
బెంగళూరులో కూలీ పనులు చేస్తున్న కుప్పంవాసులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం, రాయదుర్గం: ఆర్థిక లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న హై..టెక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల దుస్థితికి ఈ శ్రమజీవులే నిదర్శనమని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సొంతపనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లిన ఆయన అక్కడ కూలి పనులు చేస్తున్న కొంతమందిని విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయన్నారు. వృద్ధాప్యం మీద పడుతున్న ఇద్దరు కూలీలు లక్ష్మయ్య, వెంకటాపురం వెంకటేశులు మాట్లాడుతూ తమది కుప్పం నియోజకవర్గమని చెప్పారన్నారు. వందలాది మంది కుప్పం నుంచి వలస వచ్చి దుర్భరమైన జీవితం గడుపుతున్నట్లు వాపోయారన్నారు. కరువును తరిమికొడతామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రజలనే రాష్ట్రం నుంచి తరిమి కొడుతున్నారని కాపు విమర్శించారు. చీమ చిటుక్కుమన్నా కంప్యూటర్ కోర్ డ్యాష్ బోర్డులో తనకు తెలిసిపోతుందని డప్పు కొట్టుకునే డబ్బా ముఖ్యమంత్రికి.. తన నియోజకవర్గంలోని వలసలు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు.