తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి లేదని, ఆయన రెండుకళ్ల సిద్ధాంతంతో మతిస్థిమితం కోల్పోయి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి లేదని, ఆయన రెండుకళ్ల సిద్ధాంతంతో మతిస్థిమితం కోల్పోయి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. తెలంగాణపై 2008లో ఇచ్చిన లేఖను పట్టుకుని వేలాడుతున్న తెలంగాణ టీడీపీ నేతలు, ఇటీవల చంద్రబాబు, ఆ పార్టీ సీమాంధ్ర నేతల వైఖరిని ఎందుకు నిలదీయరని ఆయన ప్రశ్నించారు. బాబుకు తొత్తులుగా మారిన టీటీడీపీ నేతలు ఇకనైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. బుధవారం ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌లోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజలే గుణపాఠం చెప్తారు
మొదటి నుంచి తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ తెలంగాణకు అడ్డంకి మారిన చంద్రబాబును, ఆ పార్టీ తెలంగాణ నాయకులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని రామన్న హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు పచ్చి అవకాశవాదిగా మారిన చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుంటారా? లేక టీడీపీలో ఉంటూ తెలంగాణ ద్రోహులుగా మిగులుతారా తేల్చుకోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు తొత్తులుగా మారిన టీటీడీపీ నేతలు మొసలికన్నీరు మాని ఓట్లేసిన తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి మానవత్వం చాటుకోవాలని సూచించారు. రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రత్యేక తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారిన చంద్రబాబును వీడకపోతే తెలంగాణలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు.
పల్లెనిద్ర పేరిట దొంగనాటకం
టీడీపీకి చెందిన సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేఖ ఇస్తే.. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ మాత్రం హైదరాబాద్‌కు దూరంగా ఉండటంపై ఆంతర్యమేమిటని రామన్న ప్రశ్నించారు. పల్లెనిద్ర పేరిట దొంగనాటకం ఆడుతున్న రాథోడ్ రమేశ్ కూడా తెలంగాణ వ్యతిరేకే అని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విభజనకు వ్యతిరేకంగా రాష్ర్టపతిని కలిసిన సీమాంధ్ర నేతలకు ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ నేతల నుంచి విభజనకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇప్పించలేకపోయారని అన్నారు.
ఈ ద్వంద్వ ప్రమాణాలు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరనుకుంటే పొరపాటేనని, టీడీపీ నేతలకు సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్న టీటీడీపీ నేతలందరూ ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదని, లేదంటే తెలంగాణ ద్రోహులుగా మిగలడం ఖాయమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర వహిస్తుంద ని అభిప్రాయపడ్డారు. 24 జిల్లాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఒకే విధమైన ఉచిత విద్యను అందించడంతో పాటు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, విద్యుత్ తదితర ప్రధాన వనరులపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు అడ్డి భోజారెడ్డి, సాజిద్‌ఖాన్, బండారి సతీశ్, రౌతు మనోహర్, ఆరె రాజన్న, మేకల ఆనంద్ పాల్గొన్నారు.