ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు టాయ్‌లెట్లు నిర్మించాలని సాక్షాత్తూ సుప్రీమే ఆదేశించింది. అది ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల పట్టించుకోని ధోరణి విద్యార్థులకు అగచాట్లు తెస్తోంది. ప్రాథమిక సదుపాయాలు లేని స్కూళ్లలో ఎలా చదువుతామని కొందరు బడికే వెళ్లడం మానుకుంటున్నారు. ఉన్నవాటి నిర్వహణ లేక ఇబ్బం దులు పెరుగుతున్నాయి. మొత్తానికి ‘మరుగు’కు ఇక్కట్లు పడుతున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : రేపటి పౌరులు ఆత్మగౌరవంతో ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. సర్కారు బడుల్లోని విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా.. వారి సౌకర్యం కోసం సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని 2012 అక్టోబరు నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయని కారణంగా సర్కారు బడుల్లోని విద్యార్థులు ఆరుబయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితే నెలకొంటోంది.
జిల్లాలో 3,955 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందుకుగాను పాఠశాలల నిర్వహణకోసం ఏటా రూ.3.95కోట్లు నిధులు మంజూరవుతున్నా.. వాటి ఫలితాలు ఎక్కడా కనబడటం లేదు. గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టిసారించకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,559 పాఠశాలల్లోని విద్యార్థులు టాయ్‌లెట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 2,948 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రహరీగోడ నిర్మాణాల్లేవు. దీంతో ఆయా పాఠశాలలన్నీ అసాంఘీక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. 794 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంలేదు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 600 అదనపు తరగతి గదులు అవసరం. ఈ సంఖ్య కేవలం విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రమే.. వాస్తవానికి చూస్తే 75 శాతం వరకు పాఠశాలల్లో తగిన మౌళికవసతుల్లేక విద్యార్థినీ, విద్యార్థులు అవస్థపడుతున్నారు.
సమన్వయలోపం
ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయలోపం కారణంగా.. విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్కారు బడుల్లో టాయ్‌లెట్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌డబ్యుఎస్ శాఖదేనని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. వాటిని ఎప్పుడో నిర్మించాం, నిర్వహణ లోపం కారణమని వారు చెప్తున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిర్మాణాలు చేపడుతున్న కొత్త భవనాల వద్ద వారే టాయ్‌లెట్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల వాదన. వీటి నిర్మాణం కోసం రెండేళ్లుగా నిధులు మంజూరు కావడంలేదని ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రాధమిక సదుపాయాలు కొరవడి ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్లూ పెరుగుతున్నాయి.
రోడ్డు దాటాలంటే భయమే..!
మా పాఠశాలలో అందరికి సరిపోయే మరుగుదొడ్లు లేవు. అందువల్ల విద్యార్థులందరం కలిసి హెవేను దాటి వెళ్తున్నాం. రోడ్డు దాటేటప్పుడు చాలా భయమేస్తోంది. అయినా తప్పడం లేదు. వెంటనే మూత్రశాలలు కట్టిస్తే రోడ్డు దాటే టెన్షన్ తగ్గుతుంది.
-ఎం.లాలునాయక్, 9వ తరగతి, అడ్డాకుల
ఆరుబయటకు వెళ్లాల్సిందే..
రోజు మూత్ర విసర్జనకు హైవేను దాటి వెళ్లాల్సి వస్తోంది. రోడ్డుపై లారీలు, కార్లు చాలా వేగంగా వస్తాయి. అందుకే అందరం కలిసి గుంపులు, గుంపులుగా రోడ్డు దాటుతాం. మా పాఠశాలలో బాలురందరు రోడ్డు దాటే వెళ్లాలి. బాలికలకు మాత్రమే సరిపోయే మరుగుదొడ్లు ఉన్నాయి. మా గురించి పట్టించుకునే వారు లేరు.
-ప్రవీణ్‌కుమార్, 10 తరగతి, అడ్డాకుల
ఆడ పిల్లలకు మరీ ఇబ్బంది.
మా పాఠశాలలో మూత్రశాలలు లేవు. రోజు ఆరుబయటకే వెళ్తాం. వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది. ఆడపిల్లలకు మరీ ఇబ్బందిగా ఉంటుంది. దీనిపై అధికారులు స్పందించాలి. పాఠశాల ఆవరణలోనే వాటిని ఏర్పాటు చేయాలి.
-రాజశేఖర్, 9వ తరగతి, రాచాల
ఏదీ...‘మరుగు’
Published Sat, Feb 1 2014 4:18 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement