సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరితో మసకబారుతోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, సీమాంధ్రులకు మద్దతు తెలుపుతుండటం, ప్రత్యేక తెలంగాణపై అస్పష్టవైఖరితో పార్టీకి కేడర్, సీనియర్ నేతలు దూరమవుతున్నారు. టీడీపీలోని అంతర్గత విభేదాలను చంద్రబాబు పరిష్కరించకపోవడంతో జిల్లాలో ‘దేశం’ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 2009లో ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యే స్థానాలను గెలిచి బలంగా ఉన్న ‘దేశం’ ప్రస్తుతం ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలకు పరిమితమైంది.
తెలంగాణ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు సుమన్‌రాథోడ్, గొడెం నగేశ్, ఎంపీ రమేశ్ రాథోడ్ మిగిలారు. తాజాగా టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు కూడా గుడ్‌బై చెప్పారు. సీనియర్ నేతలు రాజీనామాలు చేయడం.. ఉన్న నేతలు టీడీపీ తరఫున వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి జంకుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘దేశం’ టిక్కెట్టుపై పోటీ చేస్తే చేతి చమురు వదిలించుకోవడమే తప్పా, ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఉన్న ఇద్దరు, ముగ్గురు ముఖ్య నాయకులు పార్టీని వీడే యోచనలో ఉండగా, ‘తెలంగాణ’ తేలే దాక.. బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చాక ‘కీలక’ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంపీ రాథోడ్ రమేష్ పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలపై ఆయన దృష్టి సారించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఇటీవల ప్రతిపాదించిన పనులు కూడా అధికంగా ఈ రెండు ని యోజకవర్గాలకు కేటాయించారు. దీంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీగా పోటీచేసే స్థాయికి ఇతర నాయకు లు ఎదగక పోవడానికి రమేశ్‌తోపాటు ఒకరిద్దరు ముఖ్యనేతలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ కూడా పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం నెలకొంది. ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారనే ప్రచారం జరిగిందంటే ఆ పార్టీ పరిస్థితి అద్దం పడుతోంది. ఇదే జరిగితే ఆ పార్టీకి బోథ్‌లో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మినహా ఇక్కడ టీడీపీలో రాజకీయంగా ఎదిగిన నాయకులు లేరు.
ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల్ శంకర్ ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగేందుకు సుముఖంగా లేడు. జిల్లా కేంద్రంలో ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా చంద్రబాబు ఫొటో, పార్టీ ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. బీజేపీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన పార్టీ వీడితే ఇక్కడ చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరు.
నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మిర్జా యాసిన్‌బేగ్(బాబర్) ఏడాదిగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరనే విషయం స్పష్టమవుతోంది. దీంతో కొత్త వారిని తెరపైకి తేవాల్సిన పరిస్థితి.
టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాలకు చెందిన గోనె హన్మంతరావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కేవీ ప్రతాప్ కూడా రాజీనామా చేయడంతో ఇక్కడ కొండేటి సత్యనారాయణ తెరపైకి వచ్చారు.
ముథోల్‌లో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వేణుగోపాలాచారి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఇక్కడ ఆ పార్టీకి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకరిద్దరు నేతలు పోటీ చేయాలని భావిస్తున్నా, వారు తెరపైకి రావడం లేదు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి ఇదే విధంగా అధ్వానంగా ఉంది.
మాకొద్దు ‘బాబు’
Published Sat, Feb 15 2014 2:50 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement