![no new year celebrations: mudragada - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/19/mudragada-padmanabham.jpg.webp?itok=EYSoG6Nf)
సాక్షి, కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ ఫలాలు అందేవరకు ఏ పండుగా చేసుకోనని కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి స్పష్టం చేశారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందాలనేదే తన ఉద్దేశమని, అందుకోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు పైన పేర్కొన్న కులాలకు అందేవరకూ ఏ పండుగా చేసుకోనని గతంలోనే ప్రకటించానని, దాన్నే మరోసారి గుర్తు చేస్తూ 2018 కొత్త సంవత్సరం వేడుకలకూ దూరంగానే ఉంటానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తమ సామాజిక వర్గాలు ఆశించిన రిజర్వేషన్లు పొందడమే అసలైన పండుగగా భావిస్తానన్నారు. కాపులందరితోపాటు తాను కూడా ఆ రోజు కోసం నిరీక్షిస్తున్నానని అన్నారు. జనవరి 1న తనను కలిసేందుకు కిర్లంపూడికి వచ్చే ప్రయత్నం చేయవద్దని తన శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తన పట్ల అభిమానులు చూపుతున్న వాత్సల్యం ఎనలేనిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment