Inferior seeds
-
సగం ఇచ్చారు.. సగం మింగారు..
విత్తన కంపెనీ పంపిన డబ్బును కాజేసిన ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు మహబూబాబాద్ : నాసిరకం విత్తనాలతో తాను నష్టపోయానని, కంపెనీ నుంచి నష్టపరిహారం మంజూరైనప్పటికీ గత అసోసియేషన్ నాయకులు నొక్కేశారని మానుకోట శివారు సాలార్‌తండాకు ఓ రైతు ఆరోపించాడు. బాధిత రైతు కథనం ప్రకారం.. సాలార్‌తండాకు చెందిన దారావత్ బాలాజీ 5 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నాడు. అందులో 2 ఎకరాలు కూరగాయలు సాగు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం మానుకోటలోని ఓ ఫెస్టిసైడ్ షాపులో ప్యాకెట్ రూ.300 చొప్పున 5 టమాట పంటకు సంబంధించిన విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. పూత రాకపోవడంతో ఆ పంట మొత్తం దెబ్బతింది. ఆ సమయంలో టమాట కేజీ 100 రూపాయలపైనే ఉంది. ఈ విషయాన్ని బాధిత రైతు డీలర్ వద్ద మొరపెట్టుకోగా కంపెనీ ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించి వెళ్లారు. రూ.లక్ష పరిహారం ఇవ్వాలని రైతు డిమాండ్ చేయగా రూ.50 వేలు ఇచ్చేటట్లు అంగీకరించారు. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ మానుకోట శాఖ నాయకులకు ఆ కంపెనీకి చెందిన వారు అప్పట్లో రూ.50 వేలు పంపారు. కానీ ఆ రైతుకు కేవలం 25 వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయై సంబంధిత డీలర్‌తో, నాయకులతో గత కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. కంపెనీకి సంబంధించిన వారికి ఫోన్ చేస్తే అసోసియేషన్‌కు డబ్బులు పంపడం జరిగిందని వారు చెప్పారని బాధిత రైతు వాపోయాడు. ఇటీవల అదే డీలర్ వద్ద నకిలీ విత్తనాల విషయంలో గొడవ జరుగగా పంచాయితీ చేసి రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు అందజేశారు. ఇటీవల మానుకోట మండలంలోని పర్వతగిరి రైతులు సుమారు 100 మంది ఖమ్మంకు సంబంధించిన ఓ వ్యాపారి వద్ద మిర్చి విత్తనాలు కొనుగోలు చేయగా ఎదుగుదలలేక నష్టపోయారు. కంపెనీ ప్రతినిధులు పంటలను పరిశీలించి తప్పిదం జరిగిందని ఎకరానికి సుమారు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని అందుకు గడువు కావాలని వారు కోరినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. ఏదేమైనా మానుకోటలో నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. సంబంధిత అధికారులు వ్యాపారులకు పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారని, వారు మాముళ్లు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. -
బండారం బట్టబయలు
► కొత్తమొల్గరలో పట్టుబడిన నాసిరకం విత్తనాలు ► 5240 పత్తి విత్తన పాకెట్లు, 147 విత్తన సంచులు సీజ్ ► ఇద్దరిపై కేసు నమోదు ► జిల్లాలో కొనసాగుతున్న దాడులు మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు పత్తి విత్తన కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. అందులో భాగంగా నాసిరకం విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో తయారు చేస్తున్నారు. జిల్లాలోని అత్యధిక సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు కోమార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో కొన్ని కంపెనీలు అనుమతులు ఉన్న విత్తన కంపెనీల నుంచి మార్కెటింగ్‌కు అనుమతులు తీసుకుంటున్నాయి. మార్కెటింగ్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ఎక్కువ మొత్తంలో నాసిరకం విత్తనాలకు రంగులద్ది రైతులకు అంటగడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో మూడు రోజులుగా ప్రాసెసింగ్ యూనిట్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల రాక సమాచారాన్ని నాలుగైదు రోజుల క్రితమే అందుకున్న కంపెనీల నిర్వాహకులు రాత్రికి రాత్రే విత్తనాలను వేరే చోటుకు తరలించారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించారు. దీంతో నాసిరకం విత్తనాల కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యరని ఆరోపణలు వినిపించాయి. భారీగా బయటపడిన విత్తనాలు.. భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గరలో అక్రమ నిల్వలు, నాసిరకం విత్తనాలు ఉన్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో బుధవారం గ్రామంలోని రెండు ఇళ్లు, ఓ షెట్టర్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన పత్తి విత్తనాలు పెద్దఎత్తున బయటపడ్డాయి. ఓ సీడ్ కంపెనీ నిర్వాహకులు గ్రామంలో ఇళ్లను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన విత్తన పాకెట్లును తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన విత్తన సంచులను సీజ్ చేశారు. ఈ తనిఖీలో 5,240 పత్తి విత్తన పాకెట్లు, 147విత్తన సంచులను పోలీసులు సీజ్ చేశారు. అక్రమ నిల్వలకు పాల్పడిన అశోక్ రెడ్డి, గాల్రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో జడ్చర్ల రూరల్ ఇన్చార్జ్ సీఐ సైదయ్య, మండల వ్యవసాయాధికారిణి బ్యూలా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్టాప్సేల్కు ఆదేశం.. జిల్లాలో కమిషనర్ కార్యాలయ అధికారుల బృందం గద్వాలలో బుధవారం కావేరి, నర్మదసాగర్, అంకూర్ సీడ్ కంపెనీలలో తనిఖీలు నిర్వహించారు. కోమార్కెటింగ్ అనుమతులు లేని కంపెనీలకు చెందిన 36,346 కేజీల పత్తి విత్తనాలకు అధికారులు స్టాప్ సేల్ ఆదేశాలు జారీ చేశారు. నాసిరకం విత్తనాలను తయారు చేస్తే చర్యలు జిల్లాలో నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు తయారు చేసే వ్యక్తులు, కంపెనీలపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. రైతుల అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి. - బాలునాయక్, జేడీఏ -
నాసిరకం విత్తనాలతో పత్తి రైతు కుదేల్
150 ఎకరాల్లో పంట నష్టం అర్జున్-21 రకం విత్తనాలతో నష్టపోయామన్న రైతులు అప్పుల ఊబిలో పత్తి రైతులు బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని రెడ్డిపాళెంలో నాశిరకం విత్తనాలతో పత్తిరైతు నిండా మునిగిపోయాడు. గ్రామంలో మొత్తం 600 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. కాగా తొలిసారిగా అర్జున్-21 విత్తనాలను డిస్ట్రిబ్యూటర్లు రైతులకు ఇచ్చారు. అధిక దిగుబడి ఇస్తుందని నమ్మబలికారు. దీంతో కొందరు రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేశారు. దాదాపు 150 ఎకరాల్లో ఆ విత్తనాలను నాటారు. ఎకరానికి విత్తనాలను నాటడం మొదలు ఇప్పటి వరకు దాదాపు రూ.20 వేలు ఖర్చుచేశారు. మొక్కలు నాటి 3 నెలలు దాటినా పూర్తిస్థాయిలో పూతరాని పరిస్థితి నెలకొంది. మొక్క ఎదుగుద ల కనపడటం లేదు. వీటికి సంబంధించి పలురకాల మందులు వాడారు. అయినా ఫలితం లేకుండాపోయింది. మిగతా 450 ఎకరాల్లో (అర్జున్-21 వాడని) ఇప్పటికీ ఒక్కో ఎకరాకు 8 క్వింటాళ్ల పత్తి వచ్చింది. దీంతో ఆయా రైతులు ఆనందంలో ఉండగా, అర్జున్-21 వాడిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ క్వింటాల్ పత్తి కూడా ఎకరాకు రాలేదని బాధపడుతున్నారు. దీనికి సంబంధించి విత్తనాలు అమ్మిన డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేసినా సమాధానం కరువైందని వాపోతున్నారు. దిగుబడి రాక అప్పుల పాలయ్యాం... నాశిరకం విత్తనాలు అమ్మి తమను దగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరానికి రూ.20 వేలు ఖర్చుచేశా.. -గెండి పెంచలయ్య, రెడ్డిపాళెం రెండు ఎకరాల్లో అర్జున్-21 విత్తనాలతో సాగుచేశాను. మూడు నెలల దాటినా దిగుబడి కనపడలేదు. విత్తనాలు అమ్మిన వ్యక్తికి ఫోన్ చేసినా స్పందన లేదు. ఎకరానికి రూ.20వేలు ఖర్చుచేశాను. రూ.40 వేలు నష్టపోయాను. నమ్మించి నట్టేటముంచాడు : -పాణెం కృష్ణారెడ్డి, రెడ్డిపాళెం అధిక దిగుబడి వస్తుందని చెప్పి డిస్ట్రిబ్యూటర్ నమ్మించి నట్టేటముంచాడు. పంట పూర్తయినా నేటికీ దిగుబడి రాలేదు. పూర్తిగా నష్టపోయా. ఫోన్ చేసినా స్పందన లేదు :-బిజ్జం వెంకటేశ్వర్లురెడ్డి, రెడ్డిపాళెం. అర్జున్-21 కంపెనీకి ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాధానం కూడా చెప్పలేదు. 4 ఎకరాల్లో పత్తి సాగుచేశాను. అధికారులు చర్యలు తీసుకోవాలి. పంట దిగుబడి రాలేదు : పైడాల వెంకటేశ్వర్లు రెడ్డి, రెడ్డిపాళెం. ఒకటిన్నర ఎకరాల్లో పత్తి సాగుచేశాను. క్వింటాల్ దూది కూడా కనపడడం లేదు. పక్కన ఇతర విత్తనాలను నాటిన రైతులు ఎకరాకు 8 క్వింటాళ్ల దూది వస్తోంది. నా దృష్టికి వచ్చింది : - నీరజారెడ్డి, ఏఓ నాశిరకం పత్తి విత్తనాల విషయం నాదృష్టికి వచ్చింది. సరైన దిగుబడి రాలేదని తెలిసింది. విత్తనాలు కొన్న బిల్లులు తీసుకురావాలని రైతులకు సూచించాను. వాటిని పరిశీలించిన తర్వాత అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాను. -
చచ్చులు.. పుచ్చులే!
కొన్ని లాట్లలో నాసిరకం విత్తనాలు ప్రస్తుత పరిస్థితుల్లో కే-6తో నష్టమే ‘రాయి’తీ విత్తనాల్లో ఇదీ పరిస్థితి సబ్సిడీ వేరుశెనగ విత్తనకాయల నాణ్యతను అధికారులు గాలికొదిలేశారు. అసలే దిగుబడి రాని కే-6 రకం విత్తనాలు, అందులోనూ సగం చచ్చులు.. పుచ్చులే పంపిణీ చేస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన ‘రాయి’తీ వేరుశెనగ విత్తనాల్లో ఈ విషయం వెలుగుచూసింది. వీటిని ఒలిచి చేలల్లో వేసినా మొలకెత్తుతాయనే గ్యారంటీ లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు: ఖరీఫ్‌లో జిల్లాలోని 11 వ్యవసాయశాఖ డివిజన్లు, 53 మండలాల్లో (సత్యవేడు, శ్రీకాళహస్తి కాకుండా) వేరుశెనగ విత్తన కాయల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. డీలర్లు, ప్రభుత్వం మధ్య ధర విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా వేరుశెనగ విత్తనకాయల పంపిణీ ఆలస్యమైంది. ఇప్పటికే సీజన్ ముగుస్తుండడంతో అధికారులు విత్తనాల పంపిణీ త్వరగా చేపట్టాలనే తలంపుతో కాయల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదు. ఈ సీజన్లో లక్షా 14 వేల హెక్టార్లలో వేరుశెనగ విత్తనున్నారు. ఈ మేరకు లక్ష క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు అలాట్మెంట్ సిద్ధం చేశారు. అయితే పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో కేవలం 50వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయదలచుకున్నారు. నాణ్యత గాలికి ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు నుంచి వీటిని తెప్పించారు. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను ఒలిస్తే దాదాపు 70 గ్రాముల గింజలు ఉండాలి. విత్తనం మొలకశాతం 70గా ఉండాలనే నిబంధన ఉంది. లోడ్ల వారీగా ఇక్కడికందే విత్తన కాయలను చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షించాల్సి ఉంది. కానీ ఈ దఫా ఇదంతా జరగలేదని స్పష్టమవుతోంది. ఇక సంబంధిత ఏవోలు విత్తన కాయలను ఒలిచి తడిగుడ్డలో 24 గంటలు చుట్టిపెట్టి మొలక శాతాన్ని పరిశీలించాకే రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రమాణాలను అసలు పట్టించుకోలేదు. చాలా చోట్ల నాశిరకం విత్తనాలే జిల్లాలో రైతులకు అందజేస్తున్న విత్తన కాయల్లో చాలా లాట్లలో నాశిరకం విత్తనాలే దర్శనమిస్తున్నాయి. కాయలతో పాటు తొక్కు, రాళ్లు ఉండడం, కాయలు సైతం బలిష్టంగా లేక ఓ వైపు నల్లరంగుతో బుడ్డగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వీటిని ఒలిచి చేలల్లో వేసినా సగం వరకు విత్తనాలు మొలకెత్తే అవకాశాలు లేవని అనుభవం గల రైతులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కే-6 విత్తనాలతో నష్టాలే ఎక్కువ ప్రస్తుతం రైతులకు పంపిణీ చేస్తున్న కే-6 విత్తనాలతో ఈ ప్రాంత రైతులకు నష్టాలు తప్పేలా లేవు. ఈ విత్తనాలతో పంటసాగు చేశాక ఒబ్బిళ్ల వరకు సకాలంలో వర్షాలు కురిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. గతంలోనూ వ్యవసాయశాఖ ఈ సమస్య కారణంగానే ఈ ప్రాంతంలో కే-6ను పంపిణీ చేయలేదు. కానీ కాస్తా తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం గత రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. సొంత విత్తనాల వైపే మొగ్గు సగం మంది రైతులు సొంత విత్తనాలను ఇప్పటికే చేలల్లో వేశారు. కొన్ని మండలాల్లో వేరుశెనగ పూత దశలోనూ, మరికొన్ని చోట్ల కలుపుతీత పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖ పంపిణీ చేస్తున్న విత్తనాలు నాశిరకంగా ఉండడంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద విత్తనకాయలను కొని వాటిని విత్తేందుకు సమయాత్తమవుతున్నారు. విత్తనాలు నాశిరకంగా ఉంటే రీప్లేస్ చేస్తాం కొన్ని లాట్లలో నాశిరకం విత్తనాలు అందిఉంటే అలాంటి రైతులకు వాటిని రీప్లేస్ చేస్తాం. కుప్పం ప్రాంతంలో మాత్రం విత్తన కాయలు బాగానే ఉన్నాయి. చాలా అలాట్మెంట్లో ఇలాంటి సమస్య ఉంటే కాయలను పంపిణీ చేసిన ఏజెన్సీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. -రమేష్‌బాబు, వ్యవసాయశాఖ ఏడీ, పలమనేరు చిత్తశుధ్ది ఉంటే కదా సకాలంలో రైతులకు విత్తనాలను అందించాలి. అవి కూడా నాణ్యంగా ఉండాలని అప్పుడే మంచి పంట వస్తుందని రైతుల గురించి ఆలోచించే వాళ్లెవరు. ఇప్పటికే పంపిణీ ఆలస్యమైంది. ఏదో రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నామా అనే లెక్కలో ఉంటే ఎట్లా. -సుబ్రమణ్యంరెడ్డి, రైతు, పలమనేరు మళ్లీ నాశిరకమే 70 శాతం మందికి వేరుశెనగ పంటే ఆధారం. వీరిలో 30 శాతం మందికి ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ విత్తనాలే దిక్కు. గతేడాది కూడా నాశిరకం విత్తనాలతో రైతులు నష్టపోయారు. ఈ దఫా అదే జరిగితే రైతులు సేద్యాన్ని వదిలి కూలిపనులు చేసుకోవాల్సిందే. -ఉమాపతి, రైతు సంఘం నాయకుడు, పలమనేరు