రాజధాని అమరావతిలోజరుగుతున్న నిర్మాణాల వద్ద ప్రజలు, కూలీల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటికే పలు సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అటు నిర్మాణ సంస్థలు గానీ,ఇటు అధికారులు గానీ చర్యలు తీసుకున్నపాపాన పోలేదు.
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టింది. ఈ మేరకు రోడ్ల పక్కన డ్రెయినేజీ కోసం పది అడుగుల మేర గుంతలు తవ్వారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో గుంతల్లో పది అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. శాఖమూరు వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. రోడ్డు కోసం గుంత తవ్విన నిర్మాణ సంస్థ హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతోనే ఆ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. గతేడాది ఆగస్టులో తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. తుళ్లూరు మండల కేంద్ర సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు.
ఇద్దరు హత్య..
మంగళగిరి మండలం కురగల్లు వద్ద గత ఏడాది డిసెంబర్‌లో తెలంగా>ణకు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో పని చేయడానికి వచ్చి హత్యకు గురికావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తమ వద్ద పని చేస్తున్న కూలీల వివరాలు, వారి నేర చరిత్ర తెలుసుకోకుండానే నిర్మాణ సంస్థలు పనుల్లో పెట్టుకుంటున్నాయి. నేలపాడు గ్రామం వద్ద జరుగుతున్న తాత్కాలిక హైకోర్టు వద్ద మంగళవారం జరిగిన ప్రమాదం కూడా ఇలాంటిదే. టిప్పర్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళుతూ అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు.
నిర్మాణాల వద్ద అంబులెన్స్‌లు ఎక్కడ..?
రాజధానిలో రాత్రి, పగలు తేడా లేకుండా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. సుమారు 8 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. అయితే నిర్మాణాలు జరుగుతున్న చోట అనుకోని ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోతోంది. చాలా నిర్మాణ సంస్థలు అంబులెన్స్‌లను నిర్మాణాలు జరుగుతున్న చోట అందుబాటులో ఉంచడం లేదు. కొన్ని సంస్థలు మాత్రమే అంబులెన్స్‌లను 24 గంటల పాటు ఉంచుతున్నాయి. నిర్మాణ కంపెనీలు నిబంధనలు పాటించకున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
డ్రైవర్లకు లైసెన్స్‌లు ఉన్నాయా.?
ఇసుక, మట్టిని తరలించేందుకు వేలాది టిప్పర్లను పనుల కోసం వినియోగిస్తున్నారు. అయితే డ్రైవర్లు లైసెన్స్ లేకుండానే కొన్ని నిర్మాణ సంస్థలు పనిలో పెట్టుకుంటున్నాయి. వీరు రయ్ మంటూ దూసుకెళుతూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇప్పటికే టిప్పర్లను తమ గ్రామం మీదుగా వెళ్లనిచ్చేది లేదంటూ కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఇలా నిబంధనలకు నీళ్లొదులుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు అరచేతిలోపెట్టుకుంటున్నాం
గ్రామాలలో ప్రజలు తిరగాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. నిర్మాణాలు చేపడుతున్నారు కానీ కనీస భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. లారీలు వేగంగా వెళ్తూ బెంబేలెత్తిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, అధికారులు స్పందించాలి. గ్రామ శివారుల్లో, పొలాల్లో నుంచి భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.– కె. వినోద్, నేలపాడు, తుళ్లూరు మండలం
చర్యలు తీసుకుంటున్నాం
రాజధాని ప్రాంతంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అతి వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు రెండు రోజుల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వాహనదారులు కూడా నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నాం. – కేసప్ప, ఇన్‌చార్జి డీఎస్పీ, తుళ్లూరు
Comments
Please login to add a commentAdd a comment