Test management
-
ఎస్ఎస్సీ ఫలితాలు నిలిపివేత
న్యూఢిల్లీ: పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2017 పరీక్షల ఫలితాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) పరీక్షల కుంభకోణంతో అభ్యర్థులు లబ్ధి పొందేందుకు అంగీకరించబోమని, వారు సర్వీసులోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ‘2018 జూలై 25, ఆగస్టు 30న సీబీఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌లను చూస్తే సీజీఎల్–2017, సీహెచ్ఎస్ఎల్–2017 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మేం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఫలితాలు వెల్లడించకుండా ఎస్ఎస్ఎస్కి ఆదేశాలు జారీ చేస్తాం’ అని ధర్మాసనం తెలిపింది. విరుద్ధంగా వాదిస్తారా? సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) విక్రమ్‌జిత్ బెనర్జీ స్టేటస్ రిపోర్డులో ఉన్నదానికి విరుద్ధంగా వాదించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు కేంద్రం తరఫున వాదించడం ఆపండి. సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన మీరు సీబీఐ నివేదికకు విరుద్ధంగా, నిందితులకు రక్షణగా ఎలా మాట్లాడుతారు? వాస్తవానికి మీరు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా పరీక్షను రద్దు చేయాలని మీరే అడగాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఏఎస్జీ బెనర్జీ.. సీబీఐ సమర్పించిన రెండో స్టేటస్ రిపోర్డును పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వవద్దని, అందులో సున్నితమైన అంశాలు ఉన్నాయని కోరారు. బెనర్జీ వాదనలతో విభేదించిన ధర్మాసనం సీబీఐ నివేదికలో రహస్యమైన, సున్నితమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది. ఎస్ఎస్సీ కళంకితమైంది.. ఈ సమయంలో పిటిషనర్ శాంతను కుమార్ తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్లు ప్రశాంత్ భూషణ్, గోవింద్ వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ మాకు రిపోర్టు ఇస్తుందా, లేదా అనేది ఇక్కడ విషయం కాదు. పరీక్ష ప్రశ్న పత్రం కస్టోడియన్ అయిన సిఫీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సంత్ ప్రసాద్ గుప్తా పేపర్‌ను లీక్ చేసినట్లు సీబీఐ తన తొలి స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అతడిని విచారిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఎస్ఎస్సీ ఫలితాలు విడుదలయ్యే వీలుంది. వాటిని నిలిపివేయండి’ అని కోరారు. ‘ఎస్ఎస్సీ వ్యవస్థ, మొత్తం పరీక్షల ప్రక్రియ కళంకితమయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పరీక్ష ప్రశ్న పత్రాన్ని కస్టోడియనే లీక్ చేయడాన్ని మేం నమ్మలేకపోతున్నాం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ విభాగాల్లోని సీ, డీ కేటగిరీ ఉద్యోగ సర్వీసుల్లో చేరతారు. ‘ఆర్టికల్ 35ఏ’పై విచారణ వాయిదా జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ రాజ్యాంగబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ప్రజలకు ప్రత్యేక అధికారాలను, హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీనిప్రకారం ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీర్లో స్థిరాస్తులు కొనడం కుదరదు. అంతేకాకుండా మిగతా భారతీయులను కశ్మీరీ మహిళలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారు. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ప్రజాప్రకటనల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై బీజేపీ, కేంద్రం సహా 6 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనలను నాయకుల వ్యక్తిగత ప్రచారానికి వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా నోటీసులపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. కేంద్రం సహా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు నోటీసులిచ్చింది. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారంటూ ఝా తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను గుర్తుచేస్తూ.. బీజేపీ పార్టీ, కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు ఏవిధంగా ఉల్లంఘనలకు పాల్పడ్డాయో పిటిషన్లో వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని, ప్రకటనలకోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలన్నారు. ప్రజా ప్రకటనలపై నియంత్రణ విషయంలో ముగ్గురు సభ్యుల (నిష్కళంకమైన చరిత్ర ఉన్నవారితో) కమిటీని ఏర్పాటు చేయాలని 2015, మే 13న కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర మంత్రులు, సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించవచ్చని 2016లో సూచించింది. -
భయాగ్నస్టిక్స్!
♦ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు ♦ అనుమతుల్లేకుండానే పరీక్షల నిర్వహణ ♦ అక్రమంగా కొనసాగుతున్న కేంద్రాలు 519 ♦ రెన్యువల్‌కు దరఖాస్తుల చేసుకోని కేంద్రాలు ♦ వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో వాస్తవాలివి.. జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. నిబంధనలను అసరించి తెరవాల్సిన ఈ కేంద్రాలు.. అనుమతుల్లేకుండానే కొనసాగుతున్నారుు. ఇందులో కార్పొరేట్ ఆస్పత్రులకు అనుబంధంగా నడుస్తున్నవే అధికం. పీసీపీఎన్ డీటీ (లింగనిర్ధారణ) చట్టం ప్రకారం జన్యు ప్రయోగశాలలు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి. కానీ జిల్లాలో అనుమతి లేకుండా 519 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నారుు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం 934 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నారుు. ఈ కేంద్రాలు ఏటా పరీక్షల తాలూకు వివరాలు సమర్పించి గుర్తింపు కోసం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత అనుమతి తీసుకున్నప్పటికీ.. రెన్యూవల్ తప్పనిసరి. కానీ జిల్లాలో సగానికిపైగా రెన్యూవల్ చేరుుస్తున్న దాఖలాల్లేవు. జిల్లాలో 415 డయాగ్నస్టిక్ కేంద్రాలకు మాత్రమే ప్రస్తుతం అనుమతులున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. మిగతా 519 కేంద్రాలు యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయా సెంటర్లలో చేసే పరీక్షలు పరిగణలోకి తీసుకోకూడదు. కానీ పలు ఆస్పత్రులు వీటినే రిఫర్ చేస్తూ పేషంట్లను పంపడం గమనార్హం. పర్యవేక్షణ గాలికి.. అనుమతిలేని డయాగ్నస్టిక్, అల్టా్ర సౌండ్ స్కానింగ్ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ నిఘా ఏర్పాటు చేయాలి. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఈ ప్రక్రియలో విఫలమవుతోంది. పీసీపీఎన్ డీటీ చట్టం ప్రకారం అనుమతి లేని కేంద్రాల పట్ల యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి పనితీరును పర్యవేక్షించాలి. కానీ జిల్లాలో రెండేళ్లుగా వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భాలు లేవు. దీంతో జిల్లాలో 519 కేంద్రాలు అనుమతి లేనప్పటికీ కార్యకలాపాల్ని దర్జాగా నిర్వహిస్తున్నారుు. -
నో ఎంట్రీ
సాక్షి ప్రతినిధి, కడప: పరీక్షల నిర్వహణ ఏమాత్రం కాదు.. ఎన్నికలు అసలే కాదు.. ఘర్షణలు ఉత్పన్నమైన ప్రాంతం కాదు.. క్రీడాకారులను తీర్చిదిద్దే విద్యాలయం అది.. అటువంటి చోట చీమ కూడా లోపలికి వెళ్లొద్దని నిషేధాజ్ఞలు విధించారు.ఎమర్జెన్సీని తలదన్నేలా పోలీసులు పహరా కాశారు. మీడియాకు సైతం నోఎంట్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సోమవారం ఈ ఘటనలు నెలకొన్నాయి. క్రీడా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులివ్వడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే... తాము అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవల స్పోర్ట్సు స్కూల్ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. వారి ఆందోళనలకు హామీలు మినహా చర్యలు లేకపోయాయి. ఈనేపధ్యంలో పలుమార్లు విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళన చేపట్టారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్వైజర్లతోపాటు మరో ఐదుగురిని బాధ్యులను చేస్తూ జిల్లాకలెక్టర్ కేవీ రమణ ఉత్తర్వులిచ్చారు. ఈమేరకు సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య నూతనంగా స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించిన డీఎస్డీఓ భాషామోీహ ద్ధీన్ ఉత్తర్వులు అందించారు. ఏడుగురిపై వేటు.... స్పోర్ట్సు స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురిపె వేటు పడింది. విద్యార్థుల ఆందోళనకు కారకులై, కాస్మోటిక్ చార్జీలు స్వాహా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్వైజర్లు వెంకటరెడ్డి, భారతీలతో పాటు, విద్యార్థుల ఇన్సూరెన్సు డబ్బులు స్వాహా చేశారనే అభియోగంపై కంప్యూటర్ ఆపరేటర్ పుష్పా, స్విమ్మింగ్ పూల్‌లో అసభ్యఫొటోలు తీశారనే ఆరోపణలపై వాచ్మెన్ నాగరాజు, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారనే కారణంపై నర్సు కృష్ణకుమారిలను విధుల నుంచి తప్పించారు. అలాగే విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళన చేసేలా ప్రోత్సహించారనే కారణంపై యోగా టీచర్ డాక్టర్ రంగనాథ్, టీచర్ భాస్కర్‌రెడ్డిలను కూడా విధుల నుంచి తప్పించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ఆరోపణలు లేని వారిని సైతం విధుల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఎమర్జెన్సీని తలపించిన వైనం.... పలు సంఘటనలు చోటు చేసుకోవడంతో సోమవారం స్పోర్ట్సు స్కూల్లో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్వైజర్లను విధుల నుంచి తప్పించడంపై పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. అయితే విద్యార్థుల ఆందోళనలకు కారకులుగా భావిస్తూ యోగా టీచర్ రంగనాథ్, భాస్కర్‌రెడ్డిలపై వేటు వేశారు. ఈనేపధ్యంలో విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని భావించిన యంత్రాంగం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. చిన్నచౌక్ ఎస్ఐ హేమకుమార్ నేతృత్వంలో సుమారు 15మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. క్రీడా పాఠశాల బాధ్యులు మినహా మరెవ్వరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగడానికి విముఖత ప్రదర్శించిన డీఎస్డీఓ బాషామోహిద్ధీన్కు బలవంతంగా బాధ్యతలు అప్పగించడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే కాకుండా విద్యార్థుల ఆందోళనకు బాధ్యులను చేస్తూ మరో ఇద్దరిని విధుల నుంచి తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడుపు మండి విద్యార్థులు ఆందోళన చేశారన్న వాస్తవాన్ని విస్మరించినట్లు పలువురు తప్పుపడుతున్నారు.