ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. తొలి ఏడాదిలో అనేకసార్లు జిల్లాకు వచ్చిన ఆయన హామీల వరద కురిపించినా.. ఆచరణలో వాటి జాడే కనిపించడం లేదు. బెజవాడ సమీపంలోనే రాజధాని ఏర్పాటు చేస్తుండటంతో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశపడిన ప్రజలకు ధరల మోత తప్ప అభివృద్ధి మచ్చుకైనా కనిపించని పరిస్థితి. సీఎం వచ్చినప్పుడల్లా అధికారులు, టీడీపీ నేతలు హడావుడిచేయడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
- ఏడాదైనా ప్రారంభం కాని పోర్టు పనులు
- నోటిఫికేషన్ దశలో విమానాశ్రయ విస్తరణ
- కళాక్షేత్రం, ఇండోర్ స్టేడియంకు నిధులు లేవు
- అమలుకు నోచుకోని సీఎం హామీలు
సాక్షి, విజయవాడ : చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో జిల్లా వాసులకు గత ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం ఆరు నెలల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది పూర్తయినా పోర్టు అంశం ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొంది. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం విమానాశ్రయ విస్తరణ పనులు నోటిఫికేషన్‌కే పరిమితమయ్యాయి. భూసేకరణే వీటికి ప్రధాన అడ్డంకిగా మారింది. భూమికి భూమి ఇస్తామని అధికారులు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మడం లేదు.
వీటి సంగతేంటి?
గత ఏడాది డిసెంబర్ 12, 13 తేదీల్లో నగరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రూ.4 కోట్లతో ఆధునిక హంగులు అద్దుతామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి దీటుగా దీనిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం సెంట్రల్ ఏసీ చేస్తామని, చక్కటి సీటింగ్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. దీంతో పాటు దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియాన్ని రూ.1.50 కోట్లతో ఆధునికీకరించి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి వార్డును స్వయంగా పరిశీలించిన చంద్రబాబు అప్పట్లో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి వార్డు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఇప్పటికీ ఆ నిధులు మంజూరు కాకపోవడంతో గర్భిణులు సరైన వైద్య సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచినీటి సమస్యా పరిష్కారం కాలేదు...
తూర్పు నియోజకవర్గ వాసులు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడటంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.52 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అదీ కార్యరూపం దాల్చలేదు. నగరంలోని కాల్వగట్లను పరిశీలించిన చంద్రబాబునాయుడు రాజధానిలో కాల్వలు ఉండాల్సిన తీరు ఇది కాదంటూ మేయర్, మున్సిపల్ కమిషనర్‌లపై సీరియస్ అయ్యారు. బందరు కాల్వ, రైవస్ కాల్వ, ఏలూరు కాల్వలను రూ.15 కోట్లతో బ్యూటిషికేషన్ చేయిస్తానంటూ నమ్మకంగా చెప్పారు. అదీ ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది అక్టోబర్‌లో సింగ్‌నగర్‌లో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు తమకు కనీస సౌకర్యాలు లేవని, దోమల బెడద ఎక్కువగా ఉందని, మంచినీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. వాటిని పరిష్కరిస్తానంటూ ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. జూలైలో ఎన్జీవోస్‌తో జరిగిన సమావేశంలో జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్యోద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చారు. అదీ పూర్తిగా అమలుకాలేదు. ఇవన్నీ ఎప్పటికి అమలయ్యేనో.. అని జనం ఎదురుచూపులు చూస్తున్నారు.
మా జీవనోపాధి తీయొద్దు
రైవస్ కాల్వ గట్టుపై 40 ఏళ్లుగా పూల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు కాల్వల బ్యూటిఫికేషన్ పేరుతో మా దుకాణాలను తొలగిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడంతో నా లాంటి చిరు వ్యాపారులంతా వణికిపోతున్నాం. మాకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే దుకాణాలు తొలగించాలి. నగరంలో డ్రైనేజీ వ్యర్థమంతా కాల్వలో కలుస్తోంది. దాన్ని ఆపకుండా బ్యూటిఫికేషన్ ఎలా సాధ్యం. అది చేసిన తరువాత, మాకు ఉపాధి చూపించి అప్పుడు తొలగించాలి.
- బడే సాంబశివరావు, పూల వ్యాపారి
ప్రసూతి వార్డులో సౌకర్యాలు మెరుగుపరచాలి
నాకు ఎనిమిదో నెలలోనే డెలివరీ అయ్యింది. బాబును బాక్స్ (ఇంక్యుబేటర్)లో పెట్టేందుకు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాం. ఒకే బెడ్‌పై ఇద్దరు రోగుల్ని పడుకోబెడుతున్నారు. రోగులతో వచ్చేవారికి కూర్చునేందుకు సౌకర్యాలు లేవు. చెట్ల కిందే కూర్చోవాల్సి వస్తోంది. వైద్యుల సేవలు బాగానే అందుతున్నాయి.
- ప్రమీల, పెద అవుటపల్లి
మంచినీటి సౌకర్యం కల్పించాలి
తూర్పు నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉంది. కృష్ణానదికి వరదలు వస్తే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలూ ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడి ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఈ ప్రాంత వాసులు చేస్తున్న డిమాండ్ పరిష్కారం కావడం లేదు. ఆరునెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యను ఆయన దృష్టికి తెచ్చాం. ఆయన అప్పుడు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు.
- తోకల శ్యామ్ కుమార్, లబ్బీపేట వాసి
హామీల ఊసేది
Published Mon, Jun 8 2015 3:13 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement