చచ్చులు.. పుచ్చులే! | Inferior seeds | Sakshi
Sakshi News home page

చచ్చులు.. పుచ్చులే!

Published Thu, Jun 26 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

చచ్చులు.. పుచ్చులే!

చచ్చులు.. పుచ్చులే!

  •       కొన్ని లాట్లలో నాసిరకం విత్తనాలు
  •      ప్రస్తుత పరిస్థితుల్లో కే-6తో నష్టమే
  •      ‘రాయి’తీ విత్తనాల్లో ఇదీ పరిస్థితి
  • సబ్సిడీ వేరుశెనగ విత్తనకాయల నాణ్యతను అధికారులు గాలికొదిలేశారు. అసలే దిగుబడి రాని కే-6 రకం విత్తనాలు, అందులోనూ సగం చచ్చులు.. పుచ్చులే పంపిణీ చేస్తున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన ‘రాయి’తీ వేరుశెనగ విత్తనాల్లో ఈ విషయం వెలుగుచూసింది. వీటిని ఒలిచి చేలల్లో వేసినా మొలకెత్తుతాయనే గ్యారంటీ లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
     
    పలమనేరు: ఖరీఫ్‌లో జిల్లాలోని 11 వ్యవసాయశాఖ డివిజన్‌లు, 53 మండలాల్లో (సత్యవేడు, శ్రీకాళహస్తి కాకుండా) వేరుశెనగ విత్తన కాయల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. డీలర్లు, ప్రభుత్వం మధ్య ధర విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా వేరుశెనగ విత్తనకాయల పంపిణీ ఆలస్యమైంది. ఇప్పటికే సీజన్ ముగుస్తుండడంతో అధికారులు విత్తనాల పంపిణీ త్వరగా చేపట్టాలనే తలంపుతో కాయల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదు. ఈ సీజన్‌లో లక్షా 14 వేల హెక్టార్లలో వేరుశెనగ విత్తనున్నారు. ఈ మేరకు లక్ష క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు అలాట్‌మెంట్ సిద్ధం చేశారు. అయితే పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో కేవలం 50వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయదలచుకున్నారు.
     
    నాణ్యత గాలికి

    ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు నుంచి వీటిని తెప్పించారు. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను ఒలిస్తే దాదాపు 70 గ్రాముల గింజలు ఉండాలి. విత్తనం మొలకశాతం 70గా ఉండాలనే నిబంధన ఉంది. లోడ్ల వారీగా ఇక్కడికందే విత్తన కాయలను చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం,
    విత్తనాల నాణ్యతను పరీక్షించాల్సి ఉంది. కానీ ఈ దఫా ఇదంతా జరగలేదని స్పష్టమవుతోంది. ఇక సంబంధిత ఏవోలు విత్తన కాయలను ఒలిచి తడిగుడ్డలో 24 గంటలు చుట్టిపెట్టి మొలక శాతాన్ని పరిశీలించాకే రైతులకు పంపిణీ  చేయాల్సి ఉంది. కానీ అధికారులు ఈ ప్రమాణాలను అసలు పట్టించుకోలేదు.
     
    చాలా చోట్ల నాశిరకం విత్తనాలే


    జిల్లాలో రైతులకు అందజేస్తున్న విత్తన కాయల్లో చాలా లాట్లలో నాశిరకం విత్తనాలే దర్శనమిస్తున్నాయి. కాయలతో పాటు తొక్కు, రాళ్లు ఉండడం, కాయలు సైతం బలిష్టంగా లేక ఓ వైపు నల్లరంగుతో బుడ్డగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వీటిని ఒలిచి చేలల్లో వేసినా సగం వరకు విత్తనాలు మొలకెత్తే అవకాశాలు లేవని అనుభవం గల రైతులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
     
    కే-6 విత్తనాలతో నష్టాలే ఎక్కువ
     
    ప్రస్తుతం రైతులకు పంపిణీ చేస్తున్న కే-6 విత్తనాలతో ఈ ప్రాంత రైతులకు నష్టాలు తప్పేలా లేవు. ఈ విత్తనాలతో పంటసాగు చేశాక ఒబ్బిళ్ల వరకు సకాలంలో వర్షాలు కురిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. గతంలోనూ వ్యవసాయశాఖ ఈ సమస్య కారణంగానే ఈ ప్రాంతంలో కే-6ను పంపిణీ చేయలేదు. కానీ కాస్తా తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం గత రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది.
     
    సొంత విత్తనాల వైపే మొగ్గు
     
    సగం మంది రైతులు సొంత విత్తనాలను ఇప్పటికే చేలల్లో వేశారు. కొన్ని మండలాల్లో వేరుశెనగ పూత దశలోనూ, మరికొన్ని చోట్ల కలుపుతీత పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖ పంపిణీ చేస్తున్న విత్తనాలు నాశిరకంగా ఉండడంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద విత్తనకాయలను కొని వాటిని విత్తేందుకు సమయాత్తమవుతున్నారు.
     
     విత్తనాలు నాశిరకంగా ఉంటే రీప్లేస్ చేస్తాం
     
    కొన్ని లాట్లలో నాశిరకం విత్తనాలు అందిఉంటే అలాంటి రైతులకు వాటిని రీప్లేస్ చేస్తాం. కుప్పం ప్రాంతంలో మాత్రం విత్తన కాయలు బాగానే ఉన్నాయి. చాలా అలాట్‌మెంట్‌లో ఇలాంటి సమస్య ఉంటే కాయలను పంపిణీ చేసిన ఏజెన్సీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
     -రమేష్‌బాబు, వ్యవసాయశాఖ ఏడీ, పలమనేరు
     
     చిత్తశుధ్ది ఉంటే కదా
     సకాలంలో రైతులకు విత్తనాలను అందించాలి. అవి కూడా నాణ్యంగా ఉండాలని అప్పుడే మంచి పంట వస్తుందని రైతుల గురించి ఆలోచించే వాళ్లెవరు. ఇప్పటికే పంపిణీ ఆలస్యమైంది. ఏదో రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నామా అనే లెక్కలో ఉంటే ఎట్లా.
     -సుబ్రమణ్యంరెడ్డి, రైతు, పలమనేరు
     
     మళ్లీ నాశిరకమే
    70 శాతం మందికి వేరుశెనగ పంటే ఆధారం. వీరిలో 30 శాతం మందికి ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ విత్తనాలే దిక్కు. గతేడాది కూడా నాశిరకం విత్తనాలతో రైతులు నష్టపోయారు. ఈ దఫా అదే జరిగితే రైతులు సేద్యాన్ని వదిలి కూలిపనులు చేసుకోవాల్సిందే.
     -ఉమాపతి, రైతు సంఘం నాయకుడు, పలమనేరు
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement