శూన్య హస్తం
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు
వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి వెనుకడుగు
ద్వితీయ శ్రేణి నాయకులను దింపేందుకు కసరత్తు
ఈ మేరకు నివేదిక సిద్ధం చేసిన పరిశీలకుడు
రెండు రోజుల్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశీలన
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు కరువయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ముఖ్య నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమ అనుచరణ గణంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు, అలాగే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు చేసేందుకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడికి అన్ని వివరాలు తెలిసిపోయాయి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అతనికి శూన్య ‘హస్త’మే కనిపించింది.
రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీపై జనం చీదరించుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆలూరు, కోడుమూరు ఎమ్మెల్యేలను స్థానికులే ఒప్పుకోవటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై ఆ పార్టీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులుగా ఏఐసీసీ దూత ఒకరు కర్నూలులో సుధీర్ఘంగా కసరత్తు చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల వివరాలను సేకరించారు. ఆ వివరాలతో నివేదిక సిద్దం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. రేపో, మాపో ఆ నివేదికను అధిష్టాన వర్గాలకు సమర్పించనున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలు అసెంబ్లీ స్థానంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖా మంత్రి టీజీ వెంకటేష్ అసెంబ్లీ సెషన్స్ తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తేల్చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయటానికి సుముఖత వ్యక్తం చేయటం లేదని తేలిపోయింది.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వద్దే వద్దు...
కోడుమూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మురళీకృష్ణపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అతన్ని పోటీ నుంచి తప్పించమని కోరినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయంపై దృష్టి సారించారు. డోన్ విషయానికి వస్తే పోటీ చేయటానికి ఎవరూ సాహసించటం లేదు. వచ్చే ఎన్నికల్లో కోట్ల కుటుంబం డోన్‌ను విడిచిపెట్టాలనే ఆలోచన చేస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. పత్తికొండ విషయానికి వస్తే చెరుకులపాడు నారాయణరెడ్డి పేరు వినిపిస్తోంది. ఎమ్మిగనూరుకూ సరైన అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన రుద్రగౌడు తనకు ఈ సారి అవకాశం కల్పించమని కోరారు. మంత్రాలయం టిక్కెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎమ్మిగనూరు, మంత్రాలయంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డిని ఎదుర్కొనాలంటే గట్టి అభ్యర్థి కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదోనిలో చంద్రశేఖరరెడ్డి, దేవిశెట్టి ప్రకాష్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
ఆలూరు విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే నీరజారెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకిస్తుంటే.. మరి కొందరు ఆమెకే టికె ్కట్ ఇవ్వమని కోరుతున్నారు. మరి కొందరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేరును ప్రతిపాదించారు. పోటీచేయాలంటే ఖర్చు పార్టీనే భరించాల్సిందే... ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ దిగాలంటే సాహసంతో కూడుకున్న పని అని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పరిశీలకుల వద్ద విన్నవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిట్టింగ్‌లు బరిలో దిగటానికి వెనుకాడుతున్న తరుణంలో ద్వితీయశ్రేణి నాయకులు కొందరు ఈ సారి తాము పోటీలో ఉంటామని చెప్పారు. అయితే ఎన్నికల వ్యయం అంతా పార్టీనే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే పోటీ చేస్తామని ఏఐసీసీ పరిశీలకుల వద్ద తేల్చిచెప్పటంతో ఖంగుతిన్నారు. ఏఐసీసీ పరిశీలకుని రాకతో కాంగ్రెస్ బలహీనత బయటపడింది. దీంతో అభ్యర్థుల కోసం పార్టీ ముఖ్యులు అన్వేషణ ప్రారంభించటం గమనార్హం. ఇదిలా ఉంటూ నంద్యాల పార్లమెంట్ పరిధిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభ్యర్థుల కోసం రెండు మూడు రోజుల్లో ఏఐసీసీ పరిశీలకులు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.