సాక్షి, జనగామ: ముందస్తు ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రోజువారీ కూలీలకు డిమాండ్ పెరిగింది. కూలీలు ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికలు అభ్యర్థులకు విషమ పరీక్ష కాగా.. వ్యాపారులకు వరంగా మారింది. బీరు.. బిర్యానీ.. పూలదండలు..బోకెలతో వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలను కొంతమంది వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని నాలుగు రాళ్లు పోగేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజీ బీజీగా కూలీలు..
ప్రస్తుతం రోజువారి కూలీలకు డిమాండ్ పెరిగింది. పొద్దంతా కష్టపడితే వచ్చే దినసరి వేతనం కన్నా అభ్యర్థుల వెంట గంటలు తిరిగి ప్రచారం చేస్తే వచ్చే సొమ్ము మేలు అనుకుంటున్నారు. ప్రచారం పూర్తి చేసుకున్న తర్వాత కొంతమంది ముఖ్యులకు భోజనం కూడా దొరుకుతుండడంతో ఎన్నికల ప్రచారానికే సై అంటున్నారు. అభ్యర్థి ప్రచారానికి వెళ్లే సమయంలో తమ వెంట జనం కనిపించేలా ముందుగానే కూలీలను బుక్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రధాన వ్యక్తులు ఉదయం లేవగానే ఆయా అభ్యర్థి ఇళ్లకు వెళ్లి..అక్కడే అల్పాహారం పూర్తి చేసుకుని ప్రచార రథం ఎక్కేస్తున్నారు. దీంతో పత్తి సేకరణ కోసం కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
పూలదండలకు గిరాకీ..
పార్టీలో చేరుతున్న.. ప్రచారానికి వచ్చే నాయకుడికి స్వాగతం పలకాలన్నా.. ప్రధాన భూమిక పోషించేవి పూలదండలు. ఎన్నికల్లో దండలకు గిరాకీ పెరిగిపోయింది. అభ్యర్థి ఇంటి నుంచి ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు అభిమానులు వారిని పూలదండలతో ముంచెత్తుతున్నారు. సన్మానాలకు సత్కారాలకు పుష్పగుచ్చాలు.. పూలదండలు తప్పనిసరి. దీంతో పూలదండలు తయారు చేసి అమ్మేవారికి చేతినిండా పని దొరుకుతుంది.
బీరు.. బిర్యానీ..
పొద్దంతా కష్టపడి అలసిసొలసిన నాయకులు.. కార్యకర్తలు ఓ బీరు కొట్టేస్తూ సేదతీరుతున్నారు. చల్లని బీరు.. నైన్టీ కోసం మద్యం దుకాణాల బాట పడుతున్నారు. అనుచరులు, పార్టీ శ్రేణులు చేజారిపోకుండా అభ్యర్థులు ముందస్తుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మందుతో కూడిన విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో విందు ఏర్పాటుచేసిన సమయంలో మద్యంలో మాంసాహారం ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో పనిలో పనిగా వంటలు, క్యాటరింగ్ చేసే వారికి చేతినిండా పని దొరుకుతుంది.
బిజీ బిజీగా కళాకారులు
ఎన్నికలు.. ప్రచారాలు.. సన్మాన సత్కార కార్యక్రమాల్లో కళ రావాలంటే కళాకారుల ఆటాపాటా ఉండాల్సిందే. ముందస్తు ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రచారజోరును కళాకారులు హోరెత్తిస్తున్నారు. వీరు పాడే పాటలు ప్రచారానికి వన్నె తెస్తున్నాయి. కళాకారులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని.. ఆయా గ్రామాలకు అభ్యర్థులు ప్రచారానికి వెళ్లేకంటే ముందుగానే వెళుతూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. వీరితో పాటు కోలాటం ఆడే మహిళా కళాకారులకు ఎన్నికల ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న కోలాటం.. అభ్యర్థుల ప్రచారంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
డిజిటల్ మార్కెట్
ప్రజలకు చేరువయ్యేందుకు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కటీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రచారంలో ప్రస్తుతం కీలక భూమిక పోషిస్తున్న సామాజిక మాద్యమాల వైపు చూస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతో పాటు ఎస్‌ఎంఎస్, వాయిస్ కాల్స్‌తో ప్రచారం చేసి పెట్టడానికి డిజిటల్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో డిజిటల్ మార్కెటింగ్‌చేసే వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఒక్క ఫోన్‌కాల్‌కు 30 పైసల నుంచి 50 పైసలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
వాహనాలకు డిమాండ్
ఎన్నికల సమయంలో ముఖ్యనేతల ప్రచార సభలు... అనుచరుల సుడిగాలి పర్యటనలు.. ఊరూరా ప్రచారం చేసుకునేందుకు ట్యాక్సీలు.. ట్రావెల్స్ అవసరపడుతున్నాయి. దీంతో యజమానులు ఇప్పుడు బిజీగా మారిపోయారు. ప్రచారానికి నియోజకవర్గ స్థాయిలో తిరుగుతున్న సమయాల్లో పార్టీల అనుచరగణాన్ని తరలించేందుకు ప్రైవేటు వాహనాలు తప్పనిసరి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతల బహిరంగ సభలు నియోజక వర్గం... జిల్లా పరిధిలో నిర్వహించే సమయాల్లో వాహనాల కోసం నానా తంటాలు పడుతున్నారు.
కడుపునిండా భోజనం..
ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హోటళ్ల వద్ద సందడి పెరిగిపోయింది. ఓ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టేవారు కొందరైతే..అభ్యర్థుల వెంట తిరిగి అలసిపోయిన వారు మరికొందరు. రాత్రి ప్రచారం ముగించుకుని బిర్యానీ కోసం హోటల్‌కు వెళితే.. దొరకడం కష్టంగా మారింది. కడుపు నింపుకునేందుకు ఏదో ఒక రకం తినేస్తూ.. ఉదయాన్నే ప్రచారం బాట çపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment