మేడ్చల్, న్యూస్‌లైన్: అత్వెల్లి గ్రామం చీకటిమయంగా మారింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేసినా గ్రామంలో అంధకారం వీడటం లేదు. ఈ గ్రామం నుంచి వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై చీకటి కమ్ముకోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైంది.
అత్వెల్లి గ్రామ పంచాయతీ మేడ్చల్ నగర పంచాయతీలో విలీనం కాకముందు నాటి సర్పంచ్ యాదగిరి పాలకవర్గ సమయంలో గ్రామంలో సెంటర్ లైట్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై మేడ్చల్ శివారు నుంచి అత్వెల్లి మసీద్ శివారు మూడు కిలోమీటర్ల మేర రూ. 12 లక్షలు వెచ్చించి 87 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి సెంటర్ లైట్లను అమర్చారు. మొదట్లో రెండు నెలల పాటు ఈ దీపాలు బాగానే పనిచేశాయి. ఆ తర్వాతే అసలు కథ ఆరంభమైంది. దీపాలు వెలగడం లేదని, మరమ్మతులని అధికారులు, పాలకులు కుమ్మకై నాలుగు సంవత్సరాల్లో రూ. 20 లక్షలు వీటి నిర్వహణ పేరిట స్వాహా చేశారు.
ఈ కాలంలో యాక్సిడెంట్లు, గాలిదుమారాలకు కొన్ని స్తంభాలు నేలకూలాయి. ప్రస్తుతం అత్వెల్లి పంచాయతీ పరిధిలో 36 స్తంభాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. వీటిలో సగం వెలగడం లేదు. దీనికితోడు రహదారిపై సెంటర్ లైటింగ్ రావడం లేదని సంవత్సరం క్రితం హడావుడిగా గ్రామం ప్రధాన చౌరస్తాలో సుమారు రూ. 2 లక్షలతో హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేసి ఖర్చును మరింత పెంచారు. గ్రామంలోని వీధుల్లో మరో రూ. ఐదు లక్షలు వెచ్చించి పది హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. గ్రామంలోని వేంకటేశ్వర ఆలయానికి వెళ్లే దారిలో దాదాపు రూ. 6 లక్షల వ్యయంతో ఎనిమిది సెంటర్ లైట్లు ఏర్పాటు చేశారు.
వీటిలో ప్రస్తుతం ఒక్కటి కూడా పనిచేయడం లేదు. ఇలా దాదాపు రూ. 50 లక్షలకు పైగానే ఖర్చు చేసినా గ్రామానికి చీకటి చింత తీరడం లేదు. రాత్రి సమయంలో చీకటి ప్రయాణంతో గ్రామస్తులు తరచూ ప్రమాదాలకు లోనవుతున్నారు. ప్రధానంగా ఇక్కడి జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ప్రయాణం వీరికి క్షణక్షణ గండంగా మారింది.
గ్రామంలో పనిచేయని వీధి దీపాలు
Published Wed, Jan 29 2014 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement