కర్నూలు: ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయం (నల్సర్, హైదరాబాద్)లో ప్రవేశానికి జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగబోతోంది. ఈ విద్యా సంవత్సరంలో వివిధ న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్-2015 (సీఎల్‌ఏటి) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అయిదేళ్ల న్యాయ విద్యలోని 70 సీట్లలో 14 తెలంగాణ రాష్ట్రానికి.. మిగిలిన 56 సీట్లను అఖిల భారత విద్యార్థులకు కేటాయించారు. అదేవిధంగా ఎల్‌ఎల్‌ఎం కోర్సులోని 50 సీట్లలో 10 సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయించగా.. మిగతా 40 సీట్లలో అఖిల భారత కేటగిరీకి ఎలాంటి స్థానిక రిజర్వేషన్స్ లేకుండా ఆంధ్ర విద్యార్థులు పోటీ పడాల్సి వస్తోంది.
ఈ కేటాయింపు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95కు వ్యతిరేకంగా ఉందని పలువురు న్యాయవాదులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాల వరకు ఇరు రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలని.. అయితే ప్రతిష్టాత్మకమైన నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి విడుదల చేసిన నోటిఫికేషన్ అందుకు వ్యతిరేకంగా ఉండటం పట్ల విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.