
ప్రధానితో జగన్ భేటీపై బీజేపీ ఏమంది?
ప్రతిపక్షనేత హోదాలో ప్రజాసమస్యలపై కలిశారు
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలవడంలో తప్పేముందని ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఆయన గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు, పైగా ఆయనకు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిని కలిసే హక్కు ఎవరికైనా ఉంటుంది, అలాంటప్పుడు జగన్ ప్రధానిని కలిస్తే తప్పేమిటి? జగన్‌పై కేసులు ఉంటే కోర్టు చూసుకుంటుంది. దానికీ, మోదీని కలిసిన దానికీ సంబంధమేంటి? ప్రతిపక్ష నేత హోదాలో వివిధ ప్రజా సమస్యలపై ప్రధాని మోదీని కలిశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. ప్రతిపక్ష నేత హోదాలో ఎప్పుడైనా ప్రధానిని కలిసే అవకాశం ఉంటుంది’’ అని సిద్ధార్థనాథ్‌సింగ్ స్పష్టం చేశారు. మోదీతో వైఎస్ జగన్ భేటీపై రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సిద్ధార్థనాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.