అంతా అడ్డదారే...
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ తీరు
సాక్షి, హైదరాబాద్: అడ్డదారే మా రహదారి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. ఆది నుంచి చివరి వరకూ ఇదే తీరుగా వ్యవహరించింది. అధికార ం, మందబలంతో సభను తమ కనుసన్నల్లో నడిపింది. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి ఐదున ప్రారంభమై 30వ తేదీన ముగిశాయి. సభ 15 రోజులు నడిచింది. సభ జరిగినన్ని రోజులు ప్రభుత్వం నిబంధన లు కాలరాసి, తమకు అడ్డం వచ్చిన నిబంధనలను సస్పెండ్ చేసి ఇష్టారీతిగా వ్యవహరించింది. తమ అక్రమాలు, అన్యాయాలు, మొండి వైఖరి, అవినీతిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షం గొంతునొక్కి అడ్డం వచ్చిన వారి అంతు చూస్తామని హెచ్చరించేందుకు శాసనసభ సమావేశాలను ఉపయోగించుకుంది.
పరిష్కారం సంగతటుంచి.. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకే ప్రతిపక్షం శతవిధాల పోరాడాల్సి వచ్చింది. సభలో ఏ అంశంపై చర్చ రాకుండా అధికారపక్షం అడగడుగునా కుట్రలు పన్నింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసింది. రాజధాని ప్రాంతంలో భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సమాధానం చెప్పలేకపోయింది. ఎదురుదాడికి ప్రయత్నించింది. చివరకు ఎలాంటి విచారణా జరిపించబోమంటూ తోకముడిచింది.
చర్చ ముగిసినట్లు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి అధికారబలంతో నెగ్గించుకుని అడ్డదారిలో బైట పడింది. ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగానూ అధికారపక్షం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మూజువాణి ఓటుతో బైట పడింది. ప్రతిపక్షం తన ఎమ్మెల్యేలకు కనీసం విప్ జారీ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. అవిశ్వాసంపై నోటీసును అందుకున్న వెంటనే బీఏసీ నిర్వహించి అప్పటికపుడు చర్చను చేపట్టాలని నిర్ణయించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పి ప్రతిపక్షం ఎంత వాదించినా పట్టించుకోలేదు. ఆ తరువాత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సమయంలోనూ ఇదే తీరుగా వ్యవహరించింది. అవి శ్వాసంపై వెంటనే చర్చ చేపట్టి.. ప్రతిపక్షం విప్ జారీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు.