150 ఎకరాల్లో పంట నష్టం
అర్జున్-21 రకం విత్తనాలతో నష్టపోయామన్న రైతులు
అప్పుల ఊబిలో పత్తి రైతులు
బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని రెడ్డిపాళెంలో నాశిరకం విత్తనాలతో పత్తిరైతు నిండా మునిగిపోయాడు. గ్రామంలో మొత్తం 600 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. కాగా తొలిసారిగా అర్జున్-21 విత్తనాలను డిస్ట్రిబ్యూటర్లు రైతులకు ఇచ్చారు. అధిక దిగుబడి ఇస్తుందని నమ్మబలికారు. దీంతో కొందరు రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేశారు. దాదాపు 150 ఎకరాల్లో ఆ విత్తనాలను నాటారు. ఎకరానికి విత్తనాలను నాటడం మొదలు ఇప్పటి వరకు దాదాపు రూ.20 వేలు ఖర్చుచేశారు. మొక్కలు నాటి 3 నెలలు దాటినా పూర్తిస్థాయిలో పూతరాని పరిస్థితి నెలకొంది. మొక్క ఎదుగుద ల కనపడటం లేదు.
వీటికి సంబంధించి పలురకాల మందులు వాడారు. అయినా ఫలితం లేకుండాపోయింది. మిగతా 450 ఎకరాల్లో (అర్జున్-21 వాడని) ఇప్పటికీ ఒక్కో ఎకరాకు 8 క్వింటాళ్ల పత్తి వచ్చింది. దీంతో ఆయా రైతులు ఆనందంలో ఉండగా, అర్జున్-21 వాడిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ క్వింటాల్ పత్తి కూడా ఎకరాకు రాలేదని బాధపడుతున్నారు. దీనికి సంబంధించి విత్తనాలు అమ్మిన డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేసినా సమాధానం కరువైందని వాపోతున్నారు. దిగుబడి రాక అప్పుల పాలయ్యాం... నాశిరకం విత్తనాలు అమ్మి తమను దగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎకరానికి రూ.20 వేలు ఖర్చుచేశా.. -గెండి పెంచలయ్య, రెడ్డిపాళెం
రెండు ఎకరాల్లో అర్జున్-21 విత్తనాలతో సాగుచేశాను. మూడు నెలల దాటినా దిగుబడి కనపడలేదు. విత్తనాలు అమ్మిన వ్యక్తికి ఫోన్ చేసినా స్పందన లేదు. ఎకరానికి రూ.20వేలు ఖర్చుచేశాను. రూ.40 వేలు నష్టపోయాను.
నమ్మించి నట్టేటముంచాడు : -పాణెం కృష్ణారెడ్డి, రెడ్డిపాళెం
అధిక దిగుబడి వస్తుందని చెప్పి డిస్ట్రిబ్యూటర్ నమ్మించి నట్టేటముంచాడు. పంట పూర్తయినా నేటికీ దిగుబడి రాలేదు. పూర్తిగా నష్టపోయా.
ఫోన్ చేసినా స్పందన లేదు :-బిజ్జం వెంకటేశ్వర్లురెడ్డి, రెడ్డిపాళెం.
అర్జున్-21 కంపెనీకి ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాధానం కూడా చెప్పలేదు. 4 ఎకరాల్లో పత్తి సాగుచేశాను. అధికారులు చర్యలు తీసుకోవాలి.
పంట దిగుబడి రాలేదు : పైడాల వెంకటేశ్వర్లు రెడ్డి, రెడ్డిపాళెం.
ఒకటిన్నర ఎకరాల్లో పత్తి సాగుచేశాను. క్వింటాల్ దూది కూడా కనపడడం లేదు. పక్కన ఇతర విత్తనాలను నాటిన రైతులు ఎకరాకు 8 క్వింటాళ్ల దూది వస్తోంది.
నా దృష్టికి వచ్చింది : - నీరజారెడ్డి, ఏఓ
నాశిరకం పత్తి విత్తనాల విషయం నాదృష్టికి వచ్చింది. సరైన దిగుబడి రాలేదని తెలిసింది. విత్తనాలు కొన్న బిల్లులు తీసుకురావాలని రైతులకు సూచించాను. వాటిని పరిశీలించిన తర్వాత అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాను.
నాసిరకం విత్తనాలతో పత్తి రైతు కుదేల్
Published Sat, Aug 1 2015 4:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement