ఆర్భాటమే.. ఆచరణేదీ? | No Solutions.. | Sakshi
Sakshi News home page

ఆర్భాటమే.. ఆచరణేదీ?

Published Tue, Dec 4 2018 5:27 PM | Last Updated on Tue, Dec 4 2018 5:27 PM

No Solutions.. - Sakshi

సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి పర్యటనంటే జిల్లా అభివృద్ధికి ఉపయోగమని ప్రజలు భావించడం సర్వసాధారణం. నాలుగున్నరేళ్లుగా తద్భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రావడం.. హామీల వర్షం కురిపించడం, ఆచరణలో చిత్తశుద్ధి చూపకపోవడం క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఇప్పటికీ దాదాపు 25 పర్యాయాలు పర్యటించారు. హామీల జాబితా పెరిగిపోవడం మినహా నిర్ధిష్టమైన అభివృద్ధి కన్పించలేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జూన్‌ 30న ఉక్కు పరిశ్రమను రెండునెలల్లో నెలకొల్పుతామని ప్రకటించారు. నాలుగు నెలల తర్వాత అక్టోబర్‌ 30న నెలలో శంకుస్థాపన చేస్తామని మరోమారు ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసింది. ఇప్పటికీ ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. తాజాగా మంగళవారం జ్ఞానభేరి కార్యక్రమానికి యోగివేమన యూనివర్శిటీకి హాజరవుతున్నారు.   ఇప్పటికైనా ‘చేసేదే చెప్పాలని, చెప్పింది చేయాలని’ ప్రజానీకం నినదిస్తోంది.

కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పనున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నన్నాళ్లు ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎన్నికలు సమీపించేకొద్ది తెలుగుతమ్ముళ్లతో నాటకం రచించారు. ఆమేరకు ‘ఉక్కుదీక్ష’ పేరిట రక్తి కట్టించారు. పార్లమెంటులో ఏనాడు ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ప్రశ్నించని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌చే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కేంద్ర ప్రభుత్వానికి 2నెలల గడువు ఇస్తున్నాం. రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. లేదంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతాం..అని ’ఈ ఏడాది జూన్‌ 30న కడప గడపలో ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ఆవరణలో ఉక్కుదీక్షకు గుర్తుగా సీఎం చేతుల మీదుగా పైలాన్‌ కూడా ఆవిష్కరించారు. ఆపై గట్టిగా మాట్లాడుతూ కేంద్ర  ప్రభుత్వంపై పెద్ద స్వరంతో హెచ్చరికలు చేస్తూ మరీ వెల్లడించారు. ఆగస్టు 30నాటికే రెండు నెలల గడువు ముగిసింది. నాలుగునెలల తర్వాత ఆక్టోబర్‌ 30న ధర్మపోరాటదీక్ష పేరిట ప్రొద్దుటూరుకు హాజరైన సీఎం నెలలోపు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసిపోయింది. తొలుత హామీ ఇచ్చిన తదుపరి 5నెలలు గడిచినా శంకుస్థాపన దిశగా అడుగులు పడడం లేదు.  ఉక్కుదీక్ష పైలాన్‌ దిష్టిబొమ్మలా జిల్లా పరిషత్‌ ప్రాంగణంలో దర్శమిస్తోండడం విశేషం.
 
ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎదురుచూపులు..
మూడున్నరేళ్లుగా జిల్లాలోని రైతులు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం నిరీక్షిస్తున్నారు.  గతంలో రోవాన్‌ తుపాన్, ఆ వెంటనే మరో తుపాన్‌ ప్రభావం ధాటికి పంటలు పూర్తిగా కోల్పోయారు. తుపాన్‌ గాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేకోడూరులో స్వయంగా పరిశీలించారు. అప్పట్లో వెంటనే పరిహారం అందించి ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఆచరణలో ఇప్పటికీ కన్పించలేదు. వ్యవసాయ పంటలు దాదాపుగా 57,062 హెక్టార్లుల్లో దెబ్బతిన్నాయి. ఇందులో వేరుశనగ, వరి, పత్తి, ఉల్లి, పూలతోటలు ఉన్నాయి. వీటికి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.55.8కోట్లు రావాల్సి ఉంది. ఉద్యాన పంటలు 4,293 హెక్టార్లల్లో దెబ్బతిన్నాయి. వీటికి రూ.10.2కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2015 నుంచి ఇప్పటివరకూ రైతులు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎదరుచూడడం మినహా ప్రభుత్వం మంజూరు చేసిన దాఖలాలు లేవు.  2014–18 కాలంలో వడ్డీలేని రుణాలు కింద దాదాపు రూ.10కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. లక్షలోపు రుణం తీసుకున్న తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణం వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. అలాగే 3వ విడత రుణమాఫీ మొత్తం జిల్లాకు రూ.248.5 కోట్లు రావాల్సి ఉండగా సగం మొత్తంతో సరిపెట్టారు, 4, 5విడతలు పెండింగ్‌లో ఉన్నాయి.

పేరుకుపోయిన సీఎం హామీల జాబితా..
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం, ఇక్కడి పండ్లతోటలను దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు చేస్తాం. టెర్మినల్‌ మార్కెట్, రాజంపేటలో హార్టికల్చర్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. చేనేతల కోసం మైలవరంలో టెక్స్‌టైల్స్‌ పార్క్, ప్రొద్దుటూరులో అఫెరల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తర్వాత వాటి ఊసే ఎత్తుకొలేదు. దేవాలయాలను కలుపుతూ ఫిలిగ్రామ్‌ టూరిస్టు సర్క్యూట్‌ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి. కడప–చైన్నై నాలుగు లైన్లు రహదారి విస్తరణ. ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు, ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం అంటూ సీఎం ఊరించారు. ఇవన్నీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన ప్రతి సందర్భంలో ప్రకటించిన హామీలు. ఉర్దూ యూనివర్శిటీ స్థానంలో హాజ్‌హౌస్‌ మాత్రమే కడపకు పరిమితమైంది. తక్కిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో కన్పించలేదని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటీకే ఇచ్చిన  హామీలను అమలు చేయాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది. ఇదే విషయం ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో యోగివేమన యూనివర్శిటీ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్ల బాధ్యులను సభ్యులను పోలీసులచే అరెస్టులు చేయించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement