► జేఎన్‌టీయూను వేధిస్తున్న నిధుల కొరత
► ఏటా బ్లాక్ గ్రాంట్స్‌కు కోత
► బకాయిలు చెల్లించని కళాశాలల యాజమాన్యాలు
యూనివర్సిటీ : జేఎన్‌టీయూ (అనంతపురం)ను నిధుల కొరత వేధిస్తోంది. ప్రతియేటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ గ్రాంట్స్‌లో కోత విధిస్తున్నాయి. అనుబంధ కళాశాలలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన నిర్ధిష్ట రుసుములు కూడా సకాలంలో వసూలు కావడం లేదు. దీనివల్ల వర్సిటీ యాజమాన్యానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జేఎన్‌టీయూ పరిధిలో 118 ఇంజనీరింగ్, 36 ఫార్మసీ, 35 ఎంబీఎ, ఎంసీఎ, 5 ఇంటిగ్రేటేడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతియేటా దాదాపు లక్షమంది విద్యార్థులు చదువుతున్నారు.
2012-13, 2013-14, 2014-15 విద్యాసంవత్సరాలకు గాను వర్సిటీకి చెల్లించాల్సిన రుసుములు రూ.10 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ప్రతి ప్రైవేటు కళాశాలలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,850 యూనివర్సిటీ ఫీజు, స్వయం ప్రతిపత్తి గల కళాశాలలైతే రూ.700, క్రీడల నిర్వహణకు రూ.200 వరకు వసూలు చేసి వర్సిటీకి చెల్లించాలి. ఈ ఏడాది మొత్తాన్ని ఆ విద్యా సంవత్సరంలోనే చెల్లించాలి. అయితే.. ఈ విషయంలో కళాశాలల యాజమాన్యాలు అలసత్వం వహిస్తున్నాయి.
బ్లాక్ గ్రాంట్స్ కోత
వర్సిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్‌గ్రాంట్స్ రూపంలో నిధులను మంజూరు చేస్తాయి. కానీ గడిచిన రెండు విద్యాసంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్‌లో 40 శాతం కోత విధించాయి. దీని కారణంగా రూ.34 కోట్లు చెల్లించలేదు.ఈ నిధులు ఎప్పుడు మంజూరు చేస్తాయో తెలియని పరిస్థితి. జేఎన్‌టీయూ పరిధిలోని కలికిరి, అనంతపురం, పులివెందుల ఇంజనీరింగ్ కళాశాలలు, ఓటీఆర్‌ఐలో పలు నిర్మాణాలు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.327 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం మాత్రం రాష్ర్ట సాధారణ బడ్జెట్‌లో రూ. 51.32 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ మొత్తం సిబ్బంది జీతాలకు కూడా సరిపోదు.
కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ
కేంద్ర ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉన్నత విద్య పటిష్టతకు రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్ష అభయాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా జేఎన్‌టీయూకు రూ.400 కోట్లు మంజూరవుతాయని ఆశించారు. అయితే.. సాంకేతిక విశ్వవిద్యాలయాలకు మినహా తక్కిన వర్సిటీలకు ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో జేఎన్‌టీయూ యాజమాన్యానికి ఆశాభంగం కల్గింది.
అందరి సహకారంతోనే వర్సిటీ పురోగతి
అనుబంధ కళాశాలలు వర్సిటీకి చెల్లించాల్సిన నిర్ధిష్ట మొత్తాలను ఇప్పటికీ కట్టలేదు. వాస్తవానికి ఆ కళాశాలల పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయాలి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఆ పని చేయలేకపోతున్నాం. వర్సిటీ పురోగతికి అందరి సహకారం అవసరం. రుసుములు కట్టాలని ఇప్పటికే పలుమార్లు ఆదేశించాం.
-ఆచార్య ఎస్.కృష్ణయ్య, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్
డబ్బుల్లేవ్..
Published Mon, May 18 2015 3:36 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement