అడ్డా కూలీలతో మాట్లాడుతున్న కార్పొరేటర్ విజయలక్ష్మి
బంజారాహిల్స్: తొక్కే కదా అని తేలిగ్గా తీసేయొద్దు... ఓ అరటి తొక్క 300 మంది అడ్డా కూలీలను ఏకం చేసింది... ఈ తొక్క పంచాయితీ కారణంగా వారు ఒక రోజు కూలీని కోల్పోవాల్సి వచ్చింది.. వివరాల్లోకి వెళితే...బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీటీ నగర్ కమాన్ వద్ద ఉండే ఆడ్డా నుంచి నిత్యం వందలాది మంది కూలీలు దినసరి కూలీలకు వెళ్తుంటారు.. అదే ప్రాంతంలో బాబూరావు అనే వ్యక్తి బండిపై అరటి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం ఉదయం కూలీలంతా పనుల కోసం వేచి ఉన్న సమయంలో ఎవరో ఓ వ్యక్తి అరటిపండు తిని రోడ్డుపై పారవేశాడు. దీంతో పక్కనే ఉన్న పండ్ల వ్యాపారి ఇటుగా వస్తున్న లింగం అనే అడ్డా కూలీని పిలిచి తొక్క తీయాలని సూచించాడు. తాను తినలేదని, తాను వేయని తొక్క ఎందుకు తీస్తానని పండ్ల వ్యాపారిని ప్రశ్నించాడు.
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన పండ్ల వ్యాపారి బాబూరావు కర్రతో లింగంపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన తోటి అడ్డా కూలీలు న్యాయం చేయాలంటూ స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి ఎదుట పంచాయితీ పెట్టారు. రెండు గంటల పాటు ఈ పంచాయితీ కొనసాగింది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం రణరంగంగాన్ని తలపించింది. పెద్ద సంఖ్యలో అడ్డా కూలీలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరటిపండ్ల వ్యాపారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. న్యాయం చేస్తామని కార్పొరేటర్ హామీ ఇవ్వడంతో వారు తిరుగుముఖం పట్టారు. అయితే అప్పటికే పనికి వెళ్లే సమయం ముగియడంతో ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment