పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన | No more direct hiring of Indian workers in Oman | Sakshi
Sakshi News home page

పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన

Published Wed, Jun 3 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన

పరాయి దేశంలో వలస మహిళ ఆక్రందన

 కాళ్ల : ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఒక మహిళ అక్కడ కష్టాలపాలైంది. తిరిగి ఇండియాకు రావడానికి సరైన ధ్రువపత్రాలు లేక ఇబ్బందులు పడుతోంది. అధికారులు తన కష్టాన్ని అర్థం చేసుకుని తాను ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆమె వేడుకుంటోంది. ఈ వైనంపై గల్ఫ్‌లోని ‘టైమ్స్ ఆఫ్ ఒమన్’ అనే పత్రిక కథనం ప్రచురించింది. వివరాలిలా ఉన్నాయి..
 
 కాళ్ల మండలం కోనలపల్లె గ్రామానికి చెందిన ఉల్లూరి బేబిరాణి గల్ఫ్‌లోని ఒమన్ దేశానికి సుమారు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వెళ్లింది. అక్కడ ఒక ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు నిర్వర్తిస్తోంది. తమిళనాడుకు చెందిన శక్తిదాసన్ కూడా ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ బేబిరాణికి శక్తిదాసన్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి చట్టబద్ధత లేదు. తదనంతరం వీరు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరికి వివాహ ధ్రవపత్రాలు లేకపోవడంతో పురుడు సమయంలో ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. ఇద్దరు పిల్లలు సాధారణ ప్రసవం ద్వారానే జన్మించారు.
 
 అందులో మొదటి బిడ్డ వికలాంగుడు. బేబిరాణి వయసు 28 సంవత్సరాలు కాగా ఇద్దరి పిల్లల వయసు 2, 4 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె పూర్తిగా అనారోగ్యం పాలై మంచాన పడింది. ఆమె భర్త.. పిల్లలను, ఆమెను పోషించడం కష్టంగా మారింది. ఆమె అనారోగ్యానికి డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నాయి. ఆమెను ఇండియా తీసుకొద్దామంటే పాస్‌పోర్టు ఎక్కడో పోయింది. దీంతో ఆమె భర్త భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే ఆమె భారతీయురాలనే ధ్రువపత్రం ఉంటేనే ఆమెను, పిల్లలను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు.
 
  శక్తిదాసన్‌కు పాస్‌పోర్టు ఉన్నా బేబిరాణికి పాస్‌పోర్టు లేకపోవడంతో అందరూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అయితే తన భార్యను, పిల్లలను ఇండియాకు తీసుకెళ్లి పోషించుకుంటానని తన భార్య ఇండియాకు వెళ్లాలంటే ఇండియన్ నేటివిటీ సర్టిఫికెట్ కావలసి ఉందని అధికారులు తాము ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని శక్తిదాసన్ కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రులతోపాటు ఉన్న రేషన్‌కార్డు జిరాక్స్ కాపీ ఉందని, దాని ఆధారంగా తనకు స్థానిక అధికారులు నేటివిటీ పంపిస్తే భారత రాయబార కార్యాలయ అధికారులు తమను ఇండియాకు పంపించే అవకాశం ఉందని శక్తిదాసన్ వేడుకుంటున్నాడు.
 
 నేటివిటీ సర్టిఫికెట్ ఇస్తాం  :  వి.జితేంద్ర తహసిల్దార్
 ఈ విషయాన్ని తహసిల్దార్ వి.జితేంద్ర దృష్టికి తీసుకెళ్లగా గల్ఫ్‌దేశం ఒమన్‌లో అనారోగ్యం పాలైన బేబిరాణి ఈ దేశానికి రావడానికి అన్ని విధాలా సహకరిస్తామని, తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేస్తే నేటివిటీ సర్టిఫికెట్ అందజేస్తామని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement