neeraja reddy
-
విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి
కర్నూలు(హాస్పిటల్)/ఆలూరు రూరల్/ఎర్రవల్లి చౌరస్తా: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజా రెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఈ నెల 18వ తేదీన భర్త శేషిరెడ్డి వర్ధంతి ఉండడంతో హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన దేవనకొండ మండలంలోని తెర్నెకల్ గ్రామానికి ఆమె ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు సమీపంలోని కొట్టం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు టైర్ పేలడంతో అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. నీరజా రెడ్డి సీటు బెల్టు ధరించకపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మృతి చెందారు. డ్రైవర్ బాబ్జీకి గాయాలయ్యాయి. నీరజారెడ్డి ప్రమాదవార్త తెలిసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కాటసానితో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకున్నారు. నీరజారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు. నీరజారెడ్డి రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ జిల్లా వేంపల్లె గ్రామానికి చెందిన రాంచిన్నారెడ్డి (హైకోర్టు రిటైర్డ్ జడ్జి) కుమార్తె నీరజా రెడ్డిని 1988లో కర్నూలు జిల్లా తెర్నెకల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి చిన్న కుమారుడు శేషిరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శేషిరెడ్డి 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో శేషిరెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నీరజా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2004లో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీరజారెడ్డికి అవకాశం కల్పించారు. అప్పట్లో ఈమె పీఆర్పీ అభ్యర్థి జయరాంపై 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె ఆలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈమె కూతురు హిమవర్షిణి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. -
నాసిరకం విత్తనాలతో పత్తి రైతు కుదేల్
150 ఎకరాల్లో పంట నష్టం అర్జున్-21 రకం విత్తనాలతో నష్టపోయామన్న రైతులు అప్పుల ఊబిలో పత్తి రైతులు బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని రెడ్డిపాళెంలో నాశిరకం విత్తనాలతో పత్తిరైతు నిండా మునిగిపోయాడు. గ్రామంలో మొత్తం 600 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. కాగా తొలిసారిగా అర్జున్-21 విత్తనాలను డిస్ట్రిబ్యూటర్లు రైతులకు ఇచ్చారు. అధిక దిగుబడి ఇస్తుందని నమ్మబలికారు. దీంతో కొందరు రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేశారు. దాదాపు 150 ఎకరాల్లో ఆ విత్తనాలను నాటారు. ఎకరానికి విత్తనాలను నాటడం మొదలు ఇప్పటి వరకు దాదాపు రూ.20 వేలు ఖర్చుచేశారు. మొక్కలు నాటి 3 నెలలు దాటినా పూర్తిస్థాయిలో పూతరాని పరిస్థితి నెలకొంది. మొక్క ఎదుగుద ల కనపడటం లేదు. వీటికి సంబంధించి పలురకాల మందులు వాడారు. అయినా ఫలితం లేకుండాపోయింది. మిగతా 450 ఎకరాల్లో (అర్జున్-21 వాడని) ఇప్పటికీ ఒక్కో ఎకరాకు 8 క్వింటాళ్ల పత్తి వచ్చింది. దీంతో ఆయా రైతులు ఆనందంలో ఉండగా, అర్జున్-21 వాడిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ క్వింటాల్ పత్తి కూడా ఎకరాకు రాలేదని బాధపడుతున్నారు. దీనికి సంబంధించి విత్తనాలు అమ్మిన డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేసినా సమాధానం కరువైందని వాపోతున్నారు. దిగుబడి రాక అప్పుల పాలయ్యాం... నాశిరకం విత్తనాలు అమ్మి తమను దగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరానికి రూ.20 వేలు ఖర్చుచేశా.. -గెండి పెంచలయ్య, రెడ్డిపాళెం రెండు ఎకరాల్లో అర్జున్-21 విత్తనాలతో సాగుచేశాను. మూడు నెలల దాటినా దిగుబడి కనపడలేదు. విత్తనాలు అమ్మిన వ్యక్తికి ఫోన్ చేసినా స్పందన లేదు. ఎకరానికి రూ.20వేలు ఖర్చుచేశాను. రూ.40 వేలు నష్టపోయాను. నమ్మించి నట్టేటముంచాడు : -పాణెం కృష్ణారెడ్డి, రెడ్డిపాళెం అధిక దిగుబడి వస్తుందని చెప్పి డిస్ట్రిబ్యూటర్ నమ్మించి నట్టేటముంచాడు. పంట పూర్తయినా నేటికీ దిగుబడి రాలేదు. పూర్తిగా నష్టపోయా. ఫోన్ చేసినా స్పందన లేదు :-బిజ్జం వెంకటేశ్వర్లురెడ్డి, రెడ్డిపాళెం. అర్జున్-21 కంపెనీకి ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాధానం కూడా చెప్పలేదు. 4 ఎకరాల్లో పత్తి సాగుచేశాను. అధికారులు చర్యలు తీసుకోవాలి. పంట దిగుబడి రాలేదు : పైడాల వెంకటేశ్వర్లు రెడ్డి, రెడ్డిపాళెం. ఒకటిన్నర ఎకరాల్లో పత్తి సాగుచేశాను. క్వింటాల్ దూది కూడా కనపడడం లేదు. పక్కన ఇతర విత్తనాలను నాటిన రైతులు ఎకరాకు 8 క్వింటాళ్ల దూది వస్తోంది. నా దృష్టికి వచ్చింది : - నీరజారెడ్డి, ఏఓ నాశిరకం పత్తి విత్తనాల విషయం నాదృష్టికి వచ్చింది. సరైన దిగుబడి రాలేదని తెలిసింది. విత్తనాలు కొన్న బిల్లులు తీసుకురావాలని రైతులకు సూచించాను. వాటిని పరిశీలించిన తర్వాత అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాను. -
జూనియర్లతో డ్యాన్స్ చేయించిన హౌస్ సర్జన్ల సస్పెన్షన్
అనంతపురం: నగరంలోని మెడికల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ మెడికోల ర్యాగింగ్ ఘటనపై ఆ కాలేజీ ప్రిన్సిపల్ నీరజారెడ్డి సీరియస్ అయ్యారు. అందుకు బాధ్యులైన నలుగురు హౌస్ సర్జన్లను విధుల నుంచి ప్రిన్సిపల్ తప్పించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణలో హౌస్ సర్జన్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతపురంలోని మెడికల్ కాలేజీలో శనివారం అర్థరాత్రి సీనియర్ మెడికోలు... జానియర్లను ర్యాగింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని జూనియర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీనియర్లు....జూనియర్లతో బలవంతంగా దుస్తులు విప్పించి డాన్సులు చేయించారు. అనంతరం బాధితులు సహచర విద్యార్థులతో కలసి కాలేజీ ఉన్నతాధికారులకు ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేశారు. దాంతో కాలేజీ ప్రిన్సిపల్ విచారణ చేపట్టారు. -
శూన్య హస్తం
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి వెనుకడుగు ద్వితీయ శ్రేణి నాయకులను దింపేందుకు కసరత్తు ఈ మేరకు నివేదిక సిద్ధం చేసిన పరిశీలకుడు రెండు రోజుల్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశీలన సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు కరువయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ముఖ్య నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమ అనుచరణ గణంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు, అలాగే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు చేసేందుకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడికి అన్ని వివరాలు తెలిసిపోయాయి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అతనికి శూన్య ‘హస్త’మే కనిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీపై జనం చీదరించుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆలూరు, కోడుమూరు ఎమ్మెల్యేలను స్థానికులే ఒప్పుకోవటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై ఆ పార్టీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులుగా ఏఐసీసీ దూత ఒకరు కర్నూలులో సుధీర్ఘంగా కసరత్తు చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల వివరాలను సేకరించారు. ఆ వివరాలతో నివేదిక సిద్దం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. రేపో, మాపో ఆ నివేదికను అధిష్టాన వర్గాలకు సమర్పించనున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలు అసెంబ్లీ స్థానంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖా మంత్రి టీజీ వెంకటేష్ అసెంబ్లీ సెషన్స్ తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తేల్చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయటానికి సుముఖత వ్యక్తం చేయటం లేదని తేలిపోయింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వద్దే వద్దు... కోడుమూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మురళీకృష్ణపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అతన్ని పోటీ నుంచి తప్పించమని కోరినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయంపై దృష్టి సారించారు. డోన్ విషయానికి వస్తే పోటీ చేయటానికి ఎవరూ సాహసించటం లేదు. వచ్చే ఎన్నికల్లో కోట్ల కుటుంబం డోన్‌ను విడిచిపెట్టాలనే ఆలోచన చేస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. పత్తికొండ విషయానికి వస్తే చెరుకులపాడు నారాయణరెడ్డి పేరు వినిపిస్తోంది. ఎమ్మిగనూరుకూ సరైన అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన రుద్రగౌడు తనకు ఈ సారి అవకాశం కల్పించమని కోరారు. మంత్రాలయం టిక్కెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎమ్మిగనూరు, మంత్రాలయంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డిని ఎదుర్కొనాలంటే గట్టి అభ్యర్థి కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదోనిలో చంద్రశేఖరరెడ్డి, దేవిశెట్టి ప్రకాష్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఆలూరు విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే నీరజారెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకిస్తుంటే.. మరి కొందరు ఆమెకే టికె ్కట్ ఇవ్వమని కోరుతున్నారు. మరి కొందరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేరును ప్రతిపాదించారు. పోటీచేయాలంటే ఖర్చు పార్టీనే భరించాల్సిందే... ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ దిగాలంటే సాహసంతో కూడుకున్న పని అని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పరిశీలకుల వద్ద విన్నవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిట్టింగ్‌లు బరిలో దిగటానికి వెనుకాడుతున్న తరుణంలో ద్వితీయశ్రేణి నాయకులు కొందరు ఈ సారి తాము పోటీలో ఉంటామని చెప్పారు. అయితే ఎన్నికల వ్యయం అంతా పార్టీనే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే పోటీ చేస్తామని ఏఐసీసీ పరిశీలకుల వద్ద తేల్చిచెప్పటంతో ఖంగుతిన్నారు. ఏఐసీసీ పరిశీలకుని రాకతో కాంగ్రెస్ బలహీనత బయటపడింది. దీంతో అభ్యర్థుల కోసం పార్టీ ముఖ్యులు అన్వేషణ ప్రారంభించటం గమనార్హం. ఇదిలా ఉంటూ నంద్యాల పార్లమెంట్ పరిధిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభ్యర్థుల కోసం రెండు మూడు రోజుల్లో ఏఐసీసీ పరిశీలకులు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.