మడకశిర: కర్ణాటక సరిహద్దులోని మడకశిర నియోజకవర్గం ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు దిగువ కర్ణాటకలోని చెరువుల్లోకి చేరుతోంది. భారీ వర్షపాతం నమోదయినా ఇక్కడి చెరువుల్లో చుక్కనీరు నిలవడం కూడా గగనమవుతోంది. ఫలితంగా ఆయకట్టు బీడువారుతోంది. మొత్తం 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిధిలో 13,769 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు నిండని పరిస్థితుల్లో యేటా సగం ఆయకట్టు కూడా సాగయ్యే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ కారణంగా రైతుల బతుకు భారమవుతోంది. వర్షం నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న నీటి పథకాలే శరణ్యం. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో రెండు చిన్న నీటి పథకాలను మంజూరు చేశారు. ఇందులో ఒకటి నాచేపల్లి సప్లయ్ చానల్.. కాగా మరొకటి తమ్మడేపల్లి సప్లయ్ చానల్. 2006లోనే ఈ రెండింటికీ కలిపి రూ.2కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే ఆయన మరణానంతరం పాలక ప్రభుత్వాలు వీటిని పూర్తిగా విస్మరించడంతో నిధులు మురిగిపోయాయి.
తమ్మడేపల్లి..
= అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి సమీపంలో ఈ చానల్‌ను నిర్మించాల్సి ఉంది.
= కర్ణాటకలోని క్యాదిగుంట చెరువుకు వెళ్లే వర్షపు నీటిని తమ్మడేపల్లి చెరువులోకి మళ్లించే అవకాశం ఉంటుంది.
= దాదాపు 600 ఎకరాలు సాగులోకి వస్తాయి.
= భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
= దాదాపు 1000 వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పెరిగి మరో 500 ఎకరాలు సాగులోకి వస్తాయి.
నాచేపల్లి..
= గుడిబండ మండలంలోని నాచేపల్లి వద్ద సప్లయ్ చానల్ నిర్మిస్తే వర్షపు నీటిని కర్ణాటకకు వెళ్లకుండా సద్వినియోగం చేసుకునే వీలుంది.
= ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలోనే మోరుబాగల్ చెరువు అతిపెద్దది. ఈ చెరువు నిండి మరువ పడితే నీరంతా కర్ణాటకలోని బాణిగెర చెరువుకు చేరుతోంది.
= ఈ నీటిని సప్లయ్ చానల్ ద్వారా నాచేపల్లి, హేమావతి చెరువుల్లోకి మళ్లిస్తే దాదాపు 750 ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది.
కార్యరూపం దాల్చని గంగులవాయిపాళ్యం వాగు మళ్లింపు
మడకశిర మండలంలోని గంగులవాయిపాళ్యం వాగును మడకశిర చెరువులోకి మళ్లించే ప్రతిపాదన ఇంత వరకు కార్యరూపం దాల్చని పరిస్థితి. ఈ వాగులో ప్రవహించే మొత్తం వర్షపు నీరంతా కర్ణాటకలోని బిదురుకెర చెరువుకి చేరుతోంది. ఈ వాగును మడకశిర చెరువులోకి మళ్లిస్తే దాదాపు 1000 ఎకరాలు సాగులోకి వస్తాయి. అంతే కాకుండా మడకశిర పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారుతోంది.
ఫైళ్లను పరిశీలిస్తాం
సప్లయ్ చానళ్ల విషయమై ఫైళ్లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్చించాలి. ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తాం. అధికారులతోనూ ఈ విషయమై చర్చిస్తాం. – మక్బుల్ సాహెబ్,
జలవనరుల శాఖ ఎస్‌ఈ పొలం బీడు పెట్టుకుంటున్నా
తమ్మడేపల్లి చెరువు కింద నాకు ఐదెకరాల భూమి ఉంది. సాగునీరు లేకపోవడంతో ఏనాడు కూడా పూర్తి స్థాయిలో సాగు చేయలేకపోయా. భారీ వర్షం కురిసినా ఇక్కడి చెరువు నిండని పరిస్థితి. వర్షం నీరంతా కర్ణాటక ప్రాంతంలోని చెరువుకు చేరుతోంది. యేటా పొలం బీడు పెట్టుకోవాల్సి వస్తోంది. జీవనం భారమవుతోంది. – సదానందగౌడ, రైతు, తమ్మడేపల్లి, అమరాపురం మండలం
Comments
Please login to add a commentAdd a comment