నిరుద్యోగులకు దగా! | No Job Notifications In Chandrababu Govt | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు దగా!

Published Thu, Jun 14 2018 7:57 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

No Job Notifications In Chandrababu Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాబు వస్తేనే జాబు వస్తుందంటూ గత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసుకుని అధికారం చేపట్టిన టీడీపీ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. ఉద్యోగాల భర్తీ నుంచి నిరుద్యోగ భృతి వరకూ దారుణంగా మోసగించింది. ఒకవైపు పోస్టుల సంఖ్యను భారీగా కుదిస్తూ మరోవైపు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. రాష్ట్రంలో 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా 2016లో కేవలం 4,275 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. అందుకు సంబంధించిన నియామక ప్రక్రియ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఏటా టీచర్‌ పోస్టుల భర్తీ అని చెప్పి ఇప్పటిదాకా ఒకే ఒకసారి చేపట్టి అభ్యర్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.

ఖాళీలన్నీ భర్తీ... ఏటా డీఎస్సీ 
‘మేం అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని పటిష్టం చేసి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నిటినీ భర్తీ చేయిస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటించి టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తాం.’  – 2014 టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ

ఖాళీల సంఖ్య 1.42 లక్షలకు పైనే.. 
ఎన్నికలకు ముందు ఏపీలోని 13 జిల్లాల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పటి ఉమ్మడి ప్రభుత్వం కమల్‌నాథన్‌ కమిటీకి సమాచారం అందించింది. ఈ నాలుగేళ్లలో రిటైరైన వారి పోస్టులను కూడా కలిపితే ఖాళీల సంఖ్య 1.80 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీటిలో కేవలం 10 వేల పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతిస్తూ టీడీపీ సర్కారు 2016 జూన్‌ 17న జీవో–110 విడుదల చేసింది. ఇందులో 5,991 పోస్టులు పోలీస్‌ శాఖకు సంబంధించినవి కాగా.. మిగతా 4,009 ఖాళీలు ఇతర శాఖలకు సంబంధించినవి. అయితే, డిసెంబర్‌ 31వ తేదీ వరకు నోటిఫికేషన్లు జారీ చేయడానికే పరిమితమయ్యారు.  
తప్పుడు లెక్కలతో కుదింపు 
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 6,97,621 అని, అందులో 1,42,825 ఖాళీలున్నాయని కమల్‌నాథన్‌ కమిటీకి నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అయితే, టీడీపీ సర్కారు మాత్రం ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని.. అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పోస్టుల సంఖ్యను కుదించేసింది. అందులోనూ 20 వేల పోస్టులు మాత్రమే రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామని, మిగతావి ఔట్‌సోర్సింగ్‌లో చేపట్టనున్నట్లు ప్రకటించి నిరుద్యోగులను దారుణంగా మోసగించింది. అవైనా పూర్తిగా నింపారా అంటే అదీ లేదు. కేవలం 4,275 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

నాలుగేళ్లలో 30వేల మంది ‘ఔట్‌’ 
రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ పోస్టుల భర్తీ చేపట్టకపోగా, వివిధ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి మరోవైపు ఉద్వాసన పలికింది. ఆరోగ్యమిత్ర, గోపాలమిత్రలను తొలగించింది. చివరకు వారు కోర్టును ఆశ్రయించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 16 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేయలేదు సరికదా ఆ హామీని నెరవేర్చమన్నందుకు వారందరినీ తొలగించాలంటూ ఉత్తర్వులు ఇప్పించారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం వివిధ విభాగాల్లో దాదాపు 30 వేల మంది వరకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఇళ్లకు సాగనంపిందని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. తొలగించిన ఖాళీలను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా భర్తీచేస్తూ ఒక్కో పోస్టుకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. 

హోదా లేక ప్రైవేట్‌ జాబులూ లేవు 
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో చెప్పుకోదగ్గ పరిశ్రమలూ లేకపోవడంతో నిరుద్యోగులకు ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి దొరకటంలేదు. చంద్రబాబు నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారం పంచుకుని తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. రాష్ట్రానికి సంజీవని అయిన హోదా లేకపోవడంతో పరిశ్రమలు రాకుండా పోయాయి. ఉన్నవి కూడా మూతపడి కార్మికులు వీధుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  

భృతి అంటూ నయవంచన 
రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం రానివారికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. అంతేకాక, నిరుద్యోగ భృతి హామీని విస్మరించారు. ఇటీవల రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతూ దానికీ సవాలక్ష షరతులు పెట్టి కోత పెడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వం దానికీ కోతపెట్టి కుదిస్తోంది. ఈ నాలుగేళ్లకు కలిపి ఒక్కో నిరుద్యోగికి రూ.96 వేల దాకా ప్రభుత్వం బకాయి పడింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కంటి తుడుపు చర్యలకు దిగింది.

70,000 పైగా పోస్టులు మాయం!  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1.42 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నాటి ప్రభుత్వం కమల్‌నాథన్‌ కమిటీకి వెల్లడించింది. ఇప్పుడు టీడీపీ సర్కారు మాత్రం ఖాళీ పోస్టుల సంఖ్య 77,737 మాత్రమేనని చెబుతోంది. పదవీ విరమణ చేసిన వారిని కలుపుకుంటే ఖాళీల సంఖ్య మరింత పెరుగుతుంది. మరి దాదాపు సగం పోస్టులు ఏమైనట్లు? ఇప్పటి వరకూ 4,275 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement