చేను వద్ద బాధిత రైతు బాలాజీ
-
విత్తన కంపెనీ పంపిన డబ్బును కాజేసిన ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు
-
న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు
మహబూబాబాద్ : నాసిరకం విత్తనాలతో తాను నష్టపోయానని, కంపెనీ నుంచి నష్టపరిహారం మంజూరైనప్పటికీ గత అసోసియేషన్ నాయకులు నొక్కేశారని మానుకోట శివారు సాలార్‌తండాకు ఓ రైతు ఆరోపించాడు. బాధిత రైతు కథనం ప్రకారం.. సాలార్‌తండాకు చెందిన దారావత్ బాలాజీ 5 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నాడు. అందులో 2 ఎకరాలు కూరగాయలు సాగు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం మానుకోటలోని ఓ ఫెస్టిసైడ్ షాపులో ప్యాకెట్ రూ.300 చొప్పున 5 టమాట పంటకు సంబంధించిన విత్తనాల ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. పూత రాకపోవడంతో ఆ పంట మొత్తం దెబ్బతింది. ఆ సమయంలో టమాట కేజీ 100 రూపాయలపైనే ఉంది.
ఈ విషయాన్ని బాధిత రైతు డీలర్ వద్ద మొరపెట్టుకోగా కంపెనీ ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించి వెళ్లారు. రూ.లక్ష పరిహారం ఇవ్వాలని రైతు డిమాండ్ చేయగా రూ.50 వేలు ఇచ్చేటట్లు అంగీకరించారు. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ మానుకోట శాఖ నాయకులకు ఆ కంపెనీకి చెందిన వారు అప్పట్లో రూ.50 వేలు పంపారు. కానీ ఆ రైతుకు కేవలం 25 వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విషయై సంబంధిత డీలర్‌తో, నాయకులతో గత కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. కంపెనీకి సంబంధించిన వారికి ఫోన్ చేస్తే అసోసియేషన్‌కు డబ్బులు పంపడం జరిగిందని వారు చెప్పారని బాధిత రైతు వాపోయాడు.
ఇటీవల అదే డీలర్ వద్ద నకిలీ విత్తనాల విషయంలో గొడవ జరుగగా పంచాయితీ చేసి రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు అందజేశారు. ఇటీవల మానుకోట మండలంలోని పర్వతగిరి రైతులు సుమారు 100 మంది ఖమ్మంకు సంబంధించిన ఓ వ్యాపారి వద్ద మిర్చి విత్తనాలు కొనుగోలు చేయగా ఎదుగుదలలేక నష్టపోయారు. కంపెనీ ప్రతినిధులు పంటలను పరిశీలించి తప్పిదం జరిగిందని ఎకరానికి సుమారు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని అందుకు గడువు కావాలని వారు కోరినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. ఏదేమైనా మానుకోటలో నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. సంబంధిత అధికారులు వ్యాపారులకు పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారని, వారు మాముళ్లు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.