నో ఎంట్రీ
సాక్షి ప్రతినిధి, కడప: పరీక్షల నిర్వహణ ఏమాత్రం కాదు.. ఎన్నికలు అసలే కాదు.. ఘర్షణలు ఉత్పన్నమైన ప్రాంతం కాదు.. క్రీడాకారులను తీర్చిదిద్దే విద్యాలయం అది.. అటువంటి చోట చీమ కూడా లోపలికి వెళ్లొద్దని నిషేధాజ్ఞలు విధించారు.ఎమర్జెన్సీని తలదన్నేలా పోలీసులు పహరా కాశారు. మీడియాకు సైతం నోఎంట్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సోమవారం ఈ ఘటనలు నెలకొన్నాయి. క్రీడా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులివ్వడమే ఇందుకు కారణం.
వివరాల్లోకి వెళితే...
తాము అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల స్పోర్ట్సు స్కూల్ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. వారి ఆందోళనలకు హామీలు మినహా చర్యలు లేకపోయాయి. ఈనేపధ్యంలో పలుమార్లు విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళన చేపట్టారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్లతోపాటు మరో ఐదుగురిని బాధ్యులను చేస్తూ జిల్లాకలెక్టర్ కేవీ రమణ ఉత్తర్వులిచ్చారు. ఈమేరకు సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య నూతనంగా స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన డీఎస్‌డీఓ భాషామోీహ ద్ధీన్ ఉత్తర్వులు అందించారు.
ఏడుగురిపై వేటు....
స్పోర్ట్సు స్కూల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురిపె వేటు పడింది. విద్యార్థుల ఆందోళనకు కారకులై, కాస్మోటిక్ చార్జీలు స్వాహా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్లు వెంకటరెడ్డి, భారతీలతో పాటు, విద్యార్థుల ఇన్సూరెన్సు డబ్బులు స్వాహా చేశారనే అభియోగంపై కంప్యూటర్ ఆపరేటర్ పుష్పా, స్విమ్మింగ్ పూల్‌లో అసభ్యఫొటోలు తీశారనే ఆరోపణలపై వాచ్‌మెన్ నాగరాజు, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే కారణంపై నర్సు కృష్ణకుమారిలను విధుల నుంచి తప్పించారు.
అలాగే విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళన చేసేలా ప్రోత్సహించారనే కారణంపై యోగా టీచర్ డాక్టర్ రంగనాథ్, టీచర్ భాస్కర్‌రెడ్డిలను కూడా విధుల నుంచి తప్పించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఆరోపణలు లేని వారిని సైతం విధుల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.
ఎమర్జెన్సీని తలపించిన వైనం....
పలు సంఘటనలు చోటు చేసుకోవడంతో సోమవారం స్పోర్ట్సు స్కూల్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్లను విధుల నుంచి తప్పించడంపై పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు.
అయితే విద్యార్థుల ఆందోళనలకు కారకులుగా భావిస్తూ యోగా టీచర్ రంగనాథ్, భాస్కర్‌రెడ్డిలపై వేటు వేశారు. ఈనేపధ్యంలో విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని భావించిన యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
చిన్నచౌక్ ఎస్‌ఐ హేమకుమార్ నేతృత్వంలో సుమారు 15మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. క్రీడా పాఠశాల బాధ్యులు మినహా మరెవ్వరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగడానికి విముఖత ప్రదర్శించిన డీఎస్‌డీఓ బాషామోహిద్ధీన్‌కు బలవంతంగా బాధ్యతలు అప్పగించడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే కాకుండా విద్యార్థుల ఆందోళనకు బాధ్యులను చేస్తూ మరో ఇద్దరిని విధుల నుంచి తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడుపు మండి విద్యార్థులు ఆందోళన చేశారన్న వాస్తవాన్ని విస్మరించినట్లు పలువురు తప్పుపడుతున్నారు.