
కొత్త పార్టీ ఊహాగానాలే: కిరణ్
హైదరాబాద్ : ఈనెల 23 తర్వాత కొత్త పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తల్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ఆలూ లేదు చూలూ లేదు అన్న సామెతను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విభజన ప్రక్రియ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై కొంతమంది ఎమ్మెల్యేలు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కలిశారు. దీనిపై ఈనెల 23 వరకూ ఆగండని ఆయన వారికి నచ్చచెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన రెండు రోజుల తర్వాత కార్యాచరణను సిద్ధం చేసుకుందామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కిరణ్ బుజ్జగించారు. దాంతో సీఎంకొత్త పార్టీ ఖాయమన్న వార్తలొచ్చాయి. ఈ విషయంపై వివరణ కోరిన మీడియాతో .... అవన్నీ ఊహాగానాలే అంటూ కిరణ్ ఓ నవ్వుపారేశారు. మరోవైపు ఏ తీర్మానం చేయాలన్నా అసెంబ్లీ పరిధిలోనే జరగాలని సీఎం స్పష్టం చేశారు.
తీర్మానంపై ఓటింగ్ జరగకుండా రాష్ట్రం ఏర్పడదని కూడా చెప్పుకొచ్చారు. ప్రత్యేక సమైక్య తీర్మానం సాధ్యం కాదని, దానికి రాష్ట్రపతి కూడా ఒప్పుకోరని సీఎం మీడియాకు చెప్పారు. శ్రీధర్ బాబు రాజీనామా లేఖ అందిందని ఆయన తెలిపారు. నిర్ణయం తీసుకుంటే చెబుతానని, మ్యాచ్ ఫిక్స్ అనేది తప్పుడు ఆరోపణ అన్నారు. 23 తర్వాత సీమాంధ్ర నేతలు అంతా సమావేశం అవుతామని, ఆ భేటీ తర్వాతే ఏ నిర్ణయం అయినా చెబుతామన్నారు.