- బీజేపీకి ఓట్లేయండంటున్న కిరణ్ అనుచరులు
- వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకే ఈ పన్నాగం
- ముస్లిం మైనారిటీల ద్రోహి చంద్రబాబు
- జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం
- వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
పీలేరు, న్యూస్‌లైన్: ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యంలేక టీడీపీ అధినేత చంద్రబాబు, జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆరోపించారు. పీలేరులో కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరులు కమలం గుర్తుకు ఓటెయ్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని, ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
గురువారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ఎంతటికైనా దిగజారే నైజం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలకు కేంద్రబిందువులైన నారా, నల్లారిలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రూ.9 లక్షల కోట్లు అవసరమన్నారు. ఆ నిధులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 2004లో ఇచ్చిన హామీలను 2009 ఇవ్వలేదని, 2009లో చెప్పినవి ఇప్పుడు పేర్కొనకపోవడం ఆయన అబద్ధాల కోరు అనడానికి నిదర్శనమన్నారు.
అడ్డదారిలో అధికారంలోకి రావాలన్న దురాశతో ఓ వైపు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని, మరో వైపు జై సమైక్యాంధ్రతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు, బీజేపీ కుమ్మకు కుట్రలను ముస్లిం మైనారిటీలు తిప్పికొట్టాలన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు.
అదే తరహాలో మైనారిటీలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. సమైక్య ద్రోహులైన కిరణ్, చంద్రబాబు, బీజేపీలకు ఇవే చివరి ఎన్నికలన్నారు. సీమాంధ్రలో ఓటుహక్కు లేని చంద్రబాబుకు మనం ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థిని పురందేశ్వరి స్థానికురాలు కాదన్నారు. ఆమెను చూడాలంటే హైదరాబాద్ లేదా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండిగ్‌లో ఉన్న హంద్రీ-నీవా, సుజల-స్రవంతి ప్రాజెక్టులను పూర్తిచేసి తాగునీటితోపాటు రైతులకు సాగునీరందిస్తామన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 135కు పైగా సీట్లు వస్తాయని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు.
జగనన్న తమ్ముడిగా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలి పారు. పార్టీ నాయకులు ఎం.వెంకట్రమణారెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, వినయ్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, చక్రపాణిరెడ్డి, కేశవరెడ్డి, ఉదయ్‌కుమార్, ఆనంద్, నాగరాజనాయక్ పాల్గొన్నారు.