న్యూఢిల్లీ: పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2017 పరీక్షల ఫలితాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) పరీక్షల కుంభకోణంతో అభ్యర్థులు లబ్ధి పొందేందుకు అంగీకరించబోమని, వారు సర్వీసులోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ‘2018 జూలై 25, ఆగస్టు 30న సీబీఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌లను చూస్తే సీజీఎల్–2017, సీహెచ్‌ఎస్‌ఎల్–2017 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మేం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఫలితాలు వెల్లడించకుండా ఎస్‌ఎస్‌ఎస్‌కి ఆదేశాలు జారీ చేస్తాం’ అని ధర్మాసనం తెలిపింది.
విరుద్ధంగా వాదిస్తారా?
సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) విక్రమ్‌జిత్ బెనర్జీ స్టేటస్ రిపోర్డులో ఉన్నదానికి విరుద్ధంగా వాదించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు కేంద్రం తరఫున వాదించడం ఆపండి. సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన మీరు సీబీఐ నివేదికకు విరుద్ధంగా, నిందితులకు రక్షణగా ఎలా మాట్లాడుతారు? వాస్తవానికి మీరు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా పరీక్షను రద్దు చేయాలని మీరే అడగాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఏఎస్‌జీ బెనర్జీ.. సీబీఐ సమర్పించిన రెండో స్టేటస్ రిపోర్డును పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వవద్దని, అందులో సున్నితమైన అంశాలు ఉన్నాయని కోరారు. బెనర్జీ వాదనలతో విభేదించిన ధర్మాసనం సీబీఐ నివేదికలో రహస్యమైన, సున్నితమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది.
ఎస్‌ఎస్‌సీ కళంకితమైంది..
ఈ సమయంలో పిటిషనర్ శాంతను కుమార్ తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్లు ప్రశాంత్ భూషణ్, గోవింద్ వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ మాకు రిపోర్టు ఇస్తుందా, లేదా అనేది ఇక్కడ విషయం కాదు. పరీక్ష ప్రశ్న పత్రం కస్టోడియన్ అయిన సిఫీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సంత్ ప్రసాద్ గుప్తా పేపర్‌ను లీక్ చేసినట్లు సీబీఐ తన తొలి స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అతడిని విచారిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఎస్‌ఎస్‌సీ ఫలితాలు విడుదలయ్యే వీలుంది. వాటిని నిలిపివేయండి’ అని కోరారు. ‘ఎస్‌ఎస్‌సీ వ్యవస్థ, మొత్తం పరీక్షల ప్రక్రియ కళంకితమయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పరీక్ష ప్రశ్న పత్రాన్ని కస్టోడియనే లీక్ చేయడాన్ని మేం నమ్మలేకపోతున్నాం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ విభాగాల్లోని సీ, డీ కేటగిరీ ఉద్యోగ సర్వీసుల్లో చేరతారు.
‘ఆర్టికల్ 35ఏ’పై విచారణ వాయిదా
జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ రాజ్యాంగబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ప్రజలకు ప్రత్యేక అధికారాలను, హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీనిప్రకారం ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీర్‌లో స్థిరాస్తులు కొనడం కుదరదు. అంతేకాకుండా మిగతా భారతీయులను కశ్మీరీ మహిళలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారు.
తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
ప్రజాప్రకటనల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై బీజేపీ, కేంద్రం సహా 6 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనలను నాయకుల వ్యక్తిగత ప్రచారానికి వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా నోటీసులపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. కేంద్రం సహా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు నోటీసులిచ్చింది. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ పిటిషన్ వేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారంటూ ఝా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను గుర్తుచేస్తూ.. బీజేపీ పార్టీ, కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు ఏవిధంగా ఉల్లంఘనలకు పాల్పడ్డాయో పిటిషన్‌లో వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని, ప్రకటనలకోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలన్నారు. ప్రజా ప్రకటనలపై నియంత్రణ విషయంలో ముగ్గురు సభ్యుల (నిష్కళంకమైన చరిత్ర ఉన్నవారితో) కమిటీని ఏర్పాటు చేయాలని 2015, మే 13న కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర మంత్రులు, సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించవచ్చని 2016లో సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment