పరిగి, న్యూస్‌లైన్: ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలంటున్న ప్రభుత్వం, ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటున్న రైతుల కాళ్లకు బంధాలు వేస్తోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలు వ్యవసాయ రంగ యాంత్రీకరణకు అడ్డుతగులుతున్నాయి. యంత్రలక్ష్మి పథకంలో భాగంగా ఐదారు యంత్ర పరికరాలు కలిపి ప్యాకేజీగా ఇస్తామంటుండటంతో ఆర్థి క స్తోమత లేక రైతులు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్న పరికరాల్లో ఎక్కువశాతం పెద్ద రైతులకు ఉపయోగపడేవే తప్ప అందులో ఒక్కటి కూడా చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేవి లేవు. ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం రైతులకు రాయితీపై ఇచ్చే పీవీసీ పైపు లు, స్ప్రింక్లర్లు, బిందు సేద్యం పరికరాలు సైతం ఇప్పటివరకూ ఇవ్వలేదు. రైతులు తీసుకునేందుకు ముందుకు వచ్చినా అధికారులు కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లిస్తేనే పైపులు, స్ప్రింక్లర్లు ఇస్తామని ఆయా కంపెనీలు తేల్చి చెబుతుంటే... ప్రభుత్వం మాత్రం పాత రేట్లే చెల్లిస్తాం అంటూ మొండికేస్తోంది. దీంతో రాయితీ పరికరాలు రైతులకు అందేది అనుమానాస్పదంగా మారింది.
ప్యాకేజీ మొత్తం కొనాల్సిందే!
రాయితీలపై అందివ్వాలనుకున్న యంత్రాలను ప్రభుత్వం ప్యాకేజీలుగా నిర్ణయించి చిన్న, సన్నకారు రైతులకు మొండిచేయి చూపుతోంది. ఒకేసారి రెండు ట్రాక్టర్లు, రెండు ప్లాంటర్లు, హార్వెస్టింగ్‌బ్లేడ్లు, డిగ్గర్ ఫేకర్, పవర్ ఆపరేటెడ్ వెట్‌ప్యాడ్ త్రెషర్, వేరుశనగ త్రెషర్ ఇవన్నీ కలిపి ప్యాకేజీగా నిర్ణయించారు. పత్తి, వేరుశనగ, పొగాకు, శ్రీవరి ఇలా ఒక్కో పంటకు ఉపయోగపడే యంత్రాలతో ఒక్కో ప్యాకేజీని తయారు చేశారు. ఈ యంత్రాలన్నిం టికీ కలిపి రూ.20లక్షల ధర నిర్ణయిం చారు. రైతులకు ఇవన్నీ అవసరం ఉన్నా లేకున్నా ప్యాకేజిలో ఉన్న యం త్రాలన్నీ తీసుకోవాల్సిందే. అంత పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించలేక రైతు లు వాటిని కొనేందుకు ముందుకు రావడంలేదు. నాగళ్లు, గొర్రులు, దంతె లు, బండ్లు అన్నీ వెల్డింగ్ షాపులకు వెళ్లి ఇనుముతో తయారు చేయించుకుంటున్నారు. ఒక్కో పరికరానికి రూ.2వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేపడుతున్నామని చెబుతున్న వ్యవసాయ యాంత్రీకరణ అపహాస్యమవుతోంది.
కొంతమందికే రాయితీలు
వ్యవసాయ యంత్ర పరికరాల కు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు పెద్ద రైతులు, భూస్వాములకే అందుతున్నాయి. ఇప్పటికీ ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు వరకు ట్రాక్టర్లు ఉండగా 50 నుంచి 60 వరకు ఇనుముతో తయారు చేయించుకున్న ఎద్దుల బండ్లే ఉన్నాయి. 90 నుంచి 95 శాతం రైతులు ఇనుముతో తయారు చేసిన నాగళ్లు, ఇతర పరికరాలే వాడుతున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు జిల్లాలో రూ.9 కోట్ల నిధులను కేటాయించగా, కేవలం రెండు నుంచి ఐదు శాతం రైతులకే అవి పరిమితం అవుతున్నాయి.
నిబంధనలు సడలించే అవకాశం..
చాలామంది రైతులు ఒక ట్రాక్టర్, ఇతర యంత్రపరికరాలు సైతం ఒకటి రెండు కావాలనే అడుగుతున్నారు. ప్యాకేజీ మొత్తం కొనటం రైతులకు ఇబ్బందిగానే ఉంది. అందుకే రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నిబంధనలు సడలించే అవకాశం ఉంది. త్వరలో రాయితీ పరికరాలకు ధరలు ఖరారు కానున్నాయి.
- నగేష్‌కుమార్, ఏడీఏ
‘యంత్రలక్ష్మి’ పథకం... అపహాస్యం!
Published Sat, Nov 9 2013 12:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement