cm kiran new political party
-
కిరణ్ కచ్చితంగా పార్టీ పెడతారు: ఏరాసు
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరముందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కచ్చితంగా కొత్త పార్టీ పెడతారని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం సీఎం కిరణ్‌తో పలువురు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఏరాసు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈరోజు సీఎం కిరణ్ రాజీనామా చేయడంలేదని వెల్లడించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రోజున సీఎం రాజీనామా చేస్తారని చెప్పారు. తమ జిల్లా నాయకులతో మాట్లాడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకుంటామని ఏరాసు తెలిపారు. తాము ఏపార్టీలో ఉంటామన్నది త్వరలోనే తేలుస్తుందన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు పెట్టిన వెంటనే సీఎం కిరణ్ రాజీనామా చేస్తారని మరో మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. ఇప్పుడు రాజీనామా చేస్తే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్టు సంకేతాలు పోతాయన్న భావనతో సీఎం వెనక్కు తగ్గారని వెల్లడించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదని బీజేపీ సహా రాజకీయ పక్షాలు అంటున్నాయని టీజీ చెప్పారు. -
ఇంతకీ స్పాన్సర్స్ ఎవరు?
35 కళా బృందాలు 1500 భారీ హోర్డింగులు 10 లక్షల టీ-షర్టులు 15 లక్షల టోపీలు ఈ లిస్టు ఏంటనుకుంటున్నారా? సీఎం కిరణ్ పెట్టే కొత్త పార్టీకి సన్నాహాలు. సమైక్య నినాదాన్ని ఘనంగా వినిపించే ప్రయత్నంలో భాగం జరుగుతున్న ప్రయత్నం ఇదంతా. సమైక్య ఛాంపియన్‌ను తానేనని ఎంత గట్టిగా ఘీంకారాలు చేస్తున్నా ఎవరూ గుర్తించకపోవడంతో... ప్రచారాన్ని భారీగా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 23వ తేదీ వరకు వేచి చూడాలని, అప్పుడు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుందని ఇటీవల చాలా సందర్భాలలో కిరణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి కొత్త పార్టీ ఆవిష్కరణ 23నే జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల్ని ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ప్రచారం కోసం ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ముంబయి కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత కన్సలెన్ట్సీ ఈ ప్రచార బాధ్యతల్ని భుజాలకెత్తుకుంది. ఎఫ్ఎం రేడియోలు, టీవీలు, థియేటర్లలోనూ సమైక్యవాదం గట్టిగా వినిపిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3 జిల్లాల్లో ఈ మేరకు రిహార్సిల్స్ మొదలు పెట్టేశారు కూడా. ఇక కొత్త పార్టీ వెనుక విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, సీఎం కిరణ్, ఆయన సోదరుడు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. సీఎం కిరణ్ పైసా విదిల్చే రకం కాదని ఆయన సన్నిహితులే చెప్తారు. లగడపాటికి అంత సీన్ లేదంటారు? మరీ ఇంత భారీ ఫండింగ్ చేస్తున్నది ఎవరూ? సమైక్య పార్టీ హడావుడి ఆర్భాటం వెనుక ఉన్నది రామోజీరావు, చంద్రబాబు నాయుడట. ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిన ఎదిగిన జగన్‌ను ఎదుర్కొనేందుకు కిరణ్‌ను పావుగా ఎంచుకున్నారని సమాచారం. తమ సామాజిక వర్గానికి చెందిన లగడపాటిని మధ్యవర్తిగా పెట్టారని పొలిటికల్ సర్కిల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నాటకంలో లగడపాటి కూడా తన పాత్రను అద్భుతంగా పోషిస్తూ రామోజీ, చంద్రబాబు దగ్గర మంచి మార్కులే కొట్టేస్తున్నారట. కిరణ్ బలాన్ని భూతద్దంలో చూపి సమైక్యం విషయంలో బాహుబలి అని పైకెత్తేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జనం మాత్రం సమైక్యం పేరుతో చేస్తున్న ప్రచార ఆర్భాటాన్ని తప్పుబడుతున్నారు. ఆరు నెలలుగా అవిశ్రాంతంగా సమైక్యం కోసం ఉద్యమాలు చేస్తుంటే... ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు ఈ ప్రచారమేంటని ప్రశ్నిస్తున్నారు. -
కొత్త పార్టీ ఊహాగానాలే: కిరణ్
హైదరాబాద్ : ఈనెల 23 తర్వాత కొత్త పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తల్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు. ఆలూ లేదు చూలూ లేదు అన్న సామెతను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విభజన ప్రక్రియ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణపై కొంతమంది ఎమ్మెల్యేలు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కలిశారు. దీనిపై ఈనెల 23 వరకూ ఆగండని ఆయన వారికి నచ్చచెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన రెండు రోజుల తర్వాత కార్యాచరణను సిద్ధం చేసుకుందామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కిరణ్ బుజ్జగించారు. దాంతో సీఎంకొత్త పార్టీ ఖాయమన్న వార్తలొచ్చాయి. ఈ విషయంపై వివరణ కోరిన మీడియాతో .... అవన్నీ ఊహాగానాలే అంటూ కిరణ్ ఓ నవ్వుపారేశారు. మరోవైపు ఏ తీర్మానం చేయాలన్నా అసెంబ్లీ పరిధిలోనే జరగాలని సీఎం స్పష్టం చేశారు. తీర్మానంపై ఓటింగ్ జరగకుండా రాష్ట్రం ఏర్పడదని కూడా చెప్పుకొచ్చారు. ప్రత్యేక సమైక్య తీర్మానం సాధ్యం కాదని, దానికి రాష్ట్రపతి కూడా ఒప్పుకోరని సీఎం మీడియాకు చెప్పారు. శ్రీధర్ బాబు రాజీనామా లేఖ అందిందని ఆయన తెలిపారు. నిర్ణయం తీసుకుంటే చెబుతానని, మ్యాచ్ ఫిక్స్ అనేది తప్పుడు ఆరోపణ అన్నారు. 23 తర్వాత సీమాంధ్ర నేతలు అంతా సమావేశం అవుతామని, ఆ భేటీ తర్వాతే ఏ నిర్ణయం అయినా చెబుతామన్నారు.