బల్లపై పడుకుని గర్భిణి అవస్థలు
సాక్షి, ఒంగోలు: రిమ్స్‌లో బాలింతల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువు కోసం తల్లి ఎంత కష్టమైనా భరిస్తుంది. సిజేరియన్ చేయించుకున్నా తనకు ఏమైనా ఫర్వాలేదంటూ సమస్యలున్నా బిడ్డ పుట్టిన ఆనందంలో వాటిని మరిచిపోతోంది. ఇదీ.. రిమ్స్ నవజాత శిశు సంరక్షణ కేంద్రం బయట బాలింతల దుస్థితి. రిమ్స్‌లో అప్పుడే పుట్టిన పురిటి పిల్లల చికిత్స కేంద్రానికి అనుబంధంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పుట్టిన చిన్నారులతో పాటు రిమ్స్‌లో పుట్టిన పిల్లలు ఉంటారు. కామెర్లు, బరువు తక్కువతో పుట్టడం, గాలి పీల్చుకోలేని వారికి, ఫిట్స్‌తో ఉన్న వారికి, పుట్టగానే ఏడవని పిల్లలకు ఇక్కడ చికిత్స అందిస్తారు. దాదాపు వారం రోజుల నుంచి నెల రోజుల వరకు చిన్నారులకు చికిత్స అందిస్తారు.
బాలింత బెడ్ వరండానే
శిశువు ఐసీయూలో ఉంటే బాలింత ఎస్‌ఎన్‌సీయూ ఎదుట కారిడార్‌లో ఉండాల్సిందే. అక్కడ 10 బెడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఐసీయూలో ఎప్పుడూ దాదాపు 30 మంది చిన్నారులు చికిత్స పొందుతూ ఉంటారు. దీంతో చిన్నారుల తల్లులు కూడా బయట ఉండాల్సిందే. దీంతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరిలో సిజేరియన్ శస్త్రచికిత్సలు చేసిన వారు కూడా ఉంటారు. వీరి బాధలు వర్ణనాతీతం. అప్పుడే వేసిన కుట్లతో నేలపై పడుకుని..తిరిగి లేచే సయమంలో పిగిలిపొయే ప్రమాదం ఉంది. అయినా తమ శిశువు కోసం బాలింతలు ఆ బాధలు భరిస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో మంచాలు కేటాయించాలని, నేలపై పడుకోలేక పోతున్నామని బాలింతలు వాపోతున్నారు.
యూరినల్స్‌కు వెళ్లాలంటే నరకమే
బాలింతలు యూరినల్స్‌కు, బాత్‌రూమ్‌కు వెళ్లాలంటే నరక యాతన అనుభవించాల్సి వస్తోంది. సిజేరియన్ చేసిన బాలింతలు 500 మీటర్లకుపైగా దూరంలో రిమ్స్ గేటు బయట వరకూ నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం రిమ్స్‌కు వస్తే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్‌లో యూరినల్స్‌కు వెళ్లాలంటే రూ.6లు చెల్లించాల్సి వస్తోంది. స్నానం చేసేందుకు రూ.20లు ఇవ్వాల్సిందే. ఎన్నిసార్లు యూరినల్స్‌కు వెళ్తే అన్ని సార్లు రూ.6లు చొప్పున చెల్లించాల్సి వస్తోంది. సిజేరియన్ చేయించుకున్న తాము అంత దూరం వెళ్లలేకపోతున్నామని బాలింతలు వాపోతున్నారు. సమీపంలోనే తమకు ఒక బాత్‌రూమ్ కేటాయించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment