సాక్షి, హైదరాబాద్: నిత్యం పైరవీకారులతో పాటు వివిధ పనులపై వచ్చే జనంతో సందడిగా ఉండే సచివాలయం ఒక్కసారిగా శనివారం బోసిపోయింది. మొన్నటివరకు వాహనాలు పార్కింగ్‌కే స్థలం దొరకని పరిస్థితి నెలకొంటే ఇప్పుడు వాహనాల పార్కింగ్‌కు ఎక్కడపడితే అక్కడ స్థలం దొరుకుతోంది.
సీఎం పేషీతోపాటు మంత్రుల పేషీలన్నీ ఖాళీ కావడంతో సచివాలయానికి వచ్చే జనం కూడా తగ్గిపోయారు. రాష్ట్రపతి పాలన రావడంతో ఇక ఏ పని జరిగే పరిస్థితి లేకపోవడంతో బయట నుంచి పనులు కోసం వచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక అధికారులు, ఉద్యోగులు మాత్రమే సచివాలయానికి వస్తున్నారు. సీఎం, మంత్రుల పేషీల్లో సామాగ్రి, టేబుల్స్, జిరాక్స్‌లు, కంప్యూటర్లను శనివారం సచివాలయ భవనాల విభాగం లెక్కించింది.
ఆయా పేషీలకు ఎన్ని టేబుల్స్ ఎన్ని కుర్చీలు, ఎన్ని కంప్యూటర్లు ఇచ్చారో అన్నీ ఉన్నాయా లేదా అని లెక్కకట్టి ఆ విభాగం స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. మంత్రుల పేషీల్లో మిగిలిపోయిన ఫైళ్లను ఆయా శాఖలకు వెనక్కు తిప్పి పంపించే పనిని పేషీల సిబ్బంది శనివారం పూర్తి చేశారు. సిబ్బంది కూడా ఆ పేషీలను ఖాళీ చేసి సొంత శాఖలకు సోమవారం వెళ్లిపోనున్నారు. సీఎం పేషీ, మంత్రుల పేషీల్లో సిబ్బంది వారి సొంత శాఖలకు పంపిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి.
బోసిపోయిన సచివాలయం
Published Sun, Mar 2 2014 3:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement