శాంతియుతంగా జరిగే తెలంగాణ, సమైక్యాంధ్ర నిరసనలకు అభ్యంతరం చెప్పబోమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా జరిగే తెలంగాణ, సమైక్యాంధ్ర నిరసనలకు అభ్యంతరం చెప్పబోమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అవి శ్రుతి మించితే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఆందోళనల్లో బయటి వ్యక్తులు, నేతలు పాల్గొంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు ఇటీవల మీడియా ముందు చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్నామని, ఇవి అభ్యంతరకరంగా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శర్మ మంగళవారం తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. దాదాపు ప్రతి కీలక కార్యాలయంలోనూ అక్కడి సిబ్బంది నిరసనలకు దిగుతున్నారు. అయితే కార్యాలయాలతో సంబంధం లేని బయటి వాళ్లు కూడా అక్కడికొచ్చి రెచ్చగొడుతున్నారు. వారిలో చాలా మందిని ముందు జాగ్రత్తగా అరెస్టు చేస్తున్నాం’ అని తెలిపారు. ఒకే కార్యాలయంలో భిన్న డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్న వారు ఒకే సమయంలో కాకుండా ఒక్కో సమయంలో ఆందోళనలు చేస్తే ఇబ్బందులు ఉండవని సూచించారు. నగరంలో ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించామని, పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు.