టిప్పర్ కింద నలిగిపోయిన బండయ్య, రాజు మృతదేహాలు
వారివి రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఉపాధి కోసం భార్యలు కువైట్ వెళ్లారు. భర్తలు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. వారిపై విధి చిన్నచూపు చూసింది. కూలి పనులు చేసుకుని ఇంటికి వెళుతున్న వారిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాలు కూలిపోయాయి.
చిత్తూరు , పెద్దమండ్యం: మండలంలోని పెద్దమండ్యం–చిన్నమండ్యం రోడ్డులోని మొరాలవంక మలుపు వద్ద ఆదివారం టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండ్యం మండలం చన్నరసుపల్లె, వడ్డిపల్లెకు చెందిన కూలీలు పెద్దమండ్యంలో జరిగిన కాంక్రీట్ పనులకు వచ్చారు. పనులు ముగించుకుని కొందరు కూలీలు ఆటోలో వెళ్లిపోయారు. చిన్నరసుపల్లెకు చెందిన భైనిమేని బండయ్య, (36), డేరంగుల రాజు (32), వేల్పుల పిచ్చయ్య (41) ద్విచక్ర వాహనంలో గ్రామానికి బయలుదేరారు.
పెద్దమండ్యం– చిన్నమండ్యం రోడ్డులోని మొరాలవంక మలుపు వద్ద చిన్నమండ్యం నుంచి పెద్దమండ్యం వైపు రోడ్డుకు వేసే తారు లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొంది. సంఘటనలో బండయ్య, రాజు టిప్పర్ టైరు కింద పడి ఆక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకువెళ్లింది. ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న పిచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి తరలించారు. తంబళ్లపల్లె ఎస్‌ఐ శివకుమార్ టిప్పర్‌ను వెనక్కు తీయించి మృతదేహాలను బయటకు తీశారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాద వార్త తెలియడంతో పెద్దమండ్యం, చిన్నమండ్యం సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం మదనపల్లెకు తరలించారు.
మృతుల కుటుంబాల్లో విషాదం
రోడ్డు ప్రమాదం భైనిమేని బండయ్య, డేరంగుల రాజు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బండయ్యకు భార్య ఆనందమ్మ, కుమార్తె అశ్విని, కుమారుడు ఆంజినేయులు ఉన్నారు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఆనందమ్మ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. అలాగే డేరంగుల రాజుకు భార్య నాగేశ్వరమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగేశ్వరమ్మ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. మృతదేహాల మృతుల పిల్లలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారిని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment