అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చినా ఉపకారం ఇవ్వట్లేదు
‘ఆధార్’పై హైకోర్టును ఆశ్రయించిన ఇంజనీరింగ్ విద్యార్థి
సాక్షి, హైదరాబాద్: ఉపకారవేతనం మంజూరు కోసం ఆధార్ కార్డ్ అక్నాలెడ్జ్‌మెంట్ సమర్పించినా అధికారులు ఆధార్ కార్డు కోసం ఒత్తిడి చేయడాన్ని సవాలు చేస్తూ ఓ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించారు. టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి పగడాల నీలోత్పల్ బసు ఈ మేరకు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గురువారం విచారించారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ప్రణాళిక కమిషన్ కార్యదర్శి తదితరులను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఉపకార వేతనం పొందేందుకు దరఖాస్తు చేసుకోగా, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ఆధార్ కార్డ్ సమర్పించాలని ఒత్తిడి చేశారని, కార్డ్ ఇంకా రాలేదని, అధికారులు జారీ చేసిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను చూపినా పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డి.ఎల్.పాండు కోర్టుకు నివేదించారు.