను పూర్తిగా విస్మరించారనే చెప్పాలి.
మంత్రి పార్థసారధి ప్రాజెక్టు ప్రారంభం, బహిరంగ సభకు సంబంధించిన వివరాలను ప్రతికల వారికి వివరించే సమయంలోనూ ఇక్కడి నేతలను పట్టించుకోలేదు. ఇక్కడ నేతలెవరూ లేన్నట్టు గుంటూరు వచ్చి మరీ ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కూడా చర్చనీయాంశమైంది. ముగ్గురు మంత్రులు, స్పీకర్, నలుగురు ఎమ్మెల్సీలతో మినీ కేబినెట్‌గా గుంటూరు జిల్లాకు గుర్తింపు ఉంది. అయితే వీరిందరినీ పక్కనపెట్టి కృష్ణాజిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి సారధి ప్రారంభోత్సవానికి సారధ్యం వహిస్తున్నారు. దీనంతటికీ మారిన రాజకీయ పరిణామాలే కారణంగా పేర్కొంటున్నారు.
ఇటీవల ఏఐసీసీ పిలుపు మేరకు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పలుమార్లు ఢిల్లీ వెళ్లి అక్కడి నేతలతో మంతనాలు జరిపారు. ఒక దశలో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి లేదా సీఎం పదవి వరించే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. ఈ పరిణామం సహజంగా ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌కు కంటగింపుగా మారింది. తన కంట్లో నలుసుగా మారిన కన్నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండానే ఆయన కోటరీతో పనులు చేయించినట్టు తెలుస్తోంది. ఆయన కోటరీకి చెందిన పార్థసారధితోపాటు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ప్రారంభోత్సవాన్ని కృష్ణాజిల్లాలో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రాజెక్టు వద్ద కేవలం ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేసి, బహిరంగ సభను విజయవాడలో ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఇదే. ఇక గుంటూరులోని కాంగ్రెస్ నేతలు తలో దిక్కు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరతారని, నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో సఖ్యతతో మెలిగే మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిద్ద రు ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం గురించి పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్, సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డిలు కూడా ఈ విషయంలో సరైన విధంగా స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రైతాంగ ప్రయోజనాలకు దోహదపడే సాగునీటి ప్రాజె క్టు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో జిల్లా నేతల పాత్ర నామమాత్రం కావడం గమనార్హం.