విభజన తప్పదు | No second thought on Andhra Pradesh Bifurcation, says Sonia Gandhi | Sakshi
Sakshi News home page

విభజన తప్పదు

Published Thu, Aug 22 2013 1:23 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

విభజన తప్పదు - Sakshi

విభజన తప్పదు

* పునరాలోచనే లేదు: సోనియా
* రాష్ట్రపతి పాలనకూ వెనకాడం
* నిర్ణయాన్ని అమలు చేయాలంటూ కిరణ్‌కు ఆదేశం
* ఆ దిశగా క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచన
* సోనియా, రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ
 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై పునరాలోచన చేసే సమస్యే లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీ, ఉపాధ్య క్షుడు రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియతో ముందుకు సాగాల్సిందేనని బుధవారం తనను కలిసిన కిరణ్‌కు సోనియా స్పష్టం చేసినట్టు సమాచారం. మంగళవారం రాత్రి ఏకే ఆంటోనీ కమిటీతో ఆయన సమావేశమవడం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరినా, తెలంగాణ నిర్ణయంపై పునరాలోచన ఉండబోదని కమిటీ కూడా చెప్పడంతో చివరి ప్రయత్నంగా సీఎం బుధవారం మధ్యాహ్నం సోనియాతో సమావేశమయ్యారు.

రాహుల్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ కూడా భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ నిర్ణయం వెలువడ్డాక రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, సీమాంధ్ర ప్రజల మనోభావాలను కిరణ్ వివరించబోయినా, మేడమ్ సానుకూలంగా స్పందించలేదని ఏఐసీసీ వర్గాలన్నాయి. పైగా, రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా వెనకాడబోమని ఆమె స్పష్టం చేసినట్టు వివరించాయి.

అవసరమైతే రాష్ట్రపతి పాలనకు వెళ్తామే తప్ప తెలంగాణపై ఇచ్చిన మాట తప్పేది లేదంటూ కుండబద్దలు కొట్టారని సమాచారం. అంతేగాక, ‘సీమాంధ్ర ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగించండి. విభజన నిర్ణయాన్ని అమలు  చేయడంలో ముఖ్యమంత్రిగా క్రియాశీల పాత్ర పోషించండి’ అని కిరణ్‌కు సూచించారని తెలిసింది.
 
నివేదికల సమర్పణ
రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందని కిరణ్‌కు ముందునుంచే స్పష్టంగా తెలిసినా మిన్నకుండిపోవడం, ఆ మేరకు సీడబ్ల్యూసీ ప్రకటన వెలు వడ్డాక కూడా 9 రోజుల పాటు మౌనముద్రకే పరిమితం కావడం తెలిసిందే. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన, విభజనతో తలెత్తే సమస్యలను వివరిస్తూ రూపొందించిన రెండు నివేదికలను బుధవారం నాటి భేటీలో సోనియా, రాహుల్‌లకు సమర్పించినట్టు తెలిసింది.

విభజనతో రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ పూర్తిగా న్యాయం జరగకపోగా, కాంగ్రెస్‌కు రాజకీయంగా కూడా పెద్దగా లబ్ధి చేకూరదని ఆయన వాదించినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం... విభజనతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన సీమాంధ్ర ప్రజానీకంలో బలంగా ఉందని, అందుకే అన్ని వర్గాల వారూ సమైక్య రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని కిరణ్ చెప్పారు. ‘‘హైదరాబాద్ నగరంలో, శివారు ప్రాంతాల్లో స్థిరపడిన దాదాపు 50 లక్షల పై చిలుకు సీమాంధ్రవాసులతో పాటు సీమాంధ్ర ప్రజలంతా అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారు.

విభజనతో తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య తిరిగి విజృంభించే ప్రమాదముంది. తీవ్రవాద బెడద అంతిమంగా దేశ ఐక్యత, సమగ్రతలకే సవాలుగా మారనుంది. హైదరాబాద్ నగర ప్రతిపత్తితో పాటు సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొన్న నదీజలాల పంపిణీ తదితర కీలకాంశాలపై రెండు ప్రాంతాలకు పూర్తి న్యాయం జరిగేలా ఏకాభిప్రాయాన్ని సాధించేదాకా ప్రభుత్వ స్థాయిలో అధికారిక విభజన ప్రక్రియను ప్రారంభించకుండా నిలిపేయాలి. లేదంటే రాష్ట్రం మరింత అల్లకల్లోలమవుతుంది. విభజనతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ అస్తిత్వాన్నే కోల్పోవాల్సి రావచ్చు.

సమైక్యంగా కొనసాగిస్తే తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ బతికి బట్టకట్టడం సాధ్యమే’’ అని వివరించే ప్రయత్నం చేశారు. విభ జన తర్వాత  ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ నివేదికల సారాంశాన్ని తన వాదనకు మద్దతుగా సోనియా తదితరులకు కిరణ్ అందజేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తున్నారని కిరణ్ చెప్పారు. కాంగ్రెస్ నేతలెవరూ నియోజకవర్గాలకు వెళ్లగలిగే పరిస్థితులు లేవన్నారు.
 
లాభం లేదు
‘‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అధిష్టానం పునఃపరిశీలించే అవకాశాలేమీ కనబడటం లేదు. విభజన ప్రక్రియపై ముందుకెళ్లడమే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పార్టీ ముఖ్యులే కుండబద్దలు కొట్టి చెబుతున్నారు’’ అంటూ సీమాంధ్ర ముఖ్య నేతల వద్ద కిరణ్ నిర్వేదం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బుధవారం సోనియా, రాహుల్‌లతో భేటీకి ముందు, తర్వాత వారితో ఏపీభవన్‌లో ఆయన పలుమార్లు భేటీ అయ్యారు.

ఆంటోనీ కమిటీతో, అనంతరం సోనియాతో తన భేటీల సారాంశాన్ని వివరించారు. సీమాంధ్రుల ఆందోళనను ఆలకించేందుకు పార్టీపరంగా నియమించిన ఆంటోనీ కమిటీ విభజన సమస్యలను పరిష్కరించేందుకే ఉంది తప్ప, నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కనబడటం లేదని మంత్రులు అన్నట్టు తెలిసింది. పరిస్థితి చేయి దాటినట్టే కనిపిస్తోందని, టీడీపీ సహా అన్ని పార్టీలూ తెలంగాణపై ఒకే వైఖరి ప్రకటించడమే విభజన నిర్ణయానికి కారణమని కిరణ్ అన్నట్టు చెబుతున్నారు. పార్టీలన్నీ ఒకే వైఖరితో ఉన్నప్పుడు మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వస్తున్నాయని కిరణ్ చెప్పారు.

ఆయన్ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి పల్లంరాజు, మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, సీనియర్ నేత గాదె వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. అనంతరం కిరణ్ హైదరాబాద్ ప్రయాణమయ్యారు. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్క లేఖ ఇస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని కొండ్రు మురళి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం శిలాశాసనమేమీ కాదని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాలతో ప్రభావితం చేయగలిగితే నిర్ణయాలు అవే మారిపోతాయి’’ అని అభిప్రాయపడ్డారు.
 
రాజకీయంగా ఏమాత్రం లాభం కాదు: గాదె
విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్‌కు తెలంగాణలో 4, సీమాంధ్రలో 3 ఎంపీ సీట్లే వస్తాయని ఇటీవలి సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని గాదె అన్నారు. ‘‘విభజన నిర్ణయంతో కాంగ్రెస్‌కు ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి దీనిపై పునరాలోచించాలి. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్... ఒక రాష్ట్రం విషయంలో ఒకలా, ఇతర రాష్ట్రాల డిమాండ్ల విషయంలో మరోలా వ్యవహరించడం దురదృష్టకరం’’ అని ఆయనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement