పార్టీమారిన వాళ్లు రాజీనామా చేయూలి
వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్
మార్కాపురం: తమ పార్టీ కండువాలో గెలిచి వేరే కండువా వేసుకున్నవారంతా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పును కోరాలని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. శనివారం మార్కాపురంలోని ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ శాసనసభ స్పీకర్, ప్రభుత్వంపై ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని కోరతామని పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, వారిని అనర్హులుగా ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో రైతు ఆత్మహత్యలు, రాజధాని అధికార పార్టీ నాయకుల, మంత్రుల భూ కుంభకోణాలు, ఇసుక మాఫియా, తదితర అంశాలను ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది స్వర్ణకారులున్నారని, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. చంద్రబాబు బీసీలకు, కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిధులు కేటాయించకుండా మాయమాటలతో కాలం గడుపుతున్నారన్నారు.