ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిన్నటి వరకు స్పెషలిస్టు పోస్టులన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ, జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఒక్కరే ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందిస్తూ ఆస్పత్రికి ఆయువుపోస్తూ ఊపిరి పోకుండా కాపాడుతూ వస్తున్నారు. మంగళవారం నుంచి ఉన్న ఒక్క డాక్టర్ కూడా అత్యవసర సెలవు పెట్టడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రోగులకు ప్రాణం పోయాల్సిన ఫస్ట్ రిఫరల్ సెంటర్‌లోనే ైవైద్యులు లేని దుస్థితి ఎదురవడంతో, డెప్యూటేషన్‌పై ఇతర పీహెచ్‌సీల నుంచి వైద్యులను పిలిపిస్తున్నారు. గుంటూరుకు కూత వేటు దూరంలో ఉన్న నియోజకవర్గ కేంద్రం, రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రం దుర్గతి ఇది..
ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రం 30 పడకల ఆస్పత్రి. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యనిపుణులు, మత్తుడాక్టర్ వంటి మూడు స్పెషలిస్టు పోస్టులు, ఒక డెంటల్ డాక్టర్, ఒక జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్.. ఇలా మొత్తం ఐదు పోస్టులు ఉండాలి. కానీ మూడు స్పెషలిస్టు పోస్టులు నెలల కాలంగా ఖాళీగానే ఉంటున్నాయి. డెంటల్ డాక్టర్ హమీద్ ఉన్నప్పటికీ ఆయన జనరల్ ఓపీని చూడలేని పరిస్థితి. దీంతో మిగిలిన ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ టీవి చలపతిరావు ఆస్పత్రిని నెట్టుకుంటూ వస్తున్నారు.
మంగళవారం నుంచి ఆయ న కూడా సెలవులో ఉండటంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇది కేవలం సామాజిక ఆరోగ్య కేంద్రం మాత్రమే కాదు. ఫస్ట్‌రిఫరల్ సెంటర్, క్లస్టర్ హెడ్‌క్వార్టర్. అంటే క్లస్టర్ పరిధిలో ఉన్న ఎనిమిది పీహెచ్‌సీల్లో ఎక్కడ అత్యవసర కేసు నమోదైనా వారిని తొలుత రిఫ ర్ చేయవలసిన ఆస్పత్రి. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఆస్పత్రిలోనే ‘నో డాక్టర్’ పరిస్థితి చోటుచేసుకుంది.
మంత్రి ఉన్నా ఫలితం సున్నా..
ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బా బు మంత్రి కావడంతో ప్రజలంతా ప్రత్తిపాడు సీహెచ్‌సీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఆస్పత్రి పెద్దాసుపత్రిని తలపిస్తుందని భావించారు. రావెల మంత్రి అయ్యే నాటికి సీహెచ్‌సీలో ఒక గైనకాలజిస్ట్, ఒక పిడియాట్రిషియన్, ఒక అనస్థిషియా స్పెషలిస్టు, ఇద్దరు జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్లుతో ప్రత్తిపాడు సా మాజిక ఆరోగ్య కేంద్రం కళకళలాడుతూ ఉండేంది. కానీ ఇప్పు డు ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టరూ లేని దుర్గతి ప ట్టింది. డాక్టర్ల కొరత విషయమై వైద్యాధికారుల నుం చి ప్రజాప్రతినిధుల వరకు ఎంతమంది ఎన్నిసార్లు మంత్రికి మొరపెట్టుకున్నా ఫలితంమాత్రం శూన్యమే.
రోగులకు ఇబ్బంది కలగనివ్వం ...
ప్రత్తిపాడు సీహెచ్‌సీలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. గతం నుంచీ స్పెషలిస్టు పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నప్పటికీ, ఆయన కూడా మంగళవారం నుంచి సెలవులో ఉన్నారు. రోగులకు సేవలందించేందుకు క్లస్టర్‌లోని వేరే పీహెచ్‌సీ నుంచి డాక్టర్‌ను పిలిపిస్తాం.
-సీహెచ్ రత్నమన్‌మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో
ప్రత్తిపాడు సీహెచ్‌సీలో నో డాక్టర్
Published Tue, Jun 30 2015 11:34 PM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
Advertisement
Advertisement