* పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వ రుణ పరపతి
* నాలుగు నెలలుగా అడిగినంత అప్పు పుట్టని పరిస్థితి
* సెక్యూరిటీల కొనుగోలుకు ఆర్థికసంస్థల వెనకడుగు
* అప్పు దొరికినా దానిపై వడ్డీ రేట్లు పెరుగుతున్న వైనం
* సర్కారుపై పెట్టుబడిదారులకు విశ్వాసం లేకపోవటంవల్లే!
* తమిళనాడుకైతే అడిగిన దాని కన్నా ఎక్కువ అప్పులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ‘ఉత్తమ ప్రభుత్వం’ అవార్డు వచ్చిందంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొన్ని పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వ రుణ పరపతి మాత్రం దారుణంగా పడిపోయింది. సీఎం కిరణ్ ‘ఉత్తమ పాలన’ ప్రభావమో లేక రాష్ట్ర విభజన కారణమో తెలియదు కానీ.. 4 నెలలుగా అడిగినంత అప్పు కూడా పుట్టని దుస్థితికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది. ప్రతి నెలా ఆర్థికశాఖ సెక్యూరిటీల వేలం ద్వారా చేస్తున్న అప్పులే ఇందుకు నిదర్శనం. మరోవైపు తమిళనాడుకైతే అడిగిన దానికన్నా ఎక్కువగా అప్పుల్ని ఆర్థిక సంస్థలు మంజూరు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కుమాత్రం అడిగినదాని కన్నా తక్కువగా అప్పు పుడుతోంది.
అలాగే చేస్తున్న అప్పులపై వడ్డీ శాతమూ పెరుగుతోంది. మిగతా రాష్ట్రా లకన్నా ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లు చేస్తున్న అప్పులపై వడ్డీ శాతం అధికంగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో భాగంగా సెక్యూరిటీల విక్రయం ద్వారా అప్పులు చేస్తుంది. ఇలా చేసిన అప్పులను ఆస్తుల కల్పన రంగాలకు వెచ్చిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలంద్వారా రూ.27,700 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రతి నెలా ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలంవేసి అప్పు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అడిగినంత రుణం పుట్టినప్పటికీ వడ్డీ 8 శాతం నుంచి 9.84 శాతం వరకు పెరిగిపోయింది.
సెప్టెంబర్ నెల 10, 24 తేదీల్లో రెండుసార్లు, అక్టోబర్ 22న మరోసారి, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు సెక్యూరిటీల వేలంతో అప్పుకు వెళ్లినా సర్కారు అడిగినంత అప్పు పుట్టలేదు. ఇందుకు ప్రధాన కారణం వేలంలో ఆర్థిక సంస్థలు ముందుకు రాకపోవడమేనని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ రాష్ట్రప్రభుత్వం అప్పులు చేయటంతోపాటు రాష్ట్ర విభజన ప్రభావమూ కొంతమేర పడిందని, అలాగే రాష్ట్రప్రభుత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం కలగక పోవడమూ రుణపరపతి పడిపోవడానికి కారణమని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. ఇదే సమయంలో తమిళనాడుకు అడిగినదానికన్నా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల చొప్పున ఎక్కువగా అప్పుపుట్టింది.
సర్కారుకు అప్పు తిప్పలు
Published Mon, Dec 23 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement