కర్నూలు(హాస్పిటల్)/ఆలూరు రూరల్/ఎర్రవల్లి చౌరస్తా: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజా రెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఈ నెల 18వ తేదీన భర్త శేషిరెడ్డి వర్ధంతి ఉండడంతో హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన దేవనకొండ మండలంలోని తెర్నెకల్ గ్రామానికి ఆమె ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు సమీపంలోని కొట్టం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు టైర్ పేలడంతో అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. నీరజా రెడ్డి సీటు బెల్టు ధరించకపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మృతి చెందారు. డ్రైవర్ బాబ్జీకి గాయాలయ్యాయి. నీరజారెడ్డి ప్రమాదవార్త తెలిసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కాటసానితో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకున్నారు. నీరజారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు.
నీరజారెడ్డి రాజకీయ ప్రస్థానం
వైఎస్సార్ జిల్లా వేంపల్లె గ్రామానికి చెందిన రాంచిన్నారెడ్డి (హైకోర్టు రిటైర్డ్ జడ్జి) కుమార్తె నీరజా రెడ్డిని 1988లో కర్నూలు జిల్లా తెర్నెకల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి చిన్న కుమారుడు శేషిరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శేషిరెడ్డి 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో శేషిరెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నీరజా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2004లో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీరజారెడ్డికి అవకాశం కల్పించారు. అప్పట్లో ఈమె పీఆర్పీ అభ్యర్థి జయరాంపై 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె ఆలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె కూతురు హిమవర్షిణి తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment