గుడివాడ : వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు ఎంతో మేలు.. సౌర విద్యుత్‌తో పగలే పొలానికి నీరు పెట్టుకోవచ్చు. సబ్సిడీపై రైతులకు పంపుసెట్లను పంపిణీచేస్తున్నాం.. అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ మాటలు నమ్మిన 430 మంది రైతులు తమ వాటా మొత్తాన్ని నాలుగు నెలల క్రితమే డీడీల రూపంలో చెల్లించారు. అయితే పంపుసెట్లు మాత్రం బిగించ లేదు.
పంపుసెట్ల ఏర్పాటు ఎప్పటికో..
వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సోలార్ వ్యవసాయ పంపుసెట్ల పథకాన్ని ప్రకటించింది. ఏపీ డిస్కం, నెడ్‌క్యాప్ సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తాయి. ఏపీ డిస్కం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి తిరుపతిలోని తమ ప్రధాన కార్యలయానికి పంపుతుంది. ఆ దరఖాస్తులకు 14 రోజుల్లో ఆమోదం తెలిపి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నెడ్‌క్యాప్‌కు సమాచారం ఇస్తారు.
నెడ్‌క్యాప్ సిబ్బంది సోలార్ పంపుసెట్ల సప్లయర్లకు సమాచారం ఇచ్చి, 30 రోజుల్లో రైతుల పొలాల్లో ఏర్పాటుచేయాలి. 5హెచ్‌పీ మోటార్ ధర సోలార్ ప్యానళ్లతో కలిపి రూ.4.90 లక్షలు. 3హెచ్‌పీ మోటారు సోలార్‌ప్యానళ్లతోకలిపి రూ.4.30లక్షలు. ఇందులో రైతు వాటా 11శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 33శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 56శాతం. 5హెచ్‌పీ మోటారుకు రైతువాటా రూ.55 వేలు చెల్లిస్తే మిగిలిన రూ.4.35 లక్షలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా ఇస్తాయి.
నాలుగు నెలలుగా ఎదురు చూపులు
జిల్లాలో 430 మంది రైతులు 5హెచ్‌పీ మోటారు సోలార్ పంపుసెట్లుకోసం దరఖాస్తుచేశారు. వారి వాటాగా రూ.55 వేల చొప్పున డీడీలు తీసి డిస్కంకు ఇచ్చారు. ప్రస్తుతం ఖరీఫ్ ముంచుకొచ్చినా పంపుసెట్లు బిగించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో మోటార్లు బిగిస్తారనే ఆత్రుతతో ముందుగానే డీడీలు చెల్లించామని పేర్కొంటున్నారు.
సప్లయర్లదే జాప్యం
డిస్కం వద్ద సోలార్ పంపుసెట్ల సప్లయర్లు 50 మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ధరకు తాము సోలార్ ప్యానళ్లు ఇవ్వలేమని వారు చేతులెత్తేసినట్లు సమాచారం. 5హెచ్‌పీ మోటారుకు నీటి ప్రవాహం డెలివరీ 2.5 అంగుళాల సామర్థ్యంగలదే ఇస్తామని సోలార్ పంపుసెట్ల సప్లయర్లు చెబుతున్నారు. జిల్లా పరిస్థితులను బట్టి 5హెచ్‌పీ మోటారుకు 4అంగుళాల డెలివరీ సామర్థ్యం కావాలని రైతులు అడుగుతున్నారు.
రైతులు కోరినట్లు సరఫరా చేయాలంటే ధర పెంచాలని సప్లయర్లు చెప్పినట్లు సమాచారం. జగ్గయ్యపేట, నూజివీడు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పంపుసెట్లు బిగించామని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆ ప్రాంతాల్లో 2.5 అంగుళాల సామర్థ్యం గల మోటార్లును రైతులు అంగీకరించారని, మాగాణి ప్రాంత రైతులు 4అంగుళాలు సామర్థ్యం కావాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. దీంతో సప్లయర్లతో మాట్లాడాల్సి ఉందన్నారు.
సోలార్ పంపుసెట్లు ఏవీ..!
Published Thu, Jun 25 2015 4:45 AM | Last Updated on Mon, Oct 22 2018 8:40 PM
Advertisement
Advertisement