ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: సంక్రాంతి పండుగ వచ్చింది... పంచదార రానంది. అదనపు కోటా మాట దేవుడెరుగు. ప్రతినెలా రావలసిన వాటాకూ అధికారులు ఈసారి మొండిచేయి చూపారు. దాంతో ఈ సంక్రాంతి పండుగకు తీపి తగ్గిపోనుంది. కారణం.. చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులు సకాలంలో పంపిణీ చేయకపోవడమే. వాస్తవానికి ప్రతినెలా 1నుంచి 5వ తేదీలోపు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తవుతుంది. కొన్ని నెలల నుంచి పంపిణీ తేదీలు పూర్తిగా మారిపోయాయి. ఏరోజు పంపిణీ చేస్తారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. దాంతో ఎక్కువమంది కార్డులు చేత పట్టుకుని చౌక దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లాలో 2107 చౌక ధరల దుకాణాలున్నాయి.
వాటి పరిధిలో 8లక్షల 563 తెల్లకార్డులు, 56వేల 946 రచ్చబండ-3 కార్డులు, 52వేల 152 అంత్యోదయ అన్నయోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ఒక్కో కార్డుదారునికి ప్రతినెలా అర కేజీ పంచదార, పామోలిన్ ఆయిల్ ఒక లీటర్, కందిపప్పు కేజీ, గోధుమలు కేజీ, గోధుమపిండి కేజీ, కారంపొడి 250గ్రాములు, చింతపండు అర కేజీ, పసుపు 100గ్రాములు, అయోడైజ్డ్ ఉప్పు కేజీ అందించాలి. అయితే మూడు నెలల నుంచి నిత్యావసర సరుకుల పంపిణీలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదు. కొన్నిసార్లు పంపిణీ చేసినప్పటికీ అవి గోడౌన్ల నుంచి చౌకధరల దుకాణాలకు చేరడం లేదు.
గోడౌన్లలో పంచదార ఉన్నా..
గౌడౌన్లలో పంచదార సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని సకాలంలో చౌకధరల దుకాణాలకు పంపిణీ చేయడం లేదు. గతంలో ప్రతి కార్డుదారునికి కేజీ చొప్పున పంచదార ఇచ్చేవారు. దానిని అరకేజీకి కుదించారు. అది కూడా సక్రమంగా అందడం లేదు. పండుగ సమయాల్లో పంచదార కోటాను అదనంగా ఇవ్వడం కొన్ని సంవత్సరాల నుంచీ ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీకి కూడా ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చేసింది. వాస్తవానికి గౌడౌన్లలో పంచదార నిల్వలు ఉన్నప్పటికీ వాటిని సరఫరా చేయకుండా నిలిపివేశారని పలువురు చౌకధరల దుకాణదారులు వాపోతున్నారు.
కందిపప్పు, పామోలిన్ ఆయిల్‌ను పంచదారతో లింక్ పెట్టారు. కందిపప్పు, పామోలిన్ ఆయిల్ విడుదల కాగానే పంచదారతో కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. పండుగ సమయాల్లో అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల తాము కార్డుదారులకు సమాధానాలు చెప్పుకోలేకపోతున్నామని అనేక మంది డీలర్లు అంటున్నారు. ముఖ్యమైన పండుగ రోజుల్లో పంచదారను ఇతర వస్తువులతో ముడిపెట్టకుండా అందించాలని డీలర్లు అంటున్నారు. ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని పండుగ రోజుల్లో పంచదార సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పండుగొచ్చింది.. పంచదార రానంది!
Published Sun, Jan 12 2014 4:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement