నాలుగున్నర దశాబ్దాలైనా వెలుగుల్లేవు
పోర్టును పొరుగు జిల్లా తన్నుకెళ్లింది
కాగితాలపైనే పారిశ్రామికాభివృద్ధి
గాలిలోనే విమానాశ్రయం
నేడు నలభై ఐదవ జిల్లా ఆవిర్భావ దినోత్సవం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
పేరులోనే ప్రకాశం. అభివృద్ధిలో మాత్రం అంధకారమే. జిల్లా ఆవిర్భవించి నాలుగున్నర దశాబ్దాలవుతున్నా ఇంత వరకు ల్యాండ్ మార్క్ అభివృద్ధి లేకపోవడం దురదృష్టకరం. పోర్టు రూపంలో జిల్లాకు వచ్చిన అవకాశాన్ని ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోలేకపోయారు. పారిశ్రామికాభివృద్ధి కాగితాలపైనే నాట్యమాడుతోంది.
విమానాశ్రయం ఏర్పాటు
గాలి మాటలకే పరిమితమైంది. వెనుకబడిన జిల్లాల్లోని ప్రాంతాలతో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా ఆవిర్భవించి ఆదివారం నాటికి నలభై ఐదేళ్లవుతున్నా అభివృద్ధిలో వెనుకబడే ఉంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 1970 నాటి పరిస్థితులు కనిపించడం పాలకుల వైఫల్యాన్ని ప్రతిఫలిస్తోంది. జిల్లా జనాభా 33 లక్షలు దాటినా అందుకు అనుగుణంగా వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారు. గుక్కెడు నీరు అందని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పనుల కోసం ఇప్పటికీ వేలాది మంది ఇతర జిల్లాలకు క్యూ కడుతున్నారు.
గ్రానైట్ సిరులున్నా...
జిల్లాలో ప్రధానంగా గ్రానైట్, పలకల పరిశ్రమలున్నాయి. గ్రానైట్ రంగంలో ఉపాధి పొందుతున్నవారు జిల్లాకంటే పొరుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. గ్రానైట్ రంగంలో వివిధ విభాగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణలు ఇస్తే జిల్లాలో ఉండే నిరుద్యోగులు వినియోగించుకొని ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలుంటాయి. కోస్టల్ కారిడార్ కింద వేలాది ఎకరాలు సేకరించారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి పారిశ్రామికాభివృద్ధి జరగలేదు.
పోర్టు తన్నుకెళ్లినా పట్టదు..
‘రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తున్నారు. భూ సేకరణ పూర్తయింది. ఇక అభివృద్ధే అభివృద్ధి. ఉపాధే ఉపాధి’ అంటూ జిల్లా మంత్రి మానుగుంట మహీధరరెడ్డి గొప్పగా ప్రకటనలు గుప్పించారు. అయితే మంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల చేతగానితనాన్ని పొరుగు జిల్లావాళ్లు చక్కగా వినియోగించుకున్నారు. రామాయపట్నం పోర్టు పొరుగు జిల్లాకు తన్నుకు వెళ్లినప్పటికీ మంత్రి మహీధరరెడ్డికి, శాసనసభ్యులకు మాత్రం పట్టలేదు. పోర్టు పోయిందన్న బాధ కూడా వారిలో కనిపించకపోవడం గమనార్హం. కొత్తపట్నంలో విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకొస్తున్నా ఫలితం లేదు. ఒంగోలులో వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రిమ్స్ హాస్పిటల్ ఇతర మెడికల్ కాలేజీలను చూసి తలదించుకునే స్థాయికి దిగజారింది. మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ దిశగా సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.
వెలి‘గోడు’ పట్టదు
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులున్నప్పటికీ వాటిలో ఎలాంటి పురోగతి లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఏటా ప్రకటించే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు మెతుకులు విదిలించినట్లుగా నిధులు కేటాయిస్తూ మరింత దిగజారుస్తున్నారు.
సంబరాలకే పరిమితం
ఏటా జిల్లా అవతరణ దినోత్సవాన్ని సంబరాలతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లా మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కుబడిగా ఈ వేడుకల్లో పాల్గొనడం, ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణబద్ధులు అవుతామని ప్రకటించడం తప్పితే ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే తీరు కనబరిస్తే మరో పదేళ్లు అయినా జిల్లాలో అభివృద్ధిని వెతుక్కోవాల్సిందే.
అంధకార ‘ప్రకాశం’
Published Sun, Feb 2 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement