daily workers
-
నాడు దినసరి కూలీ నేడు టీచర్
యాలకుల తోటలో దినసరి కూలీగా పనిచేసే 28 ఏళ్ల సెల్వమరి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా మారింది. ఆమె సాధించిన ఈ ఘనత వెనకాల కొన్నేళ్ల కృషి ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి అర్థంలా సెల్వమరి గురించి పిల్లలకు పాఠంలా చెప్పచ్చు. పెద్దలూ తమ దారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. స్వయంకృషితో ఎదిగిన సెల్వమరికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫోన్ ద్వారా, ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సెల్వమరి తన బాల్యంలో తల్లితో కలిసి సెలవుల్లో యాలకుల తోటలో పనిచేసేది. అర్ధరాత్రిళ్లు నూనె దీపాన్ని పెట్టుకొని చదువుకునేది. తండ్రి ఆమె చిన్నతనంలోనే తల్లిని, ఇద్దరు కూతుళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి యాలకుల తోటలో పనిచేసేది. తల్లితోపాటు సెల్వమరి కూడా కూలికి వెళ్లేది. గణితంలో ప్రతిభ పూట గడవని రోజులైనా చదువును మాత్రం పక్కన పెట్టలేదు సెల్వమరి. చదువొక్కటే తమ జీవితాలను మారుస్తుందని నమ్మింది. తన కలను ఎవరికీ చెప్పకుండా దాచుకుంది. ఆ కలను సాధించడానికి నిత్యం కృషి చేసింది. సెల్వమరికి గణితం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ గణితంలో ప్రతిభ చూపుతుండేది. తిరువనంతపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు తల్లికి ధైర్యం చెప్పింది. కాలేజీకి సెలవు రోజులు ఇవ్వగానే తిరిగి ఇంటికి వచ్చి, తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. అలా వేసవి సమయమంతా తల్లికి చేదోదు వాదోడుగా ఉండేది. సమస్యలను అధిగమిస్తూ.. ‘డిగ్రీ ఇంగ్లిషు మాధ్యమంలో చేరడంతో మొదట సమస్యగా అనిపించేది. మాతృభాష మలయాళం తప్ప ఇంగ్లిషు సరిగా వచ్చేది కాదు. కానీ, మా అమ్మ ముఖం గుర్తుకు తెచ్చుకొనేదాన్ని’ అంటూ సమస్యను అధిగమించిన విధానాన్ని తెలియజేస్తుంది సెల్వమరి. క్రమంగా భాషా సమస్యను పరిష్కరించుకొని డిగ్రీ, అటు తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కుమిలీలోని ఎంజి యూనివర్శిటీ నుంచి బీఈడీ, ఎమ్ఈడీ పూర్తి చేసింది. థైక్వాడ్ గవర్నమెంట్ కాలేజీ నుంచి ఎంఫిల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పుడు మ్యాథమేటిక్స్‌లో పీహెచ్డీ చేస్తోంది. యుజిసి నెట్ ఎగ్జామ్ పూర్తి చేసింది. సివిల్ సర్వీసులలో రాణించాలన్నది తన పెద్ద కల. అందుకు ఎంత కష్టమైనా పడతానంటున్న సెల్వమరి కేరళలోని ఇడుక్కి జిల్లాల్లో వంచివయాల్ ఉన్నత పాఠశాలలో ఇటీవలే ఉపాధ్యాయురాలిగా చేరింది. ఎక్కడా అవకాశాలు లేవు, ఎటు చూసినా ఆర్థిక ఇబ్బందులే, కుటుంబ పరిస్థితి ఏమీ బాగో లేదని వాపోతూ అనేక సాకులు వెతికేవారికి సెల్వమరి జీవితం ఓ పాఠం. కృషి చేస్తే జీవితం తప్పక మారుతుందని తెలిపే విజయకథనం. -
కూలీ కూతురు.. టాపర్
నంగునూరు(సిద్దిపేట): కూలీ పనులు చేస్తేనే పూట గడిచే కుటుంబం.. పైగా నిరక్ష్యరాస్యులు.. తమలాగ పిల్లలు కూలీ పనులు చేయకుండా చదివి ప్రయోజకులు కావాలని కలలు కన్నారు. వారి కలను నిజం చేస్తూ ఇంటర్లో మండల టాపర్‌గా దేవర రమ్య నిలిచింది. మండల కేంద్రం నంగునూరుకు చెందిన దేవర ఉప్పలయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఉప్పలయ్య స్థానికంగా ఇనుప సామాను వ్యాపారం చేయడంతో పాటు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా అతని భార్య పద్మ బీడీలు చుట్టడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చదివిస్తున్నారు. వారి పెద్ద కూతురు రమ్య అక్కేపల్లి మోడల్స్కూల్లో చేరి పదో తరగతిలో మంచి జీపీఏ సాదించింది. అదే స్ఫూర్తితో ఇంటర్ బైపీసీలో 920 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల బాధ చూసి చక్కగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే పట్టుదలతో చదివానని ఆమె పేర్కొంది. కాగా రెండవ కూతురు రవళి గతేడాది పదో తరగతిలో పది జీపీఏ సాదించి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. రైతు కుటుంబంలో విద్యాకుసుమం : రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించిన సువర్ణ హుస్నాబాద్: వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇర్రి సువర్ణ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించింది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివిన సువర్ణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ (ఇంగ్లీష్ మీడియం)లో 978/1000 మార్కులు సాధించింది. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన ఇర్రి మల్లారెడ్డి, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసింది. రెండవ కుమార్తె అపర్ణ కూడా హుస్నాబాద్ ప్రభుత్వ కళాశాలలో 2017–2019 సంవత్సరంలో ఎంపీసీలో 922 మార్కులు సాధించి జిల్లా స్ధాయిలో ర్యాంకర్‌గా నిలిచింది. సువర్ణ గత విద్యా సంవత్సరంలో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 456/470 మార్కులు సాధించి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ కళాశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు కూతుళ్లకు ఎలాంటి లోటు రాకుండా చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యమని సువర్ణ తెలిపారు. -
వలస కూలీల బతుకులపై...
-
ఐదు లక్షలు విరాళం
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో రోజువారీ వేతనంతో బతికే పేద కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వీవీ వినాయక్ ఐదు లక్షలు విరాళం అందించారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు ఆయన ఈ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మనం ఇళ్లల్లో ఉండి వణికించాలి. షూటింగ్స్ లేకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును కాదంబరి కిరణ్‌కి అందజేశా. అవసరమైనవారు కిరణ్‌ని సంప్రదించి నిత్యావసర వస్తువులను తీసుకోవాలి’’ అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ, వల్లభనేని అనిల్ పాల్గొన్నారు. -
‘తొక్క’లో పంచాయితీ
బంజారాహిల్స్: తొక్కే కదా అని తేలిగ్గా తీసేయొద్దు... ఓ అరటి తొక్క 300 మంది అడ్డా కూలీలను ఏకం చేసింది... ఈ తొక్క పంచాయితీ కారణంగా వారు ఒక రోజు కూలీని కోల్పోవాల్సి వచ్చింది.. వివరాల్లోకి వెళితే...బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్ కమాన్ వద్ద ఉండే ఆడ్డా నుంచి నిత్యం వందలాది మంది కూలీలు దినసరి కూలీలకు వెళ్తుంటారు.. అదే ప్రాంతంలో బాబూరావు అనే వ్యక్తి బండిపై అరటి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం ఉదయం కూలీలంతా పనుల కోసం వేచి ఉన్న సమయంలో ఎవరో ఓ వ్యక్తి అరటిపండు తిని రోడ్డుపై పారవేశాడు. దీంతో పక్కనే ఉన్న పండ్ల వ్యాపారి ఇటుగా వస్తున్న లింగం అనే అడ్డా కూలీని పిలిచి తొక్క తీయాలని సూచించాడు. తాను తినలేదని, తాను వేయని తొక్క ఎందుకు తీస్తానని పండ్ల వ్యాపారిని ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన పండ్ల వ్యాపారి బాబూరావు కర్రతో లింగంపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన తోటి అడ్డా కూలీలు న్యాయం చేయాలంటూ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి ఎదుట పంచాయితీ పెట్టారు. రెండు గంటల పాటు ఈ పంచాయితీ కొనసాగింది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం రణరంగంగాన్ని తలపించింది. పెద్ద సంఖ్యలో అడ్డా కూలీలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరటిపండ్ల వ్యాపారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. న్యాయం చేస్తామని కార్పొరేటర్ హామీ ఇవ్వడంతో వారు తిరుగుముఖం పట్టారు. అయితే అప్పటికే పనికి వెళ్లే సమయం ముగియడంతో ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు. -
కూలీ పనిచేస్తూనే ఎంబీబీఎస్ సీటు
ఏళ్ల తరబడి రాయి నీటిలో ఉన్నా మెత్తబడిపోదు. అలాగే దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి విజయం సొంతమవడం అనివార్యం. నాలుగు పర్యాయాలు ప్రయత్నించినా ఫలితం రాలేదని దిగులు చెందకుండా ఐదోసారికూడా నీట్ పరీక్షకు హాజరై ఉచిత సీటు సాధించుకున్న జోధారామ్ గురించి తెలుసుకుందాం.. జోధారాం స్వస్థలం రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లా గోలియా గ్రామం. వ్యవసాయ కుటుంబం. సకాలంలో వర్షాలు కురవకపోవడం, పంట పండకపోవడం కారణంగా ఆ కుటుంబం అనేక బాధలకు గురైంది. అయితే జోధారామ్కు చదువంటే చాలా ఇష్టం. డాక్టర్ కావాలనేది అతని లక్ష్యం. ఎంబీబీఎస్ చదివించడం కోసం తండ్రి ఒక షరతు విధించాడు. ఇంటర్ బోర్డు పరీక్షలో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉచితం ప్రవేశం సాధించడం. అలా చేయలేకపోతే ముంబై వెళ్లి కూలీ పనిచేయడం. దీంతో జోధారామ్ కష్టపడి చదివి 65 శాతం మార్కులు సాధించాడు. రామ్ ప్రతిభను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ పోటీ పరీక్షలు రాస్తే మంచి భవిష్యత్తు ఉం టుందంటూ ప్రోత్సహించాడు. తొలిసారి నీట్ పరీక్షకు హాజరైన రామ్‌కు 1,50,000 ర్యాంకు వచ్చింది. అయినా లక్ష్యం నెరవేరలేదు. తండ్రికి ఇచ్చిన మాట మేరకు ముంబై వెళ్లి కూలీ పనిచేయడం ప్రారంభించాడు. అయితే రామ్ పట్టువదలని విక్రమార్కునిలా నీట్ పరీక్షలను మాత్రం విడిచిపెట్టలేదు. మళ్లీ మూడు పర్యాయాలు ఇవే పరీక్షలు రాశాడు. నాలుగోసారి ఆల్ ఇండియా లెవెల్లో 12,903 ర్యాంకు వచ్చింది. దీంతో రామ్ ప్రతిభను గుర్తించిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నీట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐదోసారి నీట్లో ఆల్ ఇండియా 3886 ర్యాంకు సాధించి, జోధ్‌పూర్‌లోని సంపూర్ణాననంద్ వైద్యకళాశాలలో ఉచిత అడ్మిషన్ పొందాడు. చదివించలేరని తెలుసు.. ‘‘మా అన్నయ్య తప్ప ఇంకెవరూ నన్ను నమ్మలేదు. ముంబై వెళ్లి కూలీ పని చేసుకుని బతకమని అమ్మ చెప్పింది. అలా అన్నందుకు బాధ కలగలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులకు ఎంబీబీఎస్ చదివించేంత స్తోమత లేదని తెలుసు. అం దుకే కష్టపడి చదువుకున్నా. ఆశించిన ఫలితం లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తన మనసులో మాట చెప్పాడు జోధారామ్. -
కూలిన బతుకులు
వారివి రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఉపాధి కోసం భార్యలు కువైట్ వెళ్లారు. భర్తలు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. వారిపై విధి చిన్నచూపు చూసింది. కూలి పనులు చేసుకుని ఇంటికి వెళుతున్న వారిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాలు కూలిపోయాయి. చిత్తూరు , పెద్దమండ్యం: మండలంలోని పెద్దమండ్యం–చిన్నమండ్యం రోడ్డులోని మొరాలవంక మలుపు వద్ద ఆదివారం టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండ్యం మండలం చన్నరసుపల్లె, వడ్డిపల్లెకు చెందిన కూలీలు పెద్దమండ్యంలో జరిగిన కాంక్రీట్ పనులకు వచ్చారు. పనులు ముగించుకుని కొందరు కూలీలు ఆటోలో వెళ్లిపోయారు. చిన్నరసుపల్లెకు చెందిన భైనిమేని బండయ్య, (36), డేరంగుల రాజు (32), వేల్పుల పిచ్చయ్య (41) ద్విచక్ర వాహనంలో గ్రామానికి బయలుదేరారు. పెద్దమండ్యం– చిన్నమండ్యం రోడ్డులోని మొరాలవంక మలుపు వద్ద చిన్నమండ్యం నుంచి పెద్దమండ్యం వైపు రోడ్డుకు వేసే తారు లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొంది. సంఘటనలో బండయ్య, రాజు టిప్పర్ టైరు కింద పడి ఆక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకువెళ్లింది. ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న పిచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి తరలించారు. తంబళ్లపల్లె ఎస్ఐ శివకుమార్ టిప్పర్‌ను వెనక్కు తీయించి మృతదేహాలను బయటకు తీశారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాద వార్త తెలియడంతో పెద్దమండ్యం, చిన్నమండ్యం సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం మదనపల్లెకు తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదం రోడ్డు ప్రమాదం భైనిమేని బండయ్య, డేరంగుల రాజు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బండయ్యకు భార్య ఆనందమ్మ, కుమార్తె అశ్విని, కుమారుడు ఆంజినేయులు ఉన్నారు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఆనందమ్మ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. అలాగే డేరంగుల రాజుకు భార్య నాగేశ్వరమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగేశ్వరమ్మ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. మృతదేహాల మృతుల పిల్లలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారిని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. -
భద్రత.. బాధ్యత.. కనపడదెక్కడా!
రాజధాని అమరావతిలోజరుగుతున్న నిర్మాణాల వద్ద ప్రజలు, కూలీల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అటు నిర్మాణ సంస్థలు గానీ,ఇటు అధికారులు గానీ చర్యలు తీసుకున్నపాపాన పోలేదు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టింది. ఈ మేరకు రోడ్ల పక్కన డ్రెయినేజీ కోసం పది అడుగుల మేర గుంతలు తవ్వారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో గుంతల్లో పది అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. శాఖమూరు వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. రోడ్డు కోసం గుంత తవ్విన నిర్మాణ సంస్థ హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతోనే ఆ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. గతేడాది ఆగస్టులో తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. తుళ్లూరు మండల కేంద్ర సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఇద్దరు హత్య.. మంగళగిరి మండలం కురగల్లు వద్ద గత ఏడాది డిసెంబర్లో తెలంగా>ణకు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో పని చేయడానికి వచ్చి హత్యకు గురికావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తమ వద్ద పని చేస్తున్న కూలీల వివరాలు, వారి నేర చరిత్ర తెలుసుకోకుండానే నిర్మాణ సంస్థలు పనుల్లో పెట్టుకుంటున్నాయి. నేలపాడు గ్రామం వద్ద జరుగుతున్న తాత్కాలిక హైకోర్టు వద్ద మంగళవారం జరిగిన ప్రమాదం కూడా ఇలాంటిదే. టిప్పర్ల డ్రైవర్లు వేగంగా దూసుకెళుతూ అమాయక ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. నిర్మాణాల వద్ద అంబులెన్స్‌లు ఎక్కడ..? రాజధానిలో రాత్రి, పగలు తేడా లేకుండా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. సుమారు 8 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. అయితే నిర్మాణాలు జరుగుతున్న చోట అనుకోని ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోతోంది. చాలా నిర్మాణ సంస్థలు అంబులెన్స్‌లను నిర్మాణాలు జరుగుతున్న చోట అందుబాటులో ఉంచడం లేదు. కొన్ని సంస్థలు మాత్రమే అంబులెన్స్‌లను 24 గంటల పాటు ఉంచుతున్నాయి. నిర్మాణ కంపెనీలు నిబంధనలు పాటించకున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవర్లకు లైసెన్స్‌లు ఉన్నాయా.? ఇసుక, మట్టిని తరలించేందుకు వేలాది టిప్పర్లను పనుల కోసం వినియోగిస్తున్నారు. అయితే డ్రైవర్లు లైసెన్స్ లేకుండానే కొన్ని నిర్మాణ సంస్థలు పనిలో పెట్టుకుంటున్నాయి. వీరు రయ్ మంటూ దూసుకెళుతూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. ఇప్పటికే టిప్పర్లను తమ గ్రామం మీదుగా వెళ్లనిచ్చేది లేదంటూ కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఇలా నిబంధనలకు నీళ్లొదులుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలోపెట్టుకుంటున్నాం గ్రామాలలో ప్రజలు తిరగాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. నిర్మాణాలు చేపడుతున్నారు కానీ కనీస భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. లారీలు వేగంగా వెళ్తూ బెంబేలెత్తిస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, అధికారులు స్పందించాలి. గ్రామ శివారుల్లో, పొలాల్లో నుంచి భారీ వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.– కె. వినోద్, నేలపాడు, తుళ్లూరు మండలం చర్యలు తీసుకుంటున్నాం రాజధాని ప్రాంతంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అతి వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు రెండు రోజుల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వాహనదారులు కూడా నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నాం. – కేసప్ప, ఇన్చార్జి డీఎస్పీ, తుళ్లూరు -
హై‘టెక్కు’ బాబూ.. కోతలు చాలించు!
అనంతపురం, రాయదుర్గం: ఆర్థిక లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న హై..టెక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల దుస్థితికి ఈ శ్రమజీవులే నిదర్శనమని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సొంతపనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లిన ఆయన అక్కడ కూలి పనులు చేస్తున్న కొంతమందిని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయన్నారు. వృద్ధాప్యం మీద పడుతున్న ఇద్దరు కూలీలు లక్ష్మయ్య, వెంకటాపురం వెంకటేశులు మాట్లాడుతూ తమది కుప్పం నియోజకవర్గమని చెప్పారన్నారు. వందలాది మంది కుప్పం నుంచి వలస వచ్చి దుర్భరమైన జీవితం గడుపుతున్నట్లు వాపోయారన్నారు. కరువును తరిమికొడతామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రజలనే రాష్ట్రం నుంచి తరిమి కొడుతున్నారని కాపు విమర్శించారు. చీమ చిటుక్కుమన్నా కంప్యూటర్ కోర్ డ్యాష్ బోర్డులో తనకు తెలిసిపోతుందని డప్పు కొట్టుకునే డబ్బా ముఖ్యమంత్రికి.. తన నియోజకవర్గంలోని వలసలు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. -
జనగామలో ప్రచార కూలీలకు డిమాండ్
సాక్షి, జనగామ: ముందస్తు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రోజువారీ కూలీలకు డిమాండ్ పెరిగింది. కూలీలు ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలు అభ్యర్థులకు విషమ పరీక్ష కాగా.. వ్యాపారులకు వరంగా మారింది. బీరు.. బిర్యానీ.. పూలదండలు..బోకెలతో వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలను కొంతమంది వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని నాలుగు రాళ్లు పోగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజీ బీజీగా కూలీలు.. ప్రస్తుతం రోజువారి కూలీలకు డిమాండ్ పెరిగింది. పొద్దంతా కష్టపడితే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట గంటలు తిరిగి ప్రచారం చేస్తే వచ్చే సొమ్ము మేలు అనుకుంటున్నారు. ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత కొంతమంది ముఖ్యులకు భోజనం కూడా దొరుకుతుండడంతో ఎన్నికల ప్రచారానికే సై అంటున్నారు. అభ్యర్థి ప్రచారానికి వెళ్లే సమయంలో తమ వెంట జనం కనిపించేలా ముందుగానే కూలీలను బుక్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రధాన వ్యక్తులు ఉదయం లేవగానే ఆయా అభ్యర్థి ఇళ్లకు వెళ్లి..అక్కడే అల్పాహారం పూర్తి చేసుకుని ప్రచార రథం ఎక్కేస్తున్నారు. దీంతో పత్తి సేకరణ కోసం కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పూలదండలకు గిరాకీ.. పార్టీలో చేరుతున్న.. ప్రచారానికి వచ్చే నాయకుడికి స్వాగతం పలకాలన్నా.. ప్రధాన భూమిక పోషించేవి పూలదండలు. ఎన్నికల్లో దండలకు గిరాకీ పెరిగిపోయింది. అభ్యర్థి ఇంటి నుంచి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు వారిని పూలదండలతో ముంచెత్తుతున్నారు. సన్మానాలకు సత్కారాలకు పుష్పగుచ్చాలు.. పూలదండలు తప్పనిసరి. దీంతో పూలదండలు తయారు చేసి అమ్మేవారికి చేతినిండా పని దొరుకుతుంది. బీరు.. బిర్యానీ.. పొద్దంతా కష్టపడి అలసిసొలసిన నాయకులు.. కార్యకర్తలు ఓ బీరు కొట్టేస్తూ సేదతీరుతున్నారు. చల్లని బీరు.. నైన్టీ కోసం మద్యం దుకాణాల బాట పడుతున్నారు. అనుచరులు, పార్టీ శ్రేణులు చేజారిపోకుండా అభ్యర్థులు ముందస్తుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మందుతో కూడిన విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో విందు ఏర్పాటుచేసిన సమయంలో మద్యంలో మాంసాహారం ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో పనిలో పనిగా వంటలు, క్యాటరింగ్ చేసే వారికి చేతినిండా పని దొరుకుతుంది. బిజీ బిజీగా కళాకారులు ఎన్నికలు.. ప్రచారాలు.. సన్మాన సత్కార కార్యక్రమాల్లో కళ రావాలంటే కళాకారుల ఆటాపాటా ఉండాల్సిందే. ముందస్తు ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రచారజోరును కళాకారులు హోరెత్తిస్తున్నారు. వీరు పాడే పాటలు ప్రచారానికి వన్నె తెస్తున్నాయి. కళాకారులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని.. ఆయా గ్రామాలకు అభ్యర్థులు ప్రచారానికి వెళ్లేకంటే ముందుగానే వెళుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. వీరితో పాటు కోలాటం ఆడే మహిళా కళాకారులకు ఎన్నికల ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న కోలాటం.. అభ్యర్థుల ప్రచారంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. డిజిటల్ మార్కెట్ ప్రజలకు చేరువయ్యేందుకు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కటీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రచారంలో ప్రస్తుతం కీలక భూమిక పోషిస్తున్న సామాజిక మాద్యమాల వైపు చూస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లతో పాటు ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్‌తో ప్రచారం చేసి పెట్టడానికి డిజిటల్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిజిటల్ మార్కెటింగ్చేసే వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఒక్క ఫోన్‌కాల్‌కు 30 పైసల నుంచి 50 పైసలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వాహనాలకు డిమాండ్ ఎన్నికల సమయంలో ముఖ్యనేతల ప్రచార సభలు... అనుచరుల సుడిగాలి పర్యటనలు.. ఊరూరా ప్రచారం చేసుకునేందుకు ట్యాక్సీలు.. ట్రావెల్స్ అవసరపడుతున్నాయి. దీంతో యజమానులు ఇప్పుడు బిజీగా మారిపోయారు. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేటు వాహనాలు తప్పనిసరి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతల బహిరంగ సభలు నియోజక వర్గం... జిల్లా పరిధిలో నిర్వహించే సమయాల్లో వాహనాల కోసం నానా తంటాలు పడుతున్నారు. కడుపునిండా భోజనం.. ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హోటళ్ల వద్ద సందడి పెరిగిపోయింది. ఓ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టేవారు కొందరైతే..అభ్యర్థుల వెంట తిరిగి అలసిపోయిన వారు మరికొందరు. రాత్రి ప్రచారం ముగించుకుని బిర్యానీ కోసం హోటల్‌కు వెళితే.. దొరకడం కష్టంగా మారింది. కడుపు నింపుకునేందుకు ఏదో ఒక రకం తినేస్తూ.. ఉదయాన్నే ప్రచారం బాట çపడుతున్నారు. -
శ్రీకాకుళంలో వరదల్లో చిక్కుకున్న కూలీలు
-
53 మంది కూలీలు సురక్షితం
సాక్షి, శ్రీకాకుళం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదుల్లో వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గొట్టా బ్యారేజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ వరద నీటి ప్రవాహానికి సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం రేవు ఇసుక ర్యాంప్ వద్ద ఇరువై లారీలు చిక్కుకుపోయాయి. లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన 53 మంది కూలీలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు. తొలుత 24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. అయితే క్రమేణా వరద ఉధృతి పెరగడంతో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్వంలో మిగిలిన వారిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న 53 మందిని కాపాడామని, వర్షా కాలంలో నదుల్లో పనిచేసేముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. -
సమస్యలు పరిష్కరించాలి
–ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఉపాధి కూలీలు టెక్కలి: ఉపాధి హామీ పనులు చేస్తున్న వేతనదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేతనదారులు సోమవారం టెక్కలి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.ఎల్లయ్య మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు బకాయి వేతనాలు చెల్లించాలని, ప్రతీ కుటుంబానికి 150 రోజులు పని కల్పించాలని, ప్రభుత్వం ప్రకటించిన 307 రూపాయల దినసరి కూలీ అమలు చేయాలని, 50 రోజులు పని పూర్తి చేసిన వేతనదారులకు భీమా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి నిధులతో సిమెంట్ రోడ్లు, యంత్రాలతో పనులు తక్షణమే నిలిపివేయాలని, వేసవి కాలం అలవెన్స్ పెంచాలని, మేజరు పంచాయతీలో శాశ్వత ఫీల్డు అసిస్టెంట్‌ను నియమించాలని ఎల్లయ్య డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ వై.రవీంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకుడు ఎన్.షణ్ముఖరావు, ఉపాధి వేతనదారులు కె.పార్వతి, జి.ఏకాశి, జె.రాజేశ్వరి, డి.నీలవేణి, డి.విజయ, అమల, పార్వతి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.