ఏళ్ల తరబడి రాయి నీటిలో ఉన్నా మెత్తబడిపోదు. అలాగే దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరికి విజయం సొంతమవడం అనివార్యం. నాలుగు పర్యాయాలు ప్రయత్నించినా ఫలితం రాలేదని దిగులు చెందకుండా ఐదోసారికూడా నీట్ పరీక్షకు హాజరై ఉచిత సీటు సాధించుకున్న జోధారామ్ గురించి తెలుసుకుందాం..
జోధారాం స్వస్థలం రాజస్థాన్‌లోని బార్మెర్ జిల్లా గోలియా గ్రామం. వ్యవసాయ కుటుంబం. సకాలంలో వర్షాలు కురవకపోవడం, పంట పండకపోవడం కారణంగా ఆ కుటుంబం అనేక బాధలకు గురైంది. అయితే జోధారామ్‌కు చదువంటే చాలా ఇష్టం. డాక్టర్ కావాలనేది అతని లక్ష్యం. ఎంబీబీఎస్ చదివించడం కోసం తండ్రి ఒక షరతు విధించాడు. ఇంటర్ బోర్డు పరీక్షలో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉచితం ప్రవేశం సాధించడం. అలా చేయలేకపోతే ముంబై వెళ్లి కూలీ పనిచేయడం. దీంతో జోధారామ్ కష్టపడి చదివి 65 శాతం మార్కులు సాధించాడు.
రామ్ ప్రతిభను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ పోటీ పరీక్షలు రాస్తే మంచి భవిష్యత్తు ఉం టుందంటూ ప్రోత్సహించాడు. తొలిసారి నీట్ పరీక్షకు హాజరైన రామ్‌కు 1,50,000 ర్యాంకు వచ్చింది. అయినా లక్ష్యం నెరవేరలేదు. తండ్రికి ఇచ్చిన మాట మేరకు ముంబై వెళ్లి కూలీ పనిచేయడం ప్రారంభించాడు. అయితే రామ్ పట్టువదలని విక్రమార్కునిలా నీట్ పరీక్షలను మాత్రం విడిచిపెట్టలేదు. మళ్లీ మూడు పర్యాయాలు ఇవే పరీక్షలు రాశాడు. నాలుగోసారి ఆల్ ఇండియా లెవెల్లో 12,903 ర్యాంకు వచ్చింది. దీంతో రామ్ ప్రతిభను గుర్తించిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నీట్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐదోసారి నీట్‌లో ఆల్ ఇండియా 3886 ర్యాంకు సాధించి, జోధ్‌పూర్‌లోని సంపూర్ణాననంద్ వైద్యకళాశాలలో ఉచిత అడ్మిషన్ పొందాడు.
చదివించలేరని తెలుసు..
‘‘మా అన్నయ్య తప్ప ఇంకెవరూ నన్ను నమ్మలేదు. ముంబై వెళ్లి కూలీ పని చేసుకుని బతకమని అమ్మ చెప్పింది. అలా అన్నందుకు బాధ కలగలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులకు ఎంబీబీఎస్ చదివించేంత స్తోమత లేదని తెలుసు. అం దుకే కష్టపడి చదువుకున్నా. ఆశించిన ఫలితం లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తన మనసులో మాట చెప్పాడు జోధారామ్.
Comments
Please login to add a commentAdd a comment