పరిగి, న్యూస్‌లైన్: అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలతో రైతులపై, చిరు వ్యాపారులపై ప్రభుత్వం భస్మాసుర హస్తం మోపింది. దీంతో ప్రత్యక్షంగా రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నడిపుకొని పొట్ట పోసుకునే వ్యాపారులపై పెను భారం పడుతోంది. పరోక్షంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కరెంట్ కోతలతో అటు పొలాలు తడవక.. ఇటు వ్యాపారాలు సాగక.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది.
గత పది, పదిహేను సంవత్సరాల క్రితం వరకు వినియోగించి.. కరెంట్ మోటార్ల రాకతో మూలన పడేసిన ఆయిల్ ఇంజిన్లు మళ్లీ ఇప్పుడు శరణ్యంగా మారాయి. అటు రైతులు, ఇటు వ్యాపారులు చేసేదేమీలేక.. మూలకు పడేసిన ఆయిల్ ఇంజిన్ల దుమ్ము దులుపుతున్నారు. విద్యుత్ కోతలు తీవ్రతరం చేసిన ప్రభుత్వం తమపై ఆర్థికంగా భారం మోపిందంటూ.. ఖర్చు అధికమైనా తప్పసరి పరిస్థితుల్లో వ్యవసాయానికి, చిరు వ్యాపారాలకు ఆయిల్ ఇంజిన్‌లనే వినియోగిస్తున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో..
కరెంటు కోతలతో సూక్ష్మ తరహా పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. కాస్తంతైనా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో ఆయిల్ ఇంజిన్ల బూజు దులుపుతున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల యజమానులు ఆయిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు. రైతులు ఆయిల్ ఇంజిన్లను జనరేటర్లుగా ఉపయోగిస్తూ పొలాలకు నీరు పారిస్తున్నారు.
జిరాక్స్ సెంటర్లు, సామిల్లుల యజమానులు, పిండి గిర్నీల నిర్వాహకులు, పంక్చర్ అతికేవారు.. ఇలా అన్ని వర్గాలవారూ ఆయిల్ ఇంజిన్లను వినియోగించక తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కరెంటుతో అయ్యే ఖర్చుతో పోలిస్తే ఆయిల్ ఇంజిన్‌కు వినియోగించే డీజిల్ ఖర్చు మూడింతలు ఎక్కువగా అవుతున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో వాటిని వినియోగించాల్సి వస్తోందని సూక్ష్మ తరహా పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు.
కొనక తప్పడం లేదు..
జిరాక్స్ లాంటి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునే వారు గతంలో పొలాలకు నీళ్లుపారించేందుకు వాడిన పాత ఆయిల్ ఇంజిన్లు కొనుక్కుంటున్నారు. దానికి అదనంగా యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ఓ చిన్న మోటారును బిగించుకుని జనరేటర్‌లా వాడుతున్నారు. అధిక ధర వెచ్చించి జనరేటర్లు కొనుక్కునే స్థోమతలేని చిన్నా చితక వ్యాపారులందరూ.. కరెంటు కోతలవల్ల ఇలాంటి ప్రత్యామ్నాయాలు చేసుకోక తప్పటంలేదు. ఇంతచేసినా వ్యాపారంలో ఏదో సంపాదిస్తున్నారనుకుంటే పొరపాటే. ఇదంతా చేసింది కేవలం తమ వద్దకు రెగ్యులర్‌గా వచ్చే గిరాకీని నిలబెట్టుకోవటానికేనంటున్నారు వారు.
ఒక గంట సేపు ఆయిల్ ఇంజిన్ నడపాలంటే రూ.80 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సిందే. ఇలా రోజుంతా కరెంటు కోతలు విధిస్తున్న నేపథ్యంలో.. ఎనిమిది, తొమ్మిది గంటలు ఆయిల్ ఇంజిన్ నడపాలంటే రూ. 500 పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేసినా వచ్చిన ఆదాయం మొత్తం దానికే పెట్టాల్సి వస్తుందంటున్నారు. రోజంతా కష్టపడితే చిల్లిగవ్వ కూడా మిగలటంలేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ పాతకాలమే..
పట్టణాలు, మండల కేంద్రాల్లో చిరు వ్యాపారులందరూ ఆయిల్ ఇంజిన్లు, జనరేటర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిరాక్స్ సెంటర్లు, సామిల్లులు, ఫొటో స్టూడియోలు, చిన్న చిన్న ఇతర దుకాణాల్లో సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోక తప్పటంలేదు. రైతులు సైతం పొలాలకు నీళ్లు పారించేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా జనరేటర్లు, ఆయిల్ ఇంజిన్లను వాడుతున్నారు. దీంతో పాటు కరెంటు సమస్యతో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లోనూ పనులు ముందుకు సాగటంలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మళ్లీ ఆయిల్ ఇంజిన్లు!
Published Wed, Feb 5 2014 12:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement