బండారం బట్టబయలు
► కొత్తమొల్గరలో పట్టుబడిన నాసిరకం విత్తనాలు
► 5240 పత్తి విత్తన పాకెట్లు, 147 విత్తన సంచులు సీజ్
► ఇద్దరిపై కేసు నమోదు
► జిల్లాలో కొనసాగుతున్న దాడులు
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు పత్తి విత్తన కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. అందులో భాగంగా నాసిరకం విత్తనాలను గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో తయారు చేస్తున్నారు. జిల్లాలోని అత్యధిక సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు కోమార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో కొన్ని కంపెనీలు అనుమతులు ఉన్న విత్తన కంపెనీల నుంచి మార్కెటింగ్‌కు అనుమతులు తీసుకుంటున్నాయి. మార్కెటింగ్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ఎక్కువ మొత్తంలో నాసిరకం విత్తనాలకు రంగులద్ది రైతులకు అంటగడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో మూడు రోజులుగా ప్రాసెసింగ్ యూనిట్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
అధికారుల రాక సమాచారాన్ని నాలుగైదు రోజుల క్రితమే అందుకున్న కంపెనీల నిర్వాహకులు రాత్రికి రాత్రే విత్తనాలను వేరే చోటుకు తరలించారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించారు. దీంతో నాసిరకం విత్తనాల కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యరని ఆరోపణలు వినిపించాయి.
భారీగా బయటపడిన విత్తనాలు..
భూత్పూర్ మండలంలోని కొత్తమొల్గరలో అక్రమ నిల్వలు, నాసిరకం విత్తనాలు ఉన్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో బుధవారం గ్రామంలోని రెండు ఇళ్లు, ఓ షెట్టర్‌లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో వ్యవసాయశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన పత్తి విత్తనాలు పెద్దఎత్తున బయటపడ్డాయి. ఓ సీడ్ కంపెనీ నిర్వాహకులు గ్రామంలో ఇళ్లను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన విత్తన పాకెట్లును తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన విత్తన సంచులను సీజ్ చేశారు. ఈ తనిఖీలో 5,240 పత్తి విత్తన పాకెట్లు, 147విత్తన సంచులను పోలీసులు సీజ్ చేశారు. అక్రమ నిల్వలకు పాల్పడిన అశోక్ రెడ్డి, గాల్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో జడ్చర్ల రూరల్ ఇన్‌చార్జ్ సీఐ సైదయ్య, మండల వ్యవసాయాధికారిణి బ్యూలా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
స్టాప్‌సేల్‌కు ఆదేశం..
జిల్లాలో కమిషనర్ కార్యాలయ అధికారుల బృందం గద్వాలలో బుధవారం కావేరి, నర్మదసాగర్, అంకూర్ సీడ్ కంపెనీలలో తనిఖీలు నిర్వహించారు. కోమార్కెటింగ్ అనుమతులు లేని కంపెనీలకు చెందిన 36,346 కేజీల పత్తి విత్తనాలకు అధికారులు స్టాప్ సేల్ ఆదేశాలు జారీ చేశారు.
నాసిరకం విత్తనాలను తయారు చేస్తే చర్యలు
జిల్లాలో నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు తయారు చేసే వ్యక్తులు, కంపెనీలపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. రైతుల అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి. - బాలునాయక్, జేడీఏ