మహిళనని.. చులకనా?
టీఆర్‌ఎస్ నేతలపై చొప్పదండి ఇన్‌చార్జి బొడిగె శోభ ఫైర్
కరీంనగర్, న్యూస్‌లైన్ :
టీఆర్‌ఎస్ నేతలు మహిళా నాయకురాలిగా తనను చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇతర నాయకులు గురువారం కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బొడిగె శోభతోపాటు టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా ఇన్‌చార్జి కటారి రేవతీరావును ఆహ్వానించారు. రేవతీరావుకు ముందు వరుసలో చోటిచ్చిన నాయకులు శోభకు వెనుక వరుసలో స్థానం కల్పించారు. తనను వెనుక వరుసలో కూర్చోబెట్టడంపై శోభ టీఆర్‌ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు.
ప్రతి సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా, మహిళా నేతగా తనను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. సమావేశం ప్రారంభంలోనే తన స్థాయికి తగిన గుర్తింపు నివ్వడం లేదని, పిలిచి అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న నాయకులు ఆమెను సముదాయించి తిరిగి వేదికపై మొదటి వరుసలో కూర్చోబెట్టడంతో ప్రెస్‌మీట్ మొదలయ్యింది.